తాజ్ మహల్ సందర్శనకు ఆగ్రా చేరుకున్న ట్రంప్ దంపతులు

  • Published By: chvmurthy ,Published On : February 24, 2020 / 11:17 AM IST
తాజ్ మహల్ సందర్శనకు ఆగ్రా చేరుకున్న ట్రంప్ దంపతులు

Updated On : February 24, 2020 / 11:17 AM IST

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దంపతులు తాజ్ మహల్ సందర్శన కోసం  ఆగ్రా చేరుకున్నారు. వారికి ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాధ్, గవర్నర్ ఆనందీ బెన్ ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం పలికారు.  ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంప్రదాయ నృత్యాలు,సాంస్కృతిక కార్యక్రమాలను ట్రంప్  దంపతులు ఆసక్తిగా తిలకించారు.  ఎయిర్ పోర్టు వద్దనుంచి ట్రంప్ దంపతులు,కూతురు అల్లుడు తాజ్ మహాల్ వద్దకు  చేరుకున్నారు. ట్రంప్ పర్యటన సందర్భంగా తాజ్ మహల్ వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటుచేశారు. 

అంతకు ముందు ఆయన అహమ్మదాబాద్ లోని  మొతేరా స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో  ప్రధాని మోడీ పై ప్రశంసల జల్లు  కురిపించారు. భారత్‌ను ప్రగతి పథంలో తీసుకెళ్లేందుకు మోదీ అహర్నిశలు కృషి చేస్తున్నారని ట్రంప్‌ అన్నారు.   ఐదు నెలల క్రితం అమెరికాలోని అతిపెద్ద ఫుట్‌బాల్‌ మైదానంలో మోదీకి స్వాగతం పలికామని, ఇపుడు ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్‌ మైదానంలో తమకు భారత్‌ స్వాగతం పలికిందని సంతోషం వ్యక్తం చేశారు. 

70 ఏళ్లలోనే భారత్‌ అద్భుత శక్తిగా ఎదిగిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అన్నారు. ప్రపంచానికి భారత్‌ ఎదుగుదల ఓ మార్గదర్శకమని ఆయన స్ఫష్టం చేశారు. పారిశుధ్యం, పేదరిక నిర్మూనలో భారత్‌ ఎంతో పురోగతి సాధిస్తుందని, అద్భుత అవకాశాలకు నెలవని కొనియాడారు.  ఈ రోజునుంచి భారత్‌కు తమ గుండెల్లో ప్రత్యేక స్థానం ఉంటుందని, భారత్‌ ఆథిత్యం తమకు ఎంతగానో నచ్చిందని ట్రంప్‌ ఆనందం వ్యక్తం చేశారు.