భారతీయులకు మరో బిగ్ షాక్ ఇచ్చిన ట్రంప్, హెచ్-1బీ వీసాల జారీ సంవత్సరం చివరి వరకు రద్దు
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో బాంబు పేల్చారు. భారతీయులకు బిగ్ షాక్ ఇచ్చారు. కరోనా

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో బాంబు పేల్చారు. భారతీయులకు బిగ్ షాక్ ఇచ్చారు. కరోనా
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో బాంబు పేల్చారు. భారతీయులకు బిగ్ షాక్ ఇచ్చారు. కరోనా లోక్ డౌన్ నేపథ్యంలో ఈ నెల 21 వరకు అమెరికాలో వివిధ రంగాల్లో పనిచేసే వారికి హెచ్ 1బీ వీసాలను రద్దు చేస్తున్నట్టుగా ఇదివరకే ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ నిషేధాన్ని ఈ ఏడాది చివరి వరకు పొడిగిస్తూ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు హెచ్-1బీ, ఎల్-1, ఇతర తాత్కాలిక వీసాల జారీని రద్దు చేస్తూ ప్రత్యేక ఆదేశాల ఉత్తర్వులపై ట్రంప్ సంతకం చేశారు. ట్రంప్ తాజా నిర్ణయంతో ఉద్యోగాల కోసం అమెరికాకు వలస వెళ్లే 5.25 లక్షల విదేశీయులకు భారీ ఎదురు దెబ్బ తగిలింది.
స్థానికులకు ఉపాధి కల్సించడం కోసం:
ట్రంప్ నిర్ణయంతో H-1B వీసాలు, L వీసాలు, H-2B సీజనల్ వర్కర్ వీసాలు, J వీసాలతో అమెరికాలోకి వచ్చే వారికి తాత్కాలికంగా బ్రేక్ పడినట్లైంది. ఈ కొత్త ప్రత్యేక ఆదేశాలు జూన్ 24 నుంచి అమల్లోకి వస్తాయి. డిసెంబర్ 31 వరకూ అమల్లో ఉంటాయి. “అదనంగా వర్కర్లు ఆయా వీసాలతో అమెరికాలోకి వస్తే… అది స్థానిక ఉద్యోగ అవకాశాలకు సమస్యగా మారుతుంది. ఇప్పటికే కరోనా వైరస్ కారణంగా… అమెరికన్లతోపాటూ… అమెరికా ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది” అని ప్రత్యేక ఆదేశాల్లో తెలిపారు. అమెరికాలో నిరుద్యోగ తీవ్రతను తగ్గించుకోవడం కోసం, నైపుణ్యం గల వారికి మాత్రమే తమ దేశంలో చోటు ఇచ్చేందుకు ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. హెచ్1-బీ వీసాలతో పాటు అన్ని రకాల టెంపరరీ వర్క్ వీసాలపై తాత్కాలిక నిషేధం విధించారు. ఈ నిషేధానికి సంబంధించి మంగళవారం(జూన్ 23,2020) ఆర్డర్స్ జారీచేశారు. ఎల్-1పై అమెరికా వెళ్లిన భారత టెకీలు ట్రంప్ నిర్ణయంతో ఇప్పుడు అయోమయంలో పడ్డారు.
అమెరికాలో ఉద్యోగం చేయడానికి దాదాపు 2.40 లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఈ సమయంలో వీసాలను ప్రస్తుత సంవత్సరంలో పూర్తిగా రద్దు చేయడం ద్వారా అమెరికన్లకు ఉద్యోగాలను కల్పించవచ్చన్న ఆలోచనలో ట్రంప్ ఉన్నారు. ట్రంప్ నిర్ణయం వల్ల అత్యధిక నష్టం భారత ఐటీ నిపుణులకేనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. వారు వీసా స్టాంపింగ్ కోసం సంవత్సరం చివరి వరకు వేచి ఉండాల్సి వస్తుంది.
మళ్లీ అధ్యక్ష పీఠం ఎక్కేందుకు ట్రంప్ ఎత్తుగడలు:
2020 డిసెంబర్ వరకు భారతీయులతో పాటు ఏ దేశానికి చెందిన వారికి కూడా అమెరికాలో ఉద్యోగం దొరకదు. ఈ మొత్తంలో అధికంగా నష్టపోయేది భారతీయులే. ముఖ్యంగా వివిధ కంపెనీల నుంచి ఆఫర్ లెటర్స్ సిద్ధంగా ఉండి హెచ్ 1బీ వీసాల కోసం దరఖాస్తు చేసుకున్న లక్షలాది మంది ఐటీ నిపుణులు కూడా ట్రంప్ నిర్ణయంతో అయోమయంలో పడ్డారు. కరోనా వైరస్ అన్ని దేశాలతో పాటుగా అగ్రరాజ్యమైన అమెరికాను కూడా అతలాకుతలం చేసింది. ఈ సంక్షోభం కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన అమెరికన్లకు తిరిగి ఉపాధి కల్పించే విధంగా ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు వైట్ హౌస్ ప్రకటించింది. మరో నాలుగు నెలల్లో అధ్యక్ష ఎన్నికలను ఎదుర్కోవాల్సిన ట్రంప్, వ్యూహాత్మకంగా ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. ఎన్నికల సమయం నాటికి కనీసం 5 లక్షల మంది అమెరికన్లకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు ట్రంప్. అమెరికన్లకు మద్దతుగా చర్యలు తీసుకోవడం ద్వారా మరోసారి అధ్యక్ష పీఠాన్ని ఎక్కాలని ట్రంప్ ఎత్తుగడలు వేస్తున్నారు. విదేశీయుల్ని కట్టడి చెయ్యడం ద్వారా స్థానిక యువతలో క్రేజ్ తెచ్చుకోవాలని యత్నిస్తున్నారు. కాగా, ప్రస్తుతం ట్రంప్‌కి స్థానికంగా తీవ్ర వ్యతిరేకత ఉంది. ముఖ్యంగా కరోనాను ఆయన ఏమాత్రం కంట్రోల్ చెయ్యలేకపోయారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు.
హెచ్ 1బీ వీసాలతో పాటుగా హెచ్ 1బీ వీసాలు కలిగి ఉన్న భాగస్వాములకు ఇచ్చే హెచ్ 4 వీసా, కంపెనీల మధ్య బదిలీల కోసం అవసరమయ్యే ఎల్ 1 వీసా, వైద్యులు, పరిశోధకుల కు ఉపయోగపడే జె 1 వీసా లపై కూడా ట్రంప్ నిషేధాన్ని పొడిగించారు. అయితే ఆరోగ్య రంగంతో పాటుగా కరోనా వైరస్ పై పరిశోధనలు జరుపుతున్న నిపుణులకు మాత్రం వీటి నుంచి మినహాయింపునిచ్చారు.