Poland Warplanes : రష్యా విమానాలతో రష్యాపై యుక్రెయిన్ వార్.. యుక్రెయిన్‌కు పోలెండ్ యుద్ధ విమానాలు…?
పోలెండ్ నుంచి యుక్రెయిన్‌కు యుద్ధ విమానాలను బదలాయించే అంశంపై వైట్‌హౌస్ దృష్టిపెట్టింది. పోలెండ్ వద్ద రష్యా తయారీ మిగ్, సుఖోయ్ యుద్ధవిమానాలున్నాయి.

War Planes
Poland warplanes to Ukraine : రష్యాపై రష్యా ఆయుధాలతో యుద్ధం… యుక్రెయిన్ అనుసరిస్తున్న సరికొత్త యుద్ధతంత్రం ఇది. రష్యా విమానాలను రష్యా తయారీ విమానాలతో కూల్చేయాలన్న ప్లాన్ చేస్తోంది యుక్రెయిన్. రష్యా మిగ్ యుద్ధ విమానాలను నాటో దేశాల నుంచి యుక్రెయిన్ సమకూర్చుకుంటోంది. అమెరికా చట్టసభ సభ్యులను ఉద్దేశించి మాట్లాడిన జెలెన్‌స్కీ…. తమకు యుద్ధవిమానాలు అందిస్తే రష్యాను గట్టిగా ఎదుర్కొంటామన్నారు.
యుక్రెయిన్‌పై దండయాత్ర మొదలుపెట్టిన రోజే రష్యా తమ ఎయిర్ డిఫెన్స్‌ను ధ్వంసం చేసిందని ఇప్పుడు తమకు అమెరికా సాయం కావాలని జెలెన్‌స్కీ కోరారు. వేరే యుద్ధవిమానాలను తమ పైలెట్లు నడపలేరు కాబట్టి తమకు మిగ్ విమానాలను ఇవ్వాలని కోరారు. దీంతో ఏం చేయాలనేదానిపై అమెరికా దృష్టి పెట్టింది. పోలెండ్ నుంచి యుక్రెయిన్‌కు యుద్ధ విమానాలను బదలాయించే అంశంపై వైట్‌హౌస్ దృష్టిపెట్టింది. పోలెండ్ వద్ద రష్యా తయారీ మిగ్, సుఖోయ్ యుద్ధవిమానాలున్నాయి.
వీటిని యుక్రెయిన్ పైలెట్లు నడపగలరు. కాబట్టి వాటిని పోలెండ్ నుంచి యుక్రెయిన్‌కు బదలాయించాలని భావిస్తోంది. బదులుగా పోలెండ్‌కు తమ అత్యాధునిక F-16 వార్‌ప్లేన్లను అందచేయాలన్నది అమెరికా ఆలోచనగా కనిపిస్తోంది. దీనికి సంబంధించి నాటో సభ్య దేశాలతో మాట్లాడాలని అమెరికా భావిస్తోంది. అయితే దీనికి చాలా సాంకేతిక సమస్యలున్నాయని అమెరికా అంటోంది. ఇప్పటికే దీనిపై పోలెండ్‌తో మాట్లాడినట్లు అమెరికా చెబుతోంది.
పోలెండ్, బల్గేరియ, స్లోవేకియా వంటి తూర్పు యూరోపియన్ దేశాల దగ్గర రష్యా తయారీ యుద్ధవిమానాలు ఉన్నాయి. అమెరికా తమకు గ్యారెంటీ ఇస్తే తమ యుద్ధవిమానాలను యుక్రెయిన్‌కు ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నాయి. రష్యా తయారీ మిగ్‌లు చాలా పాతవి కావడంతో పోలెండ్ కూడా వాటిని వదిలించుకోవాలనుకుంటోంది. ఆ స్థానంలో కొత్త F-16లు రావడం తమకు లాభదాయకమే అని పోలెండ్ భావిస్తోంది. అయితే పోలెండ్ నిర్ణయంపై రష్యా ఎలా స్పందిస్తుందన్నది చూడాల్సి ఉంది.
Russian Attack : రష్యా దాడితో పారిపోయిన యుక్రెయిన్ సైనికులు
ఇప్పటికే పోలెండ్‌పై రష్యా గుర్రుగా ఉంది. నాటో దేశాలు అందిస్తున్న సాయం అంతా పోలెండ్ మీదుగానే యుక్రెయిన్‌కు చేరుతోంది. ఇప్పుడు కనుక తన యుద్ధవిమానాలను యుక్రెయిన్‌కు ఇస్తే చూస్తూ ఉరుకునే అవకాశాలు లేవు. రష్యా తర్వాతి టార్గెట్ పోలెండ్ అని ఇప్పటికే జెలెన్‌స్కీ ఆరోపించారు కూడా. పైగా దీన్ని నేరుగా తమపై యుద్ధంగానే రష్యా చూస్తుంది. దీంతో మరింత ఘాటుగా స్పందించే అవకాశాలు లేకపోలేదు.
యుక్రెయిన్‌ను అమెరికా నమ్మించి మోసం చేసిందన్న ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయుధ సాయం పేరుతో ఎంతో కొంత అందించి వ్యతిరకేతను తగ్గించుకునే ప్రయత్నం చేసింది బైడెన్ సర్కార్. ఇప్పుడు అనూహ్యంగా జెలెన్‌స్కీ దగ్గర్నుంచి యుద్ధవిమానాల ప్రతిపాదన రావడంతో ఎలా ముందుకెళ్లాలన్నదానిపై ఆలోచనలు చేస్తోంది. ఈ త్రీవే డీల్ వినడానికి బాగానే ఉన్నా… రష్యా ఎలా తీసుకుంటుందన్నది కూడా బైడెన్ సర్కార్ ఆలోచిస్తోంది