హస్తినకు జగన్.. అమిత్‌ షాతో ప్రత్యేక భేటీ

హస్తినకు జగన్.. అమిత్‌ షాతో ప్రత్యేక భేటీ

Updated On : March 3, 2021 / 10:24 AM IST

YS Jagan:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హస్తిన టూర్‌కు రెడీ అయ్యారు. ఇటీవల తరచూ ఢిల్లీ వెళ్తున్న జగన్.. వరుసగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో భేటీ అవుతుండగా.. ఈ సారి జగన్‌ పర్యటన వెనక ఆంతర్యమేంటీ? ఎవరేవరితో జగన్ భేటీ అవబోతున్నారు? అనేది ఆసక్తికరంగా ఉంది. ముఖ్యంగా రాష్ట్రంలో పరిస్థితులు, విశాఖ స్టీల్ ప్లాంట్ వంటి అంశాలు కాక పుట్టిస్తోండగా.. జగన్ ఢిల్లీ టూర్ విషయంలో చర్చ జరుగుతోంది.

ఏపీ సీఎం వైఎస్‌ జగన్ ఇటీవల వరుస ఢిల్లీ పర్యటనలు చేస్తుండగా.. గడిచిన నాలుగు నెలల్లో మూడు సార్లు ఢిల్లీ వెళ్లొచ్చారు ముఖ్యమంత్రి. మూడు సార్లు కేంద్ర పెద్దలను కలిసి రాష్ట్రానికి చెందిన పలు అంశాలపై చర్చించారు. జగన్ ఢిల్లీ వెళ్లినప్పుడల్లా కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో భేటీ అవుతున్నారు. కీలక అంశాలపై ఆయనతో చర్చిస్తున్నారు. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ ప్రాజెక్టులతో పాటు.. రాజకీయ అంశాలు ఇద్దరి మధ్య చర్చల్లో వస్తున్నాయి. ఈసారి కీలక అంశమైన.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటికరణపై చర్చించే అవకాశం కనిపిస్తోంది.

ఏపీలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలంటూ పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతోండగా.. ప్రైవేటీకరణ అపాలంటూ సీఎం జగన్ సైతం కేంద్రానికి లేఖ రాయడంతో పాటు.. ఆందోళన చేస్తున్న కార్మికులను కలిసి భరోసా ఇచ్చారు. ఇప్పుడు ఇదే అంశంపై అమిత్ షాతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతుండగా.. విశాఖ కార్పొరేషన్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం జగన్.. విశాఖ సెంటిమెంట్‌ను కేంద్రం వద్దకు తీసుకువెళ్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి..

వీటితో పాటు మూడు రాజధానుల అంశం.. కర్నూలుకు హైకోర్టు తరలింపు పక్రియపై కూడా ఢిల్లీ పెద్దలతో సీఎం జగన్‌ చర్చించే అవకాశం ఉంది.