Top Headlines : అంగన్ వాడీ కార్యకర్తల సంఘాలతో చర్చలు విఫలం.. ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ రోడ్డు ప్రమాదంపై కుటుంబసభ్యుల అనుమానాలు

తన కోసం ట్రాఫిక్‌ని ఆపవద్దంటూ పోలీసు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ట్రాఫిక్‌కి ఇబ్బంది లేకుండా తన కాన్వాయ్ వెళ్లేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.

Top Headlines : అంగన్ వాడీ కార్యకర్తల సంఘాలతో చర్చలు విఫలం.. ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ రోడ్డు ప్రమాదంపై కుటుంబసభ్యుల అనుమానాలు

Today Headlines in Telugu at 11PM

Updated On : December 15, 2023 / 10:58 PM IST

చర్చలు విఫలం.. సమ్మె కొనసాగింపు..
అంగన్ వాడీ కార్యకర్తల సంఘాలతో ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలం అయ్యాయి. దాంతో అంగన్ వాడీల నిరవధిక సమ్మె కొనసాగుతోంది.
ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం ప్రకారం తెలంగాణ కన్నా ఒక వెయ్యి రూపాయలు ఎక్కువ జీతం పెంచుతున్నాం అని అంగన్వాడీలకు మాట ఇచ్చారని గుర్తు చేశారు. జీతం, గ్రాట్యుటీ విషయంలో పురోగతి లేదన్నారు.

మంత్రులు వెంటనే ముఖ్యమంత్రితో చర్చించాలని అంగన్ వాడీలు డిమాండ్ చేశారు.

 

రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. తనకోసం ట్రాఫిక్‌ని ఆపవద్దంటూ పోలీసు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ట్రాఫిక్‌కి ఇబ్బంది లేకుండా తన కాన్వాయ్ వెళ్లేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. సాధారణ ట్రాఫిక్‌లోనే తన కాన్వాయ్‌ని అనుమతించాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి కాన్వాయ్ వెళ్తున్న సమయంలో వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు.

లొంగిపోయిన మరో కీలక సూత్రధారి
ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ కౌంటర్ ఇంటెలిజెన్స్ పార్లమెంట్ హౌస్ భద్రతను ఉల్లంఘించిన కేసులో ఆరో నిందితుడు మహేష్‌ను కూడా అరెస్టు చేసింది. ఈ కేసులో గతంలో అరెస్టయిన లలిత్ ఝా, మహేష్‌లు ఈ మొత్తం కేసుకు సూత్రధారులుగా పోలీసులు భావిస్తున్నారు. వీరిద్దరూ కలిసి కుట్ర పన్నినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గురువారం అర్థరాత్రి, లలిత్ ఝాతో కలిసి మహేష్ ఢిల్లీకి వచ్చి దుత్వపత్ పోలీస్ స్టేషన్‌లో పోలీసుల ముందు లొంగిపోయాడు. అయితే పోలీసులు లలిత్ ఝాను మాత్రమే అరెస్టు చేశారు.

ముంబై కెప్టెన్‌గా హార్దిక్ పాండ్య‌
ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌)లో అత్యంత విజ‌య‌వంతమైన ప్రాంఛైజీల్లో ముంబై ఇండియ‌న్స్ ఒక‌టి. రోహిత్ శ‌ర్మ నాయ‌క‌త్వంలో ముంబై జ‌ట్టు ఏకంగా ఐదు సార్లు ఐపీఎల్ విజేత‌గా నిలిచింది. అయితే.. తాజాగా ముంబై జ‌ట్టు హిట్‌మ్యాన్ రోహిత్ శ‌ర్మ‌కు షాకిచ్చింది. ఐపీఎల్ 2024 సీజ‌న్‌కు ముందు అత‌డిని సార‌థ్య బాధ్య‌త‌ల నుంచి త‌ప్పించింది. అత‌డి స్థానంలో కొత్త కెప్టెన్ ను ఎంపిక చేసింది.

వదలని అక్రమాస్తుల కేసు..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. జగన్ పై ఉన్న అక్రమాస్తుల కేసులకు సంబంధించి నోటీసులు జారీ చేసింది. మాజీ ఎంపీ హరిరామ జోగయ్య వేసిన పిటిషన్ పై విచారణ చేపట్టి ధర్మాసనం శుక్రవారం (డిసెంబర్ 15,2023) సీఎం జగన్‌ అక్రమాస్తుల కేసులపై తెలంగాణ హైకోర్టు మరోసారి విచారణ చేపట్టింది. మాజీ ఎంపీ హరిరామ జోగయ్య వేసిన పిటిషన్ వేసిన నేపథ్యంలో జగన్ కు, సీబీఐకు నోటీసులు ఇవ్వాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.

గెలవాల్సిందే..
సింగరేణి ఎన్నికలను తెలంగాణ కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సింగరేణి ఎన్నికల్లో కాంగ్రెస్ అనుబంధ సంస్థ అయిన INTUC గెలుపే లక్ష్యంగా హస్తం పార్టీ పావులు కదుపుతోంది. దీంట్లో భాగంగా మంత్రి శ్రీధర్ బాబు సీఎల్పీ ఆఫీసులో కోల్ బెల్ట్ ఏరియా ఎమ్మెల్యేలతో చర్చించారు. ఈ నెల 27న సింగరేణి ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో INTUC గెలుపు కోసం కాంగ్రెస్ ప్లాన్లు వేస్తోంది.

ఎప్పుడైనా రెడీ
కేబినెట్‌లో ఎన్నికలపై జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరిలోనే ఎన్నికల షెడ్యూల్ వస్తుందని సంకేతాలిచ్చారు. కాబట్టి నేతలంతా రెడీగా ఉండాలని పిలుపునిచ్చారు.ఎన్నికలు కొంచం ముందు వచ్చే అవకాశం ఉందని..కాబట్టి నేతలంతా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.తెలంగాణలోనూ 20 రోజుల ముందు ఎన్నికలు వచ్చాయని..ఫిబ్రవరిలో షెడ్యుల్ వచ్చే అవకాశం ఉందని తెలిపారు.

జోక్యం చేసుకోలేం
షాహి ఆద్గా సర్వే అనుమతిపై స్టేకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై జోక్య చేసుకోలేమని వ్యాఖ్యానించింది.

ఒంటరిగానే వెళ్తాం..
పొత్తులపై బీజేపీ అధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు చేశారు. పార‌్లమెంట్ ఎన్నికల్లో ఏపార్టీతోనూ పొత్తులు ఉండవని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు.

కట్టుదిట్టం
డిసెంబర్ 18న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌కు రానున్నారు. దీంతో భద్రతా ఏర్పాట్లపై సీఎస్‌ సమీక్ష నిర్వహిస్తున్నారు. శీతాకాల విడిది కోసం వస్తున్న రాష్ట్రపతి ఆరు రోజుల పాటు హైదరాబాద్ లో ఉండనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది.

పాపం పసివాడు
బస్సు చక్రాల కింద పడి మూడేళ్ల పసివాడి ప్రాణం పోయింది. హైదరాబాద్‌ బీఎన్‌రెడ్డి నగర్‌ కాలనీలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటనపై బాబు తల్లిదండ్రులు, స్థానికులు మండిపడ్డుతున్నారు. స్కూల్‌ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే మూడున్నరేళ్ల పసివాడు చనిపోయాడని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

రాజస్థాన్‌లో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం..
మోదీ సమక్షంలో ప్రమాణస్వీకారం చేసిన రాజస్థాన్ సీఎంగా భజన్‌లాల్ శర్మ ప్రమాణస్వీకారం చేశారు.

రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మృతి
పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం చెరుకువాడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మృతి చెందారు. రెండు కార్లు ఎదురు ఎదురుగా వచ్చి ఢీ కొనడంతో కారులో ప్రయాణిస్తున్న ఎమ్మెల్సీ షేక్ సాబ్జి అక్కడికక్కడే మృతి చెందారు. అంగన్వాడీలు చేస్తున్న ధర్నాకు మద్దతు తెలిపేందుకు వెళుతుండగా జరిగిన ప్రమాదంలో సాబ్జి ప్రాణాలు కోల్పోయారు.

ఏపీ పరువు తీశారు..
ఏపీలో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉందని జనసేన నేత నాదెండ్ల విమర్శించారు. పొరుగు రాష్ట్రాల సీఎంలు ఏపీ రోడ్ల గురించి ఎద్దేవా చేసే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఏసియన్ ఇన్వెస్ట్ మెంట్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ బ్యాంక్, న్యూ డెవలప్ మెంట్ బ్యాంకులు ఏపీని బ్లాక్ లిస్టులో పెట్టాయని..జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఏపీ పరువు తీశారు అంటూ దుయ్యబట్టారు.

కీలక నిర్ణయాలు..
ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. జగనన్న ఆరోగ్య సురక్ష రెండో విడతకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. జనవరిలో వైఎస్ఆర్ ఆసరా, చేయూత పథకాలు అమలు చేయనున్నారు. సీఎం జగన్ అధ్యక్షతన సెక్రటేరియట్‌లో శుక్రవారం క్యాబినెట్ సమావేశం జరిగింది.

సత్తా చూపిస్తా..
‘‘నా జోలికి ఎవరన్నా వస్తే సహించేది లేదు..ఎవరన్నా వచ్చారో..నా సత్తా ఏంటో చూపిస్తా’’అంటూ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ సంచలన వ్యాఖ్యలు చేశారు.తాను ఎవరి జోలికి వెళ్లనని తన జోలికి ఎవరన్నా వస్తే సహించేది లేదంటూ వ్యాఖ్యానించారు. తన జోలికి వస్తే ఒక్కొక్కరి సంగతి తేలుస్తాను అంటూ వ్యాఖ్యలు చేశారు.

తగ్గించారు..
మాజీ సీఎం కేసీఆర్‌కు భద్రత కుదించింది రాష్ట్ర పోలీసు శాఖ. అలాగే మాజీ మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు సహా అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన మాజీ మంత్రులకు, ఎమ్మెల్యేలకు భద్రత కేటాయింపులు చేయగా..మాజీ సీఎం కేసీఆర్‌కు ప్రస్తుతం వై క్యాటగిరీ భద్రతను కేటాయించారు.

ప్రజాపాలన షురు..
ప్రజా పాలన మొదలైంది అంటూ కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వానికి గవర్నర్ తమిళిసై శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ అసెంబ్లీలో ప్రారంభమైన సందర్భంగా గవర్నర్ తమిళిసై ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ప్రభుత్వం ప్రయాణం ప్రజాసేవకు అంకితం కావాలని కోరుకుంటున్నానని అన్నారు. ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చారని.. మన ప్రభుత్వం త్వరలోనే దేశానికి రోల్ మోడల్ కానుందని అన్నారు.

కేసీఆర్ డిశ్చార్జ్
యశోద ఆస్పత్రి నుంచి మాజీ సీఎం కేసీఆర్ డిశ్చార్జ్ అయ్యారు. డిసెంబర్ 8న సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో కేసీఆర్ కు తుంటి ఎముక సర్జరి జరిగిన విషయం తెలిసిందే. సర్జరీ తరువాత కోలుకున్న కేసీఆర్ ను ఈరోజు ఆస్పత్రి డాక్టర్లు డిశ్చార్జ్ చేశారు. దీంతో ఆయన నంది నగర్ ననివాసానికి వెళ్లనున్నారు. కేసీఆర్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవుతున్నారని తెలిసి ఆయన అభిమానులు భారీగా యశోద ఆస్పత్రికి చేరుకున్నారు.

రెచ్చిపోయిన రౌడీషీటర్
హైదరాబాద్ మైలార్ దేవ్ పల్లిలోని వట్టేపల్లిలో ఓ రౌడీషీటర్ రెచ్చిపోయాడు. ఓ ఇంట్లోకి చొరబడి ముగ్గురిపై దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు.

పార్లమెంట్ ఘటనలో లలిత్ ఝా అరెస్ట్
పార్లమెంట్ కలర్ స్మోక్ ఘటనలో సూత్రధారి లలిత్ ఝాను కర్తవ్యపథ్ పోలీసులు అరెస్ట్ చేశారు. లలిత్ ను విచారించగా అతను కోల్ కత్తాకకు చెందిన ఉపాధ్యాయుడిగా గుర్తించారు. లోక్ సభలో ఘటన జరిగిన రోజు లలిత్ రాజస్థాన్ పారిపోయాడు. పోలిసులు గాలిస్తున్నారని తెలిసిన లలిత్ లొంగిపోయాడు.

రెచ్చిపోయిన కుక్కలు..
హైదరాబాద్ లో వీధికుక్కలు మరోసారి రెచ్చిపోయాయి. దిల్ సుఖ్ నగర్ లో కుక్కలు బీభత్సం సృష్టించాయి. పీఎన్టీ కాలనీలో ఓ చిన్నారిపై వీధికుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. చిన్నారిపై కుక్కలు దాడి చేసినట్లుగా ఆ ప్రాంతంలోని సీసీ టీవీలో రికార్డు అయ్యింది.

యాక్షన్ షురు..
విశాఖలోని జగదాంబ ఇండస్ హాస్పిటల్ లో అగ్ని ప్రమాదం ఘటనలో యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. ఈ ప్రమాదానికి సంబంధించి ఐదుగురు సభ్యులతో కమిటీ వేయగా వారు వివరాలు సేకరించి కలెక్టర్ కు నివేదిక అందజేశారు. కమిటీ దర్యాప్తులో షార్ట్ సర్క్యూట్ వల్లే అగ్ని ప్రమాదం జరిగినట్లుగా నిర్ధారణ అయ్యింది. ఇది యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే జరిగిందని కమిటి నివేదికలో పేర్కొన్నారు. దీంతో ఆస్పత్రి యాజమాన్యంపై కేసు నమోదు చేశారు.

ప్రజాభవన్ కు పోటెత్తిన జనం..
ప్రజావాణిలో సీఎం రేవంత్ రెడ్డికి సమస్యలను వివరించేందుకు ప్రగతి భవన్ ముందు ప్రజలు పోటెత్తారు. ప్రతి మంగళ, శుక్రవారాల్లో ప్రజల నుంచి ప్రజావాణిలో సీఎం ఫిర్యాదులు స్వీకరిస్తున్న విషయం తెలిసిందే.

లోకేశ్ పాదయాత్ర..
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర 223వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం ఆయన పాదయాత్ర యలమంచలి అసెంబ్లీ నియోజకవర్గంలో కోనసాగుతుంది. ఇప్పటి వరకూ నారా లోకేష్ మొత్తంగా 3074 కి.మీ. దూరం నడిచారు. శుక్రవారం పంచదార్ల క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం కానుంది. కాజిపాలెం తిమ్మరాజుపేటలో దళితులతో సమావేశంతో నేటి పాదయాత్ర ముగియనుంది.

పెరుగుతున్న చలి తీవ్రత..
తెలంగాణలో ఉష్ణోగ్రతలు మరింతగా పడిపోతున్నాయి. చలి విపరీతంగా పెరుగుతోంది. పగటిపూటకూడా ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా నమోదవుతున్నాయి. దీంతో తెలంగాణలో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. రాగల మూడురోజులు గాలులు తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి తెలంగాణ వైపుకి వీస్తాయని తెలిపారు. ఉదయం వేళల్లో పొగమంచు పరిస్థితులు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వెల్లడించారు. గాలులు గంటకు 4 నుంచి 6 కిలో మీటర్ల వేగంతో తూర్పు దిశగా ఉండే అవకాశముందన్నారు.

నేడు గవర్నర్ ప్రసంగం..
తెలంగాణ ఉభయసభల్లో నేడు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగించనున్నారు. నిన్న అసెంబ్లీ హాల్‌లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో గవర్నర్ ప్రసంగానికి ఆమోదం తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇదే గవర్నర్ తొలి ప్రసంగం. దీంతో ప్రభుత్వ ఆలోచన విధానాన్ని ఈ ప్రసంగం ద్వారా ప్రజలకు చేరవేసే అవకాశముందని తెలుస్తోంది.

గుర్తింపు కార్డు ఉండాల్సిందే..
ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేయాలనుకునే మహిళలు శుక్రవారం నుంచి గుర్తింపు కార్డులు చూపించాల్సి ఉంటుంది. అప్పుడే జీరో టికెట్ జారీ చేస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈనెల 9వ తేదీ మధ్యాహ్నం నుంచి మహాలక్ష్మీ పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని అమలులోకి తెచ్చిన విషయం తెలిసిందే.

శంషాబాద్ లో భూ వివాదంపై కీలక తీర్పు ..
శంషాబాద్‌లోని కోట్ల విలువైన భూ వివాదానికి సంబంధించి తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. శంషాబాద్‌లో కబ్జాకు గురైన 181 ఎకరాల భూమి హెచ్‌ఎండీఏదేనని న్యాయస్థానం తేల్చి చెప్పింది. భూ అక్రమణదారుల పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం డిస్మిస్‌ చేసింది. దీనిపై నవంబరు 18న తీర్పు రిజర్వ్‌ చేసిన ధర్మాసనం.. నిన్న తీర్పు వెల్లడించింది.