Today HeadLines : ఏపీలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా జిల్లాల విభజన చేస్తామని మంత్రి పొన్నం వెల్లడించారు.

Today HeadLines : ఏపీలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు

Today Headlines in Telugu at 11PM

ఏపీలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు 
ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. 30 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఏపీఎస్పీ అదనపు డీజీగా అతుల్ సింగ్, రైల్వే పోలీసు అదనపు డీజీగా విశ్వజిత్, ఆక్టోపస్ ఐజీగా సీహెచ్ శ్రీకాంత్, రోడ్ సేఫ్టీ అథారిటీ ఐజీగానూ శ్రీకాంత్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. విజిలెన్స అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఐజీగా కొల్లి రఘురామిరెడ్డి, డ్రగ్స్ డైరెక్టర్ జనరల్‌గా కొల్లి రఘురామిరెడ్డికి అదనపు బాధ్యతలు అప్పగించారు.

నిరంతర విద్యుత్ సరఫరాపై మంత్రి కీలక వ్యాఖ్యలు
తెలంగాణలో విద్యుత్ సరఫరాపై మంత్రి భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్నామని తెలిపారు. ఎక్కడా కోతలు విధించడం లేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. గత ఏడాదితో పోలిస్తే ఎక్కువ విద్యుత్ సరఫరా చేశామన్న భట్టి.. రానున్న వేసవిలోనూ పవర్ కట్స్ లేకుండా చూస్తామని చెప్పారు. వదంతులు నమ్మొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.

11మంది డైరెక్టర్ల తొలగింపు.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యుత్ శాఖలో డైరెక్టర్లను తొలగించింది. TSSPDCL, NSSPDCLలో 11మంది డైరెక్టర్లను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గత ప్రభుత్వంలో 9 ఏళ్లుగా వీరంతా పదవుల్లో కొనసాగుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వీరు పదవుల్లో ఉన్నట్లు గుర్తించిన తెలంగాణ సర్కార్.. వారిని తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

పార్లమెంటు ఎన్నికల తర్వాత.. జిల్లాల పునర్విభజనపై మంత్రి కీలక వ్యాఖ్యలు
తెలంగాణలో జిల్లాల పునర్ విభజనపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జిల్లాల పునర్విభజన సరిగా జరలేదన్న పొన్నం, పార్లమెంటు ఎన్నికల తర్వాత జిల్లాల పునర్విభజనపై నిపుణుల కమిటీ వేస్తామని తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా జిల్లాల విభజన చేస్తామని మంత్రి పొన్నం వెల్లడించారు.

ఏపీ, తెలంగాణ మధ్య సమస్యలకు త్వరలో చెక్
రెండు తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణ మధ్య ఉన్న సమస్యలు త్వరలోనే పరిష్కారం అవుతాయని ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి అన్నారు. రెండు రాష్ట్రాల మధ్య పంపకాలు జరగాల్సి ఉందన్నారు మల్లు రవి. పలు అంశాల్లో తెలుగు రాష్ట్రాలకు న్యాయం జరిగేలా పరిష్కారాలు ఉంటాయని ఆయన చెప్పారు.

ఎన్నికల్లో పోటీపై వైసీపీ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు
మైలవరంలో పోటీపై వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. మైలవంలో క్యాడర్ కు అధిష్టానమే స్పష్టత ఇవ్వాలన్నారు. ఫిబ్రవరి 4 లేదా 5వ తేదీన ప్రెస్ మీట్ పెట్టి అన్ని విషయాలు చెబుతాను అన్నారు. తన మనోభావాలు అన్నీ ఆ రోజే చెబుతానని తెలిపారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ఒక్క సీటు కూడా రాదు
కర్నాటకలో కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాదన్నారు కిషన్ రెడ్డి. బీఆర్ఎస్ కు తెలంగాణలో ఒక్క సీటు కూడా రాదన్నారు. కాంగ్రెస్ కు మజ్లిస్ సీటు తప్ప మరో సీటు రాదన్నారు. తెలంగాణలో మెజార్టీ సీట్లు బీజేపీకే వస్తాయన్నారు. తెలంగాణ ప్రజలు ఒక్క సుస్థిరమైన నాయకత్వం కోరుకుంటున్నారని ఆయన చెప్పారు. ప్రధానంగా రెండు వర్గాలు.. మహిళలు(70శాతం), యువత(70శాతం).. బీజేపీకి అనుకూలంగా ఉన్నాయని తెలిపారు.

బీజేపీతో ఎప్పుడూ చేతులు కలపలేదు
ఈ దేశ లౌకికవాదాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడగలిగే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ తప్ప మరొక రాజకీయ పార్టీ ఏదీ లేదన్నారు తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. కాంగ్రెస్ పార్టీని నమ్మాలని, కాంగ్రెస్ పార్టీకే ఓటు వేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ దేశంలో బీజేపీతో ఎప్పుడూ చేతులు కలపని పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ మాత్రమే అన్నారాయన. మాది ప్రజల ప్రభుత్వం అన్న భట్టి విక్రమార్క.. ప్రజా సమస్యల పరిష్కారమే మన అందరి ముందున్న ప్రధాన అజెండా అని చెప్పారాయన. సికింద్రాబాద్ సీతాఫల్ మండిలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో భట్టి మాట్లాడారు.


56 రాజ్యసభ స్థానాలకు ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల‌

15 రాష్ట్రాల్లో ఏప్రిల్ 2, 3 తేదీల నాటికి ఖాళీ అవుతున్న 56 రాజ్యసభ స్థానాలకు ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌లైంది. తెలుగు రాష్ట్రాల నుంచి మూడేసి చొప్పున‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ నుంచి అత్య‌ధికంగా 10 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఈ ఖాళీల‌కు ఫిబ్రవరి 8న నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ల దాఖలుకు ఆఖరుతేది ఫిబ్రవరి 15. ఫిబ్రవరి 16 నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకి ఫిబ్రవరి 20 గడువు కాగా.. ఫిబ్రవరి 27 ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జ‌ర‌గ‌నుంది. అదే రోజు సాయంత్రం 5 గంట‌ల‌కు ఓట్ల లెక్కింపు చేప‌ట్ట‌నున్నారు.

ఇన్న‌ర్ రింగ్ రోడ్డు కేసులో ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ..
ఇన్న‌ర్ రింగ్ రోడ్డు కేసులో సుప్రీం కోర్టులో తెలుగు దేశం పార్టీ అధినేత‌ చంద్ర‌బాబు నాయుడికి ఊరట ల‌భించింది. చంద్ర‌బాబు ముంద‌స్తు బెయిల్ ర‌ద్దు చేయాలంటూ దాఖ‌లైన ఏపీ ప్ర‌భుత్వ పిటిష‌న్‌ను దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం కొట్టివేసింది. హైకోర్టు అన్ని అంశాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకునే ఉత్త‌ర్వులు ఇచ్చింద‌ని, కేసు ద‌ర్యాప్తుపై ముంద‌స్తు బెయిల్ ప్ర‌భావం ఉండ‌ద‌న్న సుప్రీం కోర్టు తెలిపింది. ఈ క్ర‌మంలో చంద్ర‌బాబుకు నోటీసులు ఇచ్చేందుకు నిరాక‌రించింది. ఈ ద‌శ‌లో కేసులో జోక్యం చేసుకోలేమ‌ని వెల్ల‌డించింది.

ద‌గ్గుబాటి ఫ్యామిలీపై కేసు న‌మోదు
టాలీవుడ్ న‌టులు దగ్గుబాటి వెంకటేష్‌, రానాలకు నాంపల్లి కోర్టు షాకిచ్చింది. ఫిలింనగర్‌ డెక్కన్‌ కిచెన్‌ కూల్చివేత కేసులో దగ్గుబాటి కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దగ్గుబాటి వెంకటేష్‌, సురేష్‌, రానా, అభిరామ్‌లపై కేసు నమోదు చేయాలని పోలీసులకు నాంపల్లి క్రిమినల్‌ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. నంద‌కుమార్ పిర్యాదు మేర‌కు విచార‌ణ జ‌రిపిన నాంప‌ల్లి క్రిమిన‌ల్ కోర్టు ఈ మేర‌కు ఆదేశాలు జారీ చేసింది.

ఏమైనా జ‌ర‌గొచ్చు..
రష్యాతో జరుగుతున్న ఘర్షణ మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉందని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలిపారు. అమెరికా సహా చాలా దేశాలు తమకు మద్దతుగా నిలుస్తున్న క్ర‌మంలో ఏమైనా జరగొచ్చని వ్యాఖ్యానించారు. ఈ విషయం జర్మనీ ఛాన్స్‌లర్‌ ఒలాఫ్‌ షోల్జ్‌కు కూడా తెలుసన్నారు. ఒకవేళ నాటో కూటమిలోని సభ్య దేశంపై రష్యా దాడి చేస్తే అది మరో ప్రపంచ యుద్ధానికి నాందిగానే భావించాల్సి ఉంటుంద‌ని జెలెన్‌స్కీ హెచ్చ‌రించారు.

6 రోజుల్లో 19ల‌క్షల మంది భ‌క్తులు
అయోధ్య‌లోని శ్రీరాముడిని ద‌ర్శించుకునేందుకు భ‌క్తులు పోటెతున్నాడు. ఈ నెల‌22న ప్రాణ ప్ర‌తిష్ట కార్య‌క్ర‌మం జ‌రుగుగా 23వ తేదీ నుంచి సామాన్య భ‌క్తుల‌ను స్వామి వారిని ద‌ర్శించుకునేందుకు అనుమ‌తి ఇచ్చారు. 6 రోజుల్లో దాదాపు 19 ల‌క్ష‌ల మంది భ‌క్తులు రాములోరిని ద‌ర్శించుకున్న‌ట్లు ఆల‌య ట్ర‌స్ట్ వ‌ర్గాలు తెలిపాయి. 23న 5ల‌క్ష‌లు, 24న 2.5ల‌క్ష‌లు, 25న 2ల‌క్ష‌లు, 26న‌ 3.5ల‌క్ష‌లు, 27న 2.5ల‌క్ష‌లు, 28న 3.25ల‌క్ష‌ల మంది బాల‌రాముడిని ద‌ర్శించుకున్నారు.

బెయిల్‌ రద్దు పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ
ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ భూకుంభ కోణం కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్‌ రద్దు చేయాలని కోరుతూ దాఖ‌లైన‌ పిటిషన్‌పై నేడు (సోమవారం) సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తాలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించ‌నుంది. ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ కేసులో చంద్రబాబుకి జనవరి 10వ తేదీన ఏపీ హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.

తిరుమ‌ల స‌మాచారం
తిరుమ‌లలో భ‌క్త‌లు ర‌ద్దీ సాధార‌ణంగా ఉంది. స్వామి వారి ద‌ర్శ‌నం కోసం 21 కంపార్టుమెంట్ల‌లో భ‌క్తులు వేచి ఉన్నారు. శ్రీవారి స‌ర్వ‌ద‌ర్శ‌నానికి 12 గంట‌ల స‌మయం ప‌డుతోంది. నిన్న శ్రీవారిని 85,142 మంది భ‌క్తులు ద‌ర్శించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.5.04కోట్లుగా ఉంది.

మిర్యాల‌గూడ‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం
మిర్యాల‌గూడ‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. కృష్ణ మాన‌స కాల‌నీ బైపాస్ వ‌ద్ద అదుపు త‌ప్పి బోల్తా ప‌డిన కారును లారీ ఢీ కొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో ఐదుగురు దుర్మ‌ర‌ణం చెందగా మ‌రొక‌రు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని తీవ్రంగా గాయ‌ప‌డిన వ్య‌క్తిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. మృతుల‌ను మ‌హేశ్ (35), జ్యోతి (30), మ‌చ్చేంద‌ర్ (38), ఇషిక (8), లియాన్స్ (2) గా గుర్తించారు. వీరంతా దైవ ద‌ర్శ‌నానికి వెళ్లి వ‌స్తుండ‌గా ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లుగా పోలీసులు తెలిపారు.

టీడీపీ, వైసీపీ రెబల్ ఎమ్మెల్యేల హాజరుపై ఉత్కంఠ
టీడీపీ, వైసీపీ రెబ‌ల్ ఎమ్మెల్యే అన‌ర్హ‌త పిటిష‌న్‌ల పై నేడు స్పీకర్ తమ్మినేని సీతారాం విచార‌ణ చేప‌ట్ట‌నున్నారు. ఉదయం వైకాపా రెబల్ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రాం నారాయణ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి లను, మ‌ధ్యాహ్నం తెలుగుదేశం రెబెల్ ఎమ్మెల్యేలు కరణం బలరాం, మద్దాలి గిరిధర్, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేష్ ల విచారించ‌నున్నారు. అనర్హత పిటిషన్లపై సమాధానం ఇవ్వడానికి 30 రోజుల సమయం కావాలన్న వైకాపా రెబెల్ ఎమ్మెల్యేల వినతిని స్పీక‌ర్ తిర‌స్క‌రించారు.

నేడు రాజ‌మండ్రిలో ‘రా క‌దిలిరా’
టీడీపీ అధినేత చంద్ర‌బాబు చేప‌ట్టిన రా క‌దలిరా కార్యక్ర‌మం నేడు కొన‌సాగ‌నుంది. రాజ‌మండ్రి, పొన్నూరుల‌లో బ‌హిరంగ స‌భ‌లు నిర్వ‌హించ‌నున్నారు. ఇందుకోసం ఈ ఉద‌యం క‌ర్నూలు విమానాశ్ర‌యం నుంచి రాజ‌మ‌హేంద్ర‌వ‌రానికి చంద్ర‌బాబు చేరుకోనున్నారు. కేతేరు గ్రామంలో బ‌హిరంగ స‌భ‌లో పాల్గొంటారు. ఆ త‌రువాత మధ్యాహ్నం హెలికాఫ్టర్‌లో పొన్నూరు నియోజకవర్గం చేబ్రోలు మండలం వడ్లమూడి గ్రామం చేరుకుని రాకదలిరా సభలో చంద్ర‌బాబు పాల్గొనున్నారు.

శ్రీలంక క్రికెట్‌పై నిషేదం ఎత్తేసిన ఐసీసీ
శ్రీలంక క్రికెట్‌కు అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) శుభ‌వార్త చెప్పింది. గ‌తేడాది న‌వంబ‌ర్‌లో శ్రీలంక క్రికెట్ పై విధించిన నిషేదాన్ని ఐసీసీ ఎత్తివేసింది. గ‌త కొంత‌కాలంగా లంక క్రికెట్ బోర్డు పై ఓ క‌న్నేసి ఉంచిన ఐసీసీ.. బోర్డు తీసుకుంటున్న చ‌ర్య‌ల ప‌ట్ల సంతృప్తిని వ్య‌క్తం చేస్తూ ఈ నిర్ణ‌యం తీసుకుంది.

ఫిబ్ర‌వ‌రి 4న‌ జ‌న‌సేన ఎన్నిక‌ల శంఖారావం
జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఉత్త‌రాంధ్ర నుంచి ఎన్నిక‌ల శంఖం పూరించ‌నున్నారు. ఫిబ్ర‌వ‌రి 4న అన‌కాప‌ల్లిలో భారీ బ‌హిరంగ స‌భ నిర్వ‌హించ‌నున్నారు. ఈ స‌భ ఏర్పాట్ల కోసం రేపు అన‌కాప‌ల్లిలో పార్టీ నేత‌లు స‌న్నాహ‌క స‌మావేశం నిర్వ‌హించ‌నున్నారు. కాగా.. ఆ రోజునే మాజీ ఎంపీ కొణ‌తాల రామ‌కృష్ణ అధికారికంగా జ‌న‌సేన‌లో చేర‌నున్నారు.

ఫిబ్ర‌వ‌రి రెండో వారంలో బ‌డ్జెట్ స‌మావేశాలు
శాస‌న స‌భ బ‌డ్జెట్ స‌మావేశాల‌ను ఫిబ్ర‌వ‌రి రెండో వారం నుంచి నిర్వ‌హించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఓట్ ఆన్ అకౌంట్ ప్ర‌వేశ‌పెడితే నాలుగైదు రోజులు.. పూర్తి స్థాయి బ‌డ్డెట్ ప్రవేశ‌పెడితే వారం రోజుల పాటు ఈ స‌మావేశాలు జ‌ర‌గ‌నున్నాయి. ఇప్ప‌టికే ఆర్థిక శాఖ మంత్రి మ‌ల్లు భ‌ట్టివిక్ర‌మార్క అన్ని శాఖ‌ల మంత్రులు, ఉన్న‌తాధికారుల‌తో స‌మావేశాల‌ను నిర్వ‌హిస్తున్నారు.