జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు…పుంజుకున్న బీజేపీ, బలహీనపడిన టీఆర్‌ఎస్‌

  • Published By: bheemraj ,Published On : December 5, 2020 / 07:51 AM IST
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు…పుంజుకున్న బీజేపీ, బలహీనపడిన టీఆర్‌ఎస్‌

Updated On : December 5, 2020 / 8:35 AM IST

GHMC election results : గ్రేటర్ ఎన్నికలు టీఆర్ఎస్‌ను అంతర్మథనంలో పడేస్తే.. బీజేపీలో రెట్టించిన ఉత్సాహాన్ని నింపాయి. తాము ఊహించని కంటే తక్కువ వచ్చాయని గులాబీ నేతలు నిరాశ వ్యక్తం చేయగా.. ఇకపై ఎన్నికలు ఏవైనా ఇవే ఫలితాలు రిపీట్‌ అవుతాయంటూ బీజేపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. మరోవైపు టీఆర్ఎస్‌ను నిలువరించిన బీజేపీ శ్రేణులకు.. అగ్ర నాయకత్వం నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.



ప్రతిష్టాత్మకంగా జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వచ్చాయి. గత ఎన్నికల్లో నలుగురు కార్పొరేటర్లకే పరిమితమైన బీజేపీ భారీగా పుంజుకుంది. ఈసారి 48 డివిజన్లలో కాషాయ జెండా రెపరెపలాడించింది. గ్రేటర్ ఓటర్లు టీఆర్‌ఎస్ పార్టీకి ఊహించని షాక్ ఇచ్చారు. పార్టీ నేతలు ఆశించిన దానికి కంటే తక్కువ సీట్లు కట్టబెట్టారు.



గతంలో 99 వస్తే.. ఈ సారి సెంచరీ కొడతామన్న అంచనాలను పటాపంచలు చేశారు. ఓటరు తీర్పుతో.. టీఆర్ఎస్ అంతర్మథనంలో పడింది. ఎంఐఎం ఎప్పటిలానే పాతబస్తీలో తన పట్టు నిలుపుకుంది. గతంలో కంటే ఓ స్థానాన్ని కల్పోయి 44చోట్ల విజయం సాధించింది. ఇక కాంగ్రెస్ పూర్తిగా చతికిల బడింది.



గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఫలితాలు ఆశించిన విధంగా రాలేదని మంత్రి కేటీఆర్ అన్నారు. మరో 20 నుంచి 25 వరకు సీట్లు వస్తాయని అంచనా వేశామన్నారు. చాలా స్థానాల్లో స్వల్ప ఓట్లతో ఓటమిపాలయ్యామన్నారు.

తెలంగాణలో టీఆర్‌ఎస్‌ పార్టీకి కౌంట్‌ డౌన్‌ ప్రారంభమైందన్నారు బీజేపీ తెలంగాణ చీఫ్‌ బండి సంజయ్‌.. సారు.. కారు.. ఇక రారు అంటూ ఎద్దేవా చేశారు.. తెలంగాణలో ఇక ఏ ఎన్నికలు జరిగినా ఇవే ఫలితాలు రిపీటవుతాయన్నారు బండి సంజయ్‌



GHMC ఎన్నికలలో అనూహ్య ఫలితాలు సాధించి.. టీఆర్ఎస్ ను నిలువరించిన బీజేపీకి అగ్ర నాయకత్వం నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. బల్దియా ఎన్నికలలో కమలం పార్టీ అనూహ్యంగా 48 స్థానాల్లో విజయం సాధించింది. దీంతో ఆ పార్టీ కార్యకర్తలు సంబురాలు చేసుకుంటున్నారు. మేయర్ పీఠం గెలవకున్నా.. టీఆర్ఎస్ కు సరైన ప్రత్యామ్నాయం తామేనని బీజేపీ చాటుకుంది. ఈ నేపథ్యంలో బీజేపీ మాజీ అధ్యక్షుడు, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు.



ఈ ఎన్నికల్లో అద్భుత ప్రదర్శన కనబరిచారని కొనియాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారధ్యంలో, అభివృద్ధి లక్ష్యంగా సాగిస్తున్న బిజెపి రాజకీయాలపై విశ్వాసం ఉంచిన తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. బీజేపీ కార్యకర్తల కృషి మరువరానిదన్నారు.