రూ.12 కోట్ల లాటరీ తగిలింది.. రోజువారీ కూలీ కోటీశ్వరుడు అయ్యాడు! 

  • Published By: sreehari ,Published On : February 12, 2020 / 03:26 AM IST
రూ.12 కోట్ల లాటరీ తగిలింది.. రోజువారీ కూలీ కోటీశ్వరుడు అయ్యాడు! 

Updated On : February 12, 2020 / 3:26 AM IST

అతడో రోజువారీ కూలీ. రెక్కాడితేకానీ డొక్క ఆడదు. ఒక రోజు పని మానేస్తే పూట పస్తులుండాల్సిన పరిస్థితి. అప్పులపాలైన అతడు వచ్చిన చాలీచాలనీ కూలీ డబ్బులతోనే తన కుటుంబాన్ని నెట్టుకుస్తున్నాడు. బ్యాంకుల్లో లోను తీసుకున్నాడు. అప్పుల భారం పడింది. అప్పు తీర్చలేకపోవడంతో బ్యాంకు అతడి ఇంటిని స్వాధీనం చేసుకోబోతోంది. అప్పుల నుంచి బయటపడేందుకు చేయని ప్రయత్నం లేదు.. ఇతడికి లాటరీలు కొనడం పిచ్చి. వచ్చిన ప్రతి లాటరీ కొనేస్తుంటాడు కేరళలోని కన్నూరు జిల్లాకు చెందిన రోజువారీ కూలీ.

లక్కీగా ఓరోజు అదృష్టం అతడి ఇంటి తలుపు తట్టింది. అతడు కొన్న లాటరీ టికెటుపై రూ.12 కోట్ల ప్రైజ్ మనీతగిలింది. కేరళ ప్రభుత్వం రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో క్రిస్మస్ న్యూ ఇయర్ బంపర్ లాటరీ కింద రూ. 12 కోట్ల ఫ్రైజ్ మనీ ప్రకటించింది. మాల్పూర్ పంచాయతీలోని కురిచ్యా కాలనీలో నివాసముండే రాజన్ పెర్నూన్ అనే రోజువారీ కూలీ.. వ్యవసాయ పనులు చేస్తుంటాడు. అతడి భార్య రజనీ స్థానిక అంగనవాడీలో తాత్కాలిక సిబ్బందిగా పనిచేస్తోంది. రాజన్ కు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. 

కన్నూరు జిల్లాలోని కూతుపారంబు పట్టణంలో ఒక వెండర్ నుంచి ST 269609 లాటరీ టికెట్ కొన్నాడు. అదృష్టం కలిసొచ్చి అతడికి రూ.12 కోట్ల బంపర్ లాటరీ తగిలింది. వెంటనే అతడు గెలిచిన ఆ టికెట్‌తో స్థానిక కోఆపరేటీవ్ బ్యాంకు వద్దకు వెళ్లి అధికారికంగా అందజేశాడు. ఇప్పటికే ఆ బ్యాంకులో ఇంటిపై అప్పు చేశాడు. ప్రైజ్ మనీ రాగానే బ్యాంకులో అప్పు తీర్చాలని చూస్తున్నాడు. తన చిన్న కూతురిని బాగా చదివించాలని చూస్తున్నాడు. 

అన్నీ పోనూ వచ్చేది రూ.7.2 కోట్లు :
లాటరీ టికెట్ నిబంధనల ప్రకారం.. రాజన్ గెలుచుకున్న రూ.12 కోట్ల ప్రైజ్ మనీలో ట్యాక్సులు, ఏజెన్సీ కమీషన్ పోనూ కేవలం రూ.7.2 కోట్లు మాత్రమే అతడి చేతికి వస్తాయి. లాటరీ టికెట్ అమ్మే ఏజెన్సీకి GST తో కలిపి 10శాతం పోతుంది. కోట్ల రూపాయల లాటరీ గెలుచుకున్నందుకు రాజన్ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. ప్రతిరోజు లాటరీలు కొంటుంటానని చెప్పుకొచ్చాడు. చిన్న లాటరీ ప్రైజుల నుంచి పెద్ద ప్రైజ్ ల వరకు అన్ని కొంటాను. గతంలో చిన్ని లాటరీలను గెలుచుకున్నాను రూ.1000, రూ.2000, రూ.5000 వరకు గెలుచుకున్నాను. అలా లాటరీ గెలుస్తూనే పెద్ద లాటరీలు కొనేలా ప్రోత్సహించినట్టు తెలిపాడు. ఒకసారి రూ.50వేల ప్రైజ్ మనీ ఒక సిరీస్ నెంబర్ తేడాతో చేజారిపోయిందని చెప్పాడు. 

క్రిస్మస్ న్యూ ఇయర్ బంపర్ లాటరీ కింద మొత్తం 40 లక్షల టికెట్లను ముద్రిస్తే.. అందులో 36లక్షల లాటరీ టికెట్లను అమ్ముడుబోయినట్టు కేరళ ప్రభుత్వం వెల్లడించింది. ఒక్కో టికెట్ ధర రూ.300 వరకు ఉంటుంది. ఈ సారి బంపర్ లాటరీ టికెట్ల అమ్మకాలపై ప్రభుత్వం రూ.29.93 కోట్లపైనే లాభం వస్తుందని అంచనా వేసింది. క్రిస్మస్ న్యూ ఇయర్ బంపర్ లాటరీ సెకండ్ ప్రైజ్ రూ.5 కోట్లు (రూ.50 లక్షలు 10మందికి సమానంగా పంపొచ్చు) మూడో ప్రైజ్ మనీ రూ. 1 కోటీ (రూ.10 లక్షలు 10మందిలో ఒక్కొక్కరికి). చిన్న లాటరీ ప్రైజ్ మనీలు కూడా ఉన్నాయి.