కరోనా భయం : ఇంట్లోనే అమ్మకు బోనం

కరోనా నేపథ్యంలో ఏటా ఘనంగా నిర్వహించే ఆషాఢ బోనాల ఉత్సవాలను ఈసారి నిర్వహిస్తారా లేదా అన్న సస్పెన్స్ ఏర్పడింది. దీనిపై ప్రభుత్వం 2020, జూన్ 10వ తేదీ బుధవారం నిర్ణయం తీసుకోనుంది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన ఒక ఉన్నత స్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, మంత్రులు మహమూద్ అలీ, ఇంద్రకరణ్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డితోపాటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంట్ సభ్యులు, దేవాదాయ శాఖ కమిషనర్, ఉత్సవాల నిర్వాహకులు పాల్గొంటారు.
బోనాలు నిర్వహించాలా… వద్దా అన్న దానిపై నిర్ణయం తీసుకుంటారు. తెలంగాణ సంస్కృతికి నిలువెత్తు ప్రతీక బోనాలు. కానీ ఏ మహమ్మారుల నుంచి తమను కాపాడాలని అమ్మవారిని కోరుకొంటూ ఏటా బోనాలు జరుపుకొంటారో.. ఇప్పుడు ఏకంగా కరోనా వైరస్ సమాజంపై దండెత్తింది. ఈ విపత్కరమైన పరిస్థితుల్లో సామూహికంగా బోనాలు జరుపుకోవడం మరింత ప్రమాదకరమని పండితులు, అమ్మవారి దేవాలయాల పూజారులు, వైద్యులు అభిప్రాయపడుతున్నారు. ఇదెంతమాత్రం వాంఛనీయం కాదని చెప్తున్నారు.
వాస్తవానికైతే.. సామూహిక ఆధ్యాత్మిక కార్యక్రమాలపై కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి లేదు. దీంతో బోనాల నిర్వహణపై ప్రజల్లో ఆందోళన నెలకొన్నది. ఊరేగింపుల్లో లక్షల సంఖ్యలో పాల్గొంటే వైరస్ భీకరంగా వ్యాపించే ప్రమాదం ఉన్నదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బోనం అంటే భోజనం. అమ్మవారికి భోజనం పెట్టడమే బోనాలు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులంతా కలిసి ఇంట్లోనే అమ్మవారికి నైవేద్యం సమర్పించడంలో దోషమేమీ ఉండదని పండితులు చెబుతున్నారు. రోగాలు రాకూడదని కోరుకొనే వారే..
రోగాల నడుమ ఊరేగింపులు, సామూహిక పూజా కార్యక్రమాల్లో పాల్గొనడం సరికాదని అంటున్నారు. ఇప్పటికే కరోనా మహమ్మారి ప్రజలపై యుద్ధంచేస్తున్నది. భౌతిక దూరం, వ్యక్తిగత పరిశుభ్రత కచ్చితంగా పాటించాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో బోనాలు నిర్వహించడమంటే… కరోనాను కొనితెచ్చుకోవడమే అవుతుంది.
బోనాల పండుగ అంటేనే జనమంతా ఒకచోట గుమిగూడుతారు. పదుల్లో.. వందల్లో కాదు.. బోనాల ఊరేగింపుల్లో వేలు, లక్షల సంఖ్యలో ప్రజలు పాల్గొంటారు. ఈ సమయంలో వైరస్ వ్యాప్తి భీకరంగా ఉండే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
దీనిపై పండితులు, ఆధ్యాత్మికవేత్తలు అమ్మవారికి ఇంట్లోనే కుటుంబ సభ్యుల నడుమ జరుపుకోవడం తప్పేమీ కాదని స్పష్టంచేస్తున్నారు ఈ క్రమంలోనే ఈ ఆషాఢంలో బోనాల పండుగ నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం నేడు ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నది. ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల ప్రతినిధులు, అధికారులు, పూజారుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని కీలక నిర్ణయం తీసుకునే చాన్స్ ఉంది.
బోనాల పండుగపై ఇప్పటికే వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు సీఎం కేసీఆర్‌కు నివేదిక సమర్పించినట్లు తెలుస్తోంది. ఏటా ఆషాఢ మాసం ప్రారంభం మొదలు ముగిసే వరకు గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో బోనాల సందడి ఉంటుంది. తొలుత గోల్కొండ బోనాలు, తర్వాత లష్కర్, చివరికి లాల్‌దర్వాజ బోనాలతో ఈ సంబురాలు ముగుస్తాయి. ఆ తర్వాత శ్రావణ మాసంలో తెలంగాణ అంతటా బోనాల పండుగ జరుపుకొంటారు. ఈ వేడుకల్లో లక్షలాది మంది పాల్గొంటారు. దేవతలకు బోనాలు సమర్పించడంతోపాటు మద్యం సేవించి, మాంసాహార వంటకాలతో విందు చేసుకుంటారు.
ఇది తెలంగాణలో లక్షలాది కుటుంబాలు బంధు మిత్రులతో కలిసి సామూహికంగా జరుపుకొనే పండుగ. ఈ నెల 22 నుంచి ఆషాఢ మాసం మొదలవుతుండగా, బోనాల పండుగ ఏర్పాట్లకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. కానీ, రాష్ట్రంలో కరోనా వ్యాధి ప్రబలుతున్న క్రమంలో బోనాల పండుగకు అనుమతించడం శ్రేయస్కరం కాదని వైద్య, ఆరోగ్య శాఖ హెచ్చరిస్తోంది.