జూన్-1వరకు లాక్ డౌన్ పొడిగించిన సింగపూర్

కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో సింగపూర్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో,సిటీలో కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడిచేసేందుకు పాక్షిక్ష లాక్ డౌన్ ను జూన్-1,2020వరకు పొడిగించాలని సింగపూర్ నిర్ణయించింది. మే-4న లాక్‌డౌన్ పూర్తి కావాల్సి ఉన్నా మరో నాలుగువారాలు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు సింగపూర్ ప్రధాని లీ లూంగ్ ప్రకటించారు.
అయితే ఇంతకుముందు ఏప్రిల్ 7నుంచి మే-4వరకు కొన్ని పనిప్రదేశాలు,పాఠశాలలు నిర్వహించుకునేందుకు అనుమతిచ్చిన సింగపూర్ ప్రభుత్వం ఇప్పుడు కేసులు పెరిగిపోతుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పుడు జూన్-1వరకు అన్ని విద్యాసంస్థలు, పరిశ్రమలు మూసేయబడి ఉంటాయి.
సింగపూర్‌లో ప్రస్తుతం రోజుకు వెయ్యి చొప్పున కరోనా కేసులు నమోదవుతున్నాయి. సోమవారం ఒక్కరోజే సింగపూర్ లో 1,111కరోనా కేసులు నమోదయ్యాయి. సౌత్ ఈస్ట్ ఆసియా ఒక్కరోజులో ఇన్ని కరోనా కేసులు నమోదవడం సింగపూర్ లోనే జరిగింది. కాగా,సింగపూర్‌లో ఇప్పటివరకూ మొత్తం 9,125 కరోనా కేసులు నమోదయ్యాయి.
అయితే 80శాతం కేసులు వలస కార్మికుల ద్వారా నమోదైనట్లు అధికారికంగా ప్రకటించారు. ఆసియా దేశాలకు చెందిన కూలీలు ఇక్కడి పరిశ్రమల్లో ఎక్కువగా పనిచేస్తుంటారు. ఎక్కువ వర్క్ ప్లేస్ లను ప్రభుత్వం మూసేస్తుందని ప్రధాని లీ తెలిపారు. కేవలం ఎసెన్షియల్ సర్వీసెస్ ను తెరిచేందుకు మాత్రమే అనుమతిస్తున్నట్లు తెలిపారు.