ఎట్టకేలకు… బ్రెగ్జిట్‌కు బ్రిటన్ పార్లమెంట్ ఆమోదం

యూరోపియన్ యూనియన్ నుంచి వైదొలిగే బ్రెగ్జిట్ డీల్ కు ఎట్టకేలకు బ్రిటన్ లోని ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. గత 50 ఏళ్లుగా ప్రధాన వాణిజ్య భాగస్వామిగా ఉన్న ఈయూ నుంచి బ్రిటన్ వేరుపడనుంది. మూడు రోజుల పాటు సాగిన సుదీర్ఘ చర్చ అనంతరం గురువారం బ్రెగ్జిట్ డీల్ పై జరిగిన ఓటింగ్‌లో 330-231 ఓట్ల తేడాతో బిల్లు నెగ్గింది. దీంతో బ్రెగ్జిట్ డీల్ అమలు దిశగా ఓ కీలక అవరోధాన్ని బ్రిటన్ దాటినట్లయింది. ఇక హౌస్ ఆఫ్ లార్డ్స్ (ఎగువ సభ) నిర్ణయమే తరువాయి.
సాధారణంగా దిగువసభ తీసుకున్న నిర్ణయాన్ని ఎగువసభ జాప్యం చేయగలదు తప్ప దాన్ని తిరస్కరించలేదు. దీంతో ఐరోపాసమాజ దేశాల సమాఖ్య నుంచి డెడ్‌లైన్ లోగా అంటే జనవరి 31లోగా బ్రిటన్ వైదొలగడం దాదాపుగా ఖరారైనట్లు అర్థమవుతోంది. ఈ నెల 31న ఈయూ నుంచి బ్రిటన్ అధికారికంగా వైదొలగనుంది. ఐరోపా సమాఖ్య నుంచి విడిపోతున్న మొదటి దేశంగా బ్రిటన్ అవతరించనుంది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బోరిస్ జాన్సన్ నేతృత్వంలోని కన్జర్వేటివ్ పార్టీకి పూర్తి మెజార్టీ రావడంతో బిల్లు పార్లమెంట్‌లో సునాయాసంగా గట్టెక్కింది.
బ్రెగ్జిట్‌పై తొలి నుంచి వాదోపవాదాలు కొనసాగాయి. ఈయూ నుంచి విడిపోతే బ్రిటన్ సామాన్య దేశంగా మిగిలిపోతుందని, వాణిజ్యపరంగా నష్టపోతుందని పలువురు వాదించగా.. బ్రెగ్జిట్‌తో బ్రిటన్‌కు లాభమేనని, గతవైభవం సాధించేందుకు ఇదే మార్గమని మరి కొందరు వాదించారు. ఇక బ్రెగ్జిట్ బిల్లు హౌజ్ ఆఫ్ లార్డ్స్, యూరోపియన్ పార్లమెంట్ ఆమోదం పొందాల్సి ఉంది. అయితే, అది లాంఛనమేనని భావిస్తున్నారు.