Today Headlines : రెండో జాబితా సిద్ధం చేసిన సీఎం జగన్..!

తాను వైసీపీకీ రిజైన్ చేసి టీడీపీలో చేరబోతున్నట్టు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని అన్నా రాంబాబు ఖండించారు.

Today Headlines : రెండో జాబితా సిద్ధం చేసిన సీఎం జగన్..!

Today Headlines in Telugu at 10PM

Updated On : December 27, 2023 / 10:06 PM IST

ఫ్లైఓవర్లు మూసివేత..
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా పలు మార్గదర్శకాలు జారీ చేశారు సైబరాబాద్ పోలీసులు. ట్రాఫిక్ డైవర్షన్స్, ఫ్లైఓవర్ల మూసివేత, సాధారణ పౌరులు అనుసరించాల్సిన నిబంధనలతో పాటు ఈవెంట్స్ సందర్భంగా పాటించాల్సిన నిబంధనలను విడుదల చేశారు. బార్లు, పబ్బులు, క్లబ్బుల్లో..
న్యూఇయర్ వేడుకల్లో మద్యం సేవించిన వారు స్వయంగా వాహనాలు నడిపేందుకు అనుమతించొద్దని పేర్కొన్నారు. ఒకవేళ అలా చేస్తే సంబంధిత యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

చంద్రబాబు దూకుడు..
ఎన్నికలకు దూకుడు పెంచుతోంది టీడీపీ. వచ్చే నెల (జనవరి) నుంచి భారీ బహిరంగ సభలకు ప్లాన్ చేస్తున్నారు టీడీపీ నేత చంద్రబాబు. ఇప్పటికే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్(పీకే)తో భేటీ అయిన చంద్రబాబు, లోకేశ్.. పీకే ప్రణాళికలను అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా 25 పార్లమెంట్ స్థానాల్లో 25 బహిరంగ సభలు నిర్వహించే యోచనలో ఉన్నారు చంద్రబాబు.

జగన్ ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ పోటీ చేస్తా- హోంమంత్రి వనిత
సీఎం జగన్ ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ నుంచి పోటీ చేస్తానని, అలా కాకుండా.. మీ సేవలు ఇక చాలు అంటే హ్యాపీగా పార్టీ కోసం పని చేస్తానని అన్నారు ఏపీ హోంమంత్రి తానేటి వనిత. అందులో ఇబ్బందేమీ లేదు, ఇబ్బంది పడాల్సిన పని కూడా లేదన్నారు. మార్పులు చేర్పులు సహజమే అన్న ఆమె.. పార్టీ మారాలి అనుకునేది వారి పర్సనల్ వ్యవహారం అన్నారు. టికెట్ల విషయంలో ఫైనల్ డెసిషన్ సీఎం జగన్ దే అని అని తేల్చి చెప్పిన ఆమె.. జగన్ నిర్ణయాలు కొందరికి నచ్చొచ్చు, మరికొందరికి నచ్చకపోవచ్చని కామెంట్ చేశారు.

అసంతృప్తులపై సజ్జల రియాక్షన్..
ఏ పార్టీలోనైనా కొన్ని అసంతృప్తులు సహజం అని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఇలాంటివి లేకపోతే ఎత్తిపోయిన పార్టీ, ఎందుకూ చెల్లని పార్టీ అని అనుకుంటారు అని సజ్జల కామెంట్ చేశారు. ”మా పార్టీ మంచి ఫామ్ లో ఉంది, కాబట్టే పోటీ చేయటానికి నాయకులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఇది చాలా సహజంగా జరిగే వ్యవహారం. అసంతృప్తులు ఉంటే మాట్లాడతాం. దాని గురించి ఎవరూ వర్రీ అవ్వాల్సిన పనిలేదు” అని సజ్జల అన్నారు.


రాజకీయాలకు గుడ్ బై..

గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. అనారోగ్య కారణాల వల్ల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించారు. 2024 ఎన్నికల్లో బరిలో నిలబడటం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో గిద్దలూరు వైసీపీ అభ్యర్థిగా సీఎం జగన్ ఎవరిని నియమించినా అందరం కలిసి పనిచేసి గెలిపించుకుందామని క్యాడర్ కు పిలుపునిచ్చారాయన. తాను వైసీపీకీ రిజైన్ చేసి టీడీపీలో చేరబోతున్నట్టు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు అన్నా రాంబాబు.

రాంగోపాల్ వర్మ తల తీసుకొస్తే..
వ్యూహం సినిమాపై ఓ ప్రైవేట్ టీవీ ఛానల్ డిబేట్ లో సంచలన వ్యాఖ్యలు చేశారు అమరావతి ఉద్యమ నేత కొలికిపూడి శ్రీనివాసరావు. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తల తీసుకువస్తే కోటి రూపాయల నజరానా ప్రకటించారాయన. ఎవరైనా రాంగోపాల్ వర్మ తల తీసుకొస్తే కోటి రూపాయలు ఇస్తానని మళ్లీ మళ్లీ చెప్పారు. దీనిపై వర్మ డీజీపీని ఆశ్రయించారు. కొలికపూడి శ్రీనివాసరావుపై డీజీపీకి ఫిర్యాదు చేశారు.

కేఎల్ రాహుల్ సెంచరీ ..
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ లో భారత్ మొదటి ఇన్నింగ్స్ లో 245 పరుగులకు ఆలౌట్ అయింది. మిడిలార్డర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ (101) సెంచరీ సాధించాడు.

జనసేనలోకి వైసీపీ ఎమ్మెల్సీ..
వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ జనసేన పార్టీలో చేరారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ వంశీ యాదవ్ కు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.

దరఖాస్తు ఫాంలు విడుదల..
ప్రజా పాలన – అభయ హస్తం లోగోలను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం ఆరు గ్యారెంటీల దరఖాస్తు ఫాంలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కొండా సురేఖ తదితరులు ఉన్నారు.

రోడ్డు ప్రమాదం..
అమెరికాలోని టెక్సాస్ హైవేపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించారు. వీరంతా ఆంధ్రప్రదేశ్ లోని అమలాపురం వాసులుగా గుర్తించారు. మృతుల్లో మామ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ బంధువులు ఉన్నట్లు తెలిసింది.

భారత్ న్యాయ యాత్ర ..
భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా కాంగ్రెస్ ‘భారత్ న్యాయ యాత్ర’ చేపట్టనుంది. జనవరి 14 నుంచి మార్చి 30వరకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ యాత్రను చేపట్టనున్నారు. 6,200 కిలో మీటర్ల మేర యాత్ర సాగనుంది. మణిపూర్ నుంచి ముంబై వరకు 14 రాష్ట్రాల్లో 85 జిల్లాల్లో రాహుల్ ‘భారత్ న్యాయ యాత్ర’ కొనసాగనుంది.

అంగన్వాడీల ఆందోళన ..
తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీలు ఆందోళన ఉధృతం చేశారు. ఏపీలో ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడికి పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వైసీపీ ఎమ్మెల్యేల ఇళ్ల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు అంగన్ వాడీ కార్యకర్తల ఇళ్ల వద్ద పోలీసులు నిఘా ఉంచారు.

ముగిసిన ఢిల్లీ పర్యటన..
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కలు ఢిల్లీ పర్యటన ముగించుకొని హైదరాబాద్ బయలుదేరారు. నిన్న ఢిల్లీ వెళ్లిన వీరు.. ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు మంజూరు, తదితర అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీలతోనూ భేటీ అయ్యారు.

కమ్మేసిన పొగమంచు..
ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాలను పొగమంచు కమ్మేసింది. ఢిల్లీ, హర్యానా, పంజాబ్, యూపీతో సహా పలు రాష్ట్రాల్లో పొగమంచు ప్రభావంతో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సెంట్రల్ ఢిల్లీలో 50 మీటర్లకు విజిబులిటీ పడిపోయింది. విమానాలు, రైళ్లు, వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

తిరుమల సమాచారం..
తిరుమలలో ఐదోరోజు వైకుంఠ ద్వార దర్శనం కొనసాగుతోంది. టోకెన్లు కలిగిన భక్తులకు మాత్రమే దర్శనానికి అనుమతి ఇస్తున్నారు. మంగళవారం శ్రీవారిని 71,488 మంది భక్తులు దర్శించుకున్నారు. హుండీ ఆదాయం రూ. 4.17 కోట్లు సమకూరింది.

ఢిల్లీకి గవర్నర్..
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు.. ప్రధాని మోదీ, అమిత్ షాతో భేటీ అవుతారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తమిళిసై పోటీచేసే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో ఆమె మోదీ, అమిత్ షాలతో భేటీ అయ్యి ఈ విషయంపై క్లారిటి ఇచ్చే అవకాశం ఉంది.

టీ20 మ్యాచ్ ..
నేడు న్యూజిలాండ్, బంగ్లాదేశ్ మధ్య తొలి టీ20 మ్యాచ్ జరుగుతుంది. ఉదయం 11.40 గంటలకు మెక్ లియన్ పార్క్ వేదికగా మ్యాచ్ జరుగుతుంది.

కంపించిన భూమి..
అస్సాంలోని తేజ్ పూర్ లో భూ ప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 3.4 గా నమోదైంది.

అగ్నిప్రమాదం..
హైదరాబాద్ లోని రాజేంద్ర నగర్ సులేమాన్ నగర్లో అగ్నిప్రమాదం సంభవించింది. కట్టెల గోదాంలో మంటలు చెలరేగాయి. మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపు చేస్తున్నారు.

సింగరేణి ఎన్నికలు..
సింగరేణి సంస్థల్లో గుర్తింపు సంఘం ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఉదయం 7గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5గంటల వరకు కొనసాగనుంది. 13 కార్మిక సంఘాలు పోటీలో ఉన్నాయి. ఏడు జిల్లాల్లో 39,773 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందుకోసం 11 ఏరియాల్లో 84 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు. ఫోలింగ్ అనంతరం ఏరియాల వారీగా ఓట్ల లెక్కింపు ఉంటుంది.

విచారణ..
విశాఖ రుషికొండ అక్రమ తవ్వకాలపై ఇవాళ ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది.

కాకినాడకు పవన్ ..
నేటి నుంచి మూడు రోజులపాటు కాకినాడలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. టీడీపీ – జనసేన పొత్తు ఖరారైన నేపథ్యంలో సీట్ల పంపకాలపై చర్చ జరగనుంది.

ఏపీపై కాంగ్రెస్ ఫోకస్..
ఏపీపై కాంగ్రెస్ అదిష్టానం ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా ఇవాళ ఢిల్లీలో ఉదయం 10గంటలకు ఏఐసీసీలో కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఏపీ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు, ఏపీ పార్టీ వ్యవహారాల ఇంచార్జి మాణిక్యం ఠాగూర్ తోపాటు ఏపీ కాంగ్రెస్ ముఖ్యనేతలు, కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు పాల్గోనున్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికలపై ఎలా ముందుకెళ్లాలనే విషయాలపై చర్చించనున్నారు.