YS Sharmila: ఒక్క నీటి చుక్కను వదులుకోబోం.. ఎవరితోనైనా పోరాడుతా.. -వైఎస్ షర్మిల

YS Sharmila: ఒక్క నీటి చుక్కను వదులుకోబోం.. ఎవరితోనైనా పోరాడుతా.. -వైఎస్ షర్మిల

Ys Sharmila

Updated On : June 28, 2021 / 9:16 PM IST

YS Sharmila: తెలుగు రాష్ట్రాల మధ్య ఇప్పుడు నీటి సమస్య నెలకొని ఉండగా.. ఈ సమయంలో వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. నీటి వివాదంపై వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. తెలంగాణకు సంబంధించిన ఒక్క నీటి చుక్క‌ను కూడా వదులుకోబోమని స్పష్టం చేశారు. అందుకు అవసరం అయితే ఎవరితోనైనా పోరాడటానికి సిద్ధమని అన్నారు.

తెలంగాణకు సంబంధించిన ఒక్క నీటి చుక్కను కూడా వదులుకోబోమంటూ.. ఇటీవల నిర్వహించిన ఓ సభలో తాను మాట్లాడిన వీడియోను ట్విటర్‌ ద్వారా విడుదల చేశారు షర్మిల. నీటి కోసం అవసరమైతే ఎవరితో పోరాడేందుకైనా తాను సిద్ధమని, ‘షర్మిల తెలంగాణ కోసం పోరాడుతున్నా.. తెలంగాణ కోసం నిలబడుతుందా?’ అని చాలా మంది అనుకోవచ్చనీ, మాటమీద నిలబడే రాజన్న బిడ్డగా చెబుతున్నాను. తెలంగాణకు దక్కాల్సిన ఒక్క చుక్క నీటి బొట్టునూ వదులుకునే ప్రసక్తే లేదని అన్నారు.

తెలంగాణకు అన్యాయం జరిగే ఏ ప్రాజెక్టునైనా, పనినైనా అడ్డుకుంటానని, ఈ ప్రాంత ప్రజల కోసం నిలబడతానని, కొట్లాడతానని షర్మిల స్పష్టం చేశారు. ఇప్పటికే ఏపీలో రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను ఏపీ ప్రభుత్వం ప్రారంభించగా.. తెలంగాణ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తెలంగాణకు రావాల్సిన నీటిని ఏపీ సర్కార్ ఎత్తుకుపోతుందని మండిపడ్డారు. ఈ క్రమంలోనే షర్మిల వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి.