Israel Palestine Conflict: పిచ్చి పనులు ఆపండి.. ఇజ్రాయెల్‭పై టర్కీ అధ్యక్షుడు ఆగ్రహం

అక్టోబర్ 7న, హమాస్ యోధులు ఇజ్రాయెల్ సరిహద్దును దాటి విధ్వంసం సృష్టించారు. ఇందులో సుమారు 1,400 మంది మరణించారు. వందలాది మంది ఇజ్రాయెల్ పౌరులు గాయపడ్డారు

Israel Palestine Conflict: పిచ్చి పనులు ఆపండి.. ఇజ్రాయెల్‭పై టర్కీ అధ్యక్షుడు ఆగ్రహం

Updated On : October 28, 2023 / 3:42 PM IST

Israel Palestine Conflict: ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధానికి సంబంధించి టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్ భారీ ప్రకటన చేశారు. ఇజ్రాయెల్ తీసుకున్న ప్రతీకార చర్యను ఎర్డోగన్ శనివారం పిచ్చి చర్యగా అభివర్ణించారు. గాజాపై దాడులను వెంటనే ఆపాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరుగుతున్న యుద్దం మూడు వారాలకు పైగా జరుగుతుండడం గమనార్హం. గత కొన్ని రోజులుగా ఇజ్రాయెల్ సైన్యం పాలస్తీనా భూభాగంపై దాడులను ముమ్మరం చేసింది.

ఇక దీనిపై ఎర్డగోన్ స్పందిస్తూ.. “గత రాత్రి గాజాపై ఇజ్రాయెల్ బాంబు దాడి తీవ్రం చేసింది. మరోసారి మహిళలు, పిల్లలు, అమాయక పౌరులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఇజ్రాయెల్ వెంటనే ఈ పిచ్చిని ఆపాలి. వెంటనే దాడులకు ముగింపు పలకాలి” అని ఎర్డోగన్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్‌ చేశారు. అంతకుముందు హమాస్ ఉగ్రవాద సంస్థ కాదని, విముక్తి సంస్థ అని ఎర్డోగన్ అన్నారు. తన భూమిని కాపాడుకోవడానికి వారు కష్టపడుతున్నారని అన్నారు. అయితే అప్పుడు కూడా యుద్ధాన్ని ఆపాలనే కోరారు. యుద్ధాన్ని ఆపడానికి ఇజ్రాయెల్‌పై ఒత్తిడి తీసుకురావాలని ప్రపంచ దేశాలను ఎర్డగాన్ అభ్యర్థించారు.

అక్టోబర్ 7న, హమాస్ యోధులు ఇజ్రాయెల్ సరిహద్దును దాటి విధ్వంసం సృష్టించారు. ఇందులో సుమారు 1,400 మంది మరణించారు. వందలాది మంది ఇజ్రాయెల్ పౌరులు గాయపడ్డారు. హమాస్ ఇజ్రాయెల్ భూభాగంపై దాడి చేసి 229 మందిని బందీలుగా తీసుకు వెళ్లింది. అందుకే వైమానిక దాడి తర్వాత ఇజ్రాయెల్ ఇప్పుడు భూదాడికి సిద్ధమవుతోంది. గాజాలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, ఇజ్రాయెల్ దాడుల్లో దాదాపు 3,000 మంది పిల్లలు సహా 7,300 మందికి పైగా మరణించారు.