విడాకుల కేసు టెన్షన్ : మనిషి డీఎన్ఏను మార్చేస్తుందని.. మోడెర్నా వ్యాక్సిన్ 500 డోస్‌లను ధ్వంసం చేశాడు!

US pharmacist destroyed 500 doses of Moderna vaccine: విడాకుల కేసు టెన్షన్‌లో విస్కాన్సిన్ ఫార్మసిస్టు.. మనిషి డీఎన్ఏను మార్చేస్తుందని మోడెర్నా వ్యాక్సిన్ 500 డోస్ లను నేలపాలు చేశాడు. కరోనా వ్యాక్సిన్లు అందరికి సరిపోయేంతగా అందుబాటులోకి వస్తాయా లేదా అని ప్రజలంతా టెన్షన్ పడుతుంటే.. ఈ ఫార్మసిస్టు విలువైన కరోనా వ్యాక్సిన్ డోస్ లను ధ్వంసం చేశాడు. ప్రజలకు వ్యాక్సిన్ ఇచ్చేందుకు రెడీ చేసిన ఈ టీకాలను నేలపాలు చేసినందుకు పోలీసులు ఫార్మసిస్టును అరెస్ట్ చేశారు. అరోరా మెడికల్ సెంటర్‌లో ఫార్మసిస్టుగా పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కావాలనే కొవిడ్ ట్రయల్స్‌ను ధ్వంసం చేశానంటూ ఫార్మసిస్టు పోలీసుల ముందు తప్పు ఒప్పుకున్నాడట.
విస్కాన్సిన్ గ్రాఫ్టన్‌లో ఉన్న అరోరా మెడికల్ సెంటర్‌లో 46ఏళ్ల Steven Brandenburg ఫార్మసిస్టుగా పనిచేస్తున్నాడు. మోడర్నా వ్యాక్సిన్లు 57 వయల్స్ కనిపించగానే వాటిని ఆగ్రహంతో ధ్వంసం చేసేశాడు. నేలపాలైన వ్యాక్సిన్ మోతాదులు మొత్తం 500కు చేరినట్టు అధికారులు వెల్లడించారు. వ్యాక్సిన్ వయల్స్ స్టోర్ చేసిన రిఫ్రిజిరేటర్ నుంచి బయటకు తీసి 12 గంటలు అలానే ఉంచాడు. గమనించిన అధికారులు వెంటనే అతన్ని అడ్డుకున్నారు.
అనంతరం స్టీవెన్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు స్టీవెన్ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మోడర్నా వ్యాక్సిన్ ప్రజలకు హాని చేస్తుందని అంటున్నాడు. ఈ టీకాలు తీసుకున్నవారిలో డీఎన్‌ఏ మారిపోతుందని తాను బలంగా నమ్ముతున్నాడు. అందుకే ఈ మోడెర్నా టీకా మోతాదులను ధ్వంసం చేయాలని నిర్ణయించుకున్నట్టు ఒప్పుకున్నాడు.
బ్రాండెన్‌బర్గ్.. ఎందుకు ఇలా ప్రవర్తించడాన్ని పోలీసులు ఆరా తీయగా.. అతడు కొన్నాళ్లుగా మానసికంగా బాధపడుతున్నాడని గుర్తించారు. అంతేకాదు.. విడాకుల కేసు ఒకటి కోర్టులో నడుస్తోంది. విడాకుల కేసు టెన్షన్ లో ఉన్న అతడు మానసిక సమస్యలతో బాధపడుతున్నాడని అతడి తరపు న్యాయవాది తెలిపారు. ఆ చిరాకులోనే కరోనా వ్యాక్సిన్లను ధ్వంసం చేసి ఉంటాడని కోర్టుకు న్యాయవాది విన్నవించారు.