కొవిడ్-19 వ్యాక్సిన్ డోసు ధర రూ.3వేలు!

యావత్ ప్రపంచం కరోనా వ్యాక్సిన్ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తోంది. ఎప్పుడెప్పుడు టీకా వస్తుందా, ఎప్పుడెప్పుడు కరోనా నుంచి విముక్తి లభిస్తుందా అని తీవ్రంగా నిరీక్షిస్తున్నారు. కాగా పలు కంపెనీలు ఇప్పటికే టీకా తయారీలో విశేషమైన ప్రగతిని సాధించాయి. మరి కొన్ని నెలల్లో వ్యాక్సిన్ ను మార్కెట్ లోకి రిలీజ్ చేస్తామని విశ్వాసంగా చెబుతున్నాయి. కాగా వ్యాక్సిన్ ధర ఎంత ఉంటుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
గ్లోబల్ కరోనా వైరస్ వ్యాక్సిన్స్ ఫండింగ్ స్కీమ్ కోఆర్డినేటర్లు కరోనా వ్యాక్సిన్ ధరపై ఫోకస్ పెట్టారు. ఒక డోసు వ్యాక్సిన్ ధరని 40 డాలర్లుగా(రూ.3వేలు) నిర్ణయించాలని అనుకుంటున్నారు. GAVI వ్యాక్సిన్ అలయన్స్ సీఈవో సెత్ బెర్క్ లీ వ్యాక్సిన్ ధరపై స్పందించారు. ఇంకా ధర ఎంత పెట్టాలి అనేది నిర్ణయించలేదన్నారు. చర్చలు జరుపుతున్నామని వెల్లడించారు. ధనిక, పేద దేశాలన్నింటికి అందుబాటులో ఉండే విధంగా వ్యాక్సిన్ ధర నిర్ణయిస్తామన్నారు.
కాగా, కోవాక్స్(COVAX) ఫెసిలిటీ, ధనిక దేశాలకు కరోనా వ్యాక్సిన్ డోసు ధరను 40 డాలర్లు పెట్టాలని నిర్ణయించాలని అనుకుంటున్నట్టు యూరోపియన్ వర్గాలు గతవారం చేసిన వ్యాఖ్యలను బెర్క్ లీ కొట్టిపారేశారు. అలాంటిదేమీ లేదన్నారు. ఇంకా ధర నిర్ణయించ లేదన్నారు. ధనిక, పేద అనే తేడా లేకుండా అందరికీ అందుబాటులో ఉండే విధంగా ధరను నిర్ణయిస్తామన్నారు.
కాగా, కోవాక్స్ స్కీమ్ ధనిక దేశాలకు వ్యాక్సిన్ ధరను 40డాలర్లుగా నిర్ణయిస్తే, తాము అందుకు అంగీకరించమని, మరింత తక్కువ ధరలో వ్యాక్సిన్ తయారీకి కోవాక్స్ స్కీమ్ వెలుపల వేరే సంస్థలతో డీల్ చేసుకుంటామని ఈయూ వర్గాలు చెప్పాయి. ఈయూ వర్గాలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బెర్క్ లీ అన్నారు. వ్యాక్సిన్ ధర ఎంత ఉండాలి అనే దానిపై చర్చలు మాత్రమే జరిగాయన్నారు. ఇంకా ధరను ఫిక్స్ చేయలేదన్నారు. చర్చల్లో భాగంగా ధనిక దేశాలకు 40డాలర్లుగా నిర్ణయిస్తే ఎలా ఉంటుంది అనే అభిప్రాయం మాత్రమే వ్యక్తమైందన్నారు.
GAVI, WHO, CEPI ఆధ్వర్యంలో కోవాక్స్ ఏర్పాటైంది. కొవిడ్ వ్యాక్సిన్ తయారయ్యాక వాటిని ప్రపంచవ్యాప్తంగా ఎలా యాక్సెస్ చేయాలి అనే దానిపై కోవాక్స్ ఫోకస్ పెట్టింది. 2021 నాటికి ప్రపంచవ్యాప్తంగా 2 బిలియన్ల(200కోట్లు) వ్యాక్సిన్ డోసులు సరఫరా చేయాలని కోవాక్స్ లక్ష్యంగా పెట్టుకుంది. 75కు పైగా దేశాలు కోవాక్స్ లో జాయిన్ కావడానికి ఆసక్తి చూపాయని GAVI తెలిపింది.
చాలా వ్యాక్సిన్లు ఇంకా తయారీ దశలోనే ఉన్నాయి, ఇటువంటి పరిస్థితుల్లో అంతిమ ధర నిర్ణయించడం సాధ్యం కాదని బెర్క్ లీ అభిప్రాయపడ్డారు. ”ఎవరికీ నిజం ఏంటో తెలీదు. ఎవరికీ ఐడియా కూడా లేదు. వ్యాక్సిన్ ధర ఎంత ఉంటుంది అనేది. ఎందుకంటే కరోనా వైరస్ పై ఏ వ్యాక్సిన్ సమర్థవంతంగా పని చేస్తుంది అనే విషయంపై ఇంకా ఎలాంటి స్పష్టత లేదు” అని బెర్క్ లీ అన్నారు. వ్యాక్సిన్ తయారీలో వాడిన టెక్నాలజీ, సింగిల్ డోస్ లేదా డబుల్ డోస్, మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్.. ఇవన్నీ వ్యాక్సిన్ ధరను ప్రభావితం చేసే అంశాలు అన్నారు.