Afghanistan : పంజ్‌షీర్‌లో ఆగని పోరు..

తాలిబన్లు ఒక పంజ్‌షీర్‌ ప్రావిన్స్ మినహా అఫ్ఘానిస్తాన్ మొత్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. మిగిలిన పంజ్‌షీర్‌ కోసం బీకర యుద్ధం చేస్తున్నారు.

Afghanistan : పంజ్‌షీర్‌లో ఆగని పోరు..

Afghanistan (2)

Updated On : September 6, 2021 / 9:22 AM IST

Afghanistan :  తాలిబన్లు ఒక పంజ్‌షీర్‌ ప్రావిన్స్ మినహా అఫ్ఘానిస్తాన్ మొత్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. మిగిలిన పంజ్‌షీర్‌ కోసం బీకర యుద్ధం చేస్తున్నారు. పంజ్‌షీర్‌ ను తాలిబన్ల చేతిలోకి వెళ్లకుండా నేషనల్‌ రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ అఫ్ఘానిస్తాన్‌ తీవ్రంగా ప్రయత్నిస్తుంది. సరిహద్దుల్లోకి వచ్చిన వారిని వచ్చినట్లు మట్టుబెడుతోంది. ఎవరికి వారే పైచేయి తమదంటే తమదని చెప్పుకుంటున్నారు. ఇక తాజాగా ఖవాక్ మార్గంలో జరిగిన పోరులో 700 మందికిపైగా తాలిబన్లు హతమైనట్లు ప్రకటించాయి నేషనల్‌ రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌ బలగాలు. మరో 600 మందిని నిర్బంధించి జైళ్లలో పెట్టినట్లు తెలిపారు.

ఇదిలా ఉంటే తాము పంజ్‌షీర్‌ ప్రావిన్స్‌ లోని నాలుగు జిల్లాలను స్వాధీనం చేసుకున్నామని తాలిబన్లు ప్రకటించారు మొత్తం ఏడు జిల్లాలు ఉండగా వాటిలో షూతల్, అనాబా, ఖింజ్, ఉనాబాలలు తమ చేతుల్లోకి వచ్చినట్లు తాలిబన్ అధికార ప్రతినిధి బిలాల్‌ కరిమి వెల్లడించినట్టుగా అస్వాకా న్యూస్‌ ఏజెన్సీ కథనాన్ని ప్రచురించింది. బజారక్ లోకి ప్రవేశించి గవర్నర్ కార్యాలయాన్ని చుట్టుముట్టినట్లుగా వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని పంజ్‌షీర్‌ బలగాలు స్పష్టం చేశాయి.

ఇక ఇదిలా ఉంటే అఫ్ఘానిస్తాన్ మాజీ అధ్యక్షుడు నేషనల్‌ రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ అఫ్ఘానిస్తాన్‌ నేతృత్వం వహిస్తున్న అమ్రుల్లా సలేహ్‌ ఐక్యరాజ్యసమితికి లేఖ రాశారు. పంజ్‌షీర్‌ లోయపై తాలిబన్లు భీకరంగా దాడి చేస్తున్నారని, ఈ లోయలో మానవీయ సంక్షోభం ముంచుకొస్తుందని అఫ్ఘాన్‌ మాజీ అధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ సమాజం తాలిబన్ల దాడిని అడ్డుకొని చర్చల ద్వారా ఒక రాజకీయ పరిష్కారానికి కృషి చెయ్యాల్సిన అవసరం ఉందని సలేహ్‌ ఆ లేఖలో పేర్కొన్నారు.

తాలిబన్లతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు పంజ్‌షీర్‌ నేతలు చెబుతున్నారు. పంజ్‌షీర్, అంద్రాబ్‌ల నుంచి తమ బలగాలను ఉపసంహరించుకుంటే వారితో చర్చలకు సిద్ధమని ఎన్‌ఆర్‌ఎఫ్‌ఏ నాయకుడు అహ్మద్‌ మసూద్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఓ వైపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్న నేపథ్యంలో విమాన సర్వీసులను ప్రారంభించారు. శనివారం నుంచి పరిమిత సంఖ్యలో దేశీయ విమానాలు నడుపుతున్నారు. జాతీయ విమానసంస్థ అరియానా అఫ్గాన్‌ ఎయిర్‌లైన్స్‌హెరాత్, కాందహార్, బాల్ఖ్‌లకు విమానాలను నడిపింది. రాడార్‌ వ్యవస్థ లేనందువల్ల పగటి పూట మాత్రమే విమానాలు నడుస్తున్నాయి.