30 ఏళ్లు పరిశోధనలు : మలేరియాకు టీకా వచ్చేసింది

దోమ కాటు (ఎనోఫిలీజ్ ఆడదోమ) వల్ల వచ్చే జ్వరం మలేరియా..ఈ వ్యాధి కారణంగా ఏటా 4.35 లక్ష్ల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రతి రెండు నిమిషాలకు ఒక చిన్నారి మృతి చెందుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ లెక్కలు వెల్లడిస్తున్నాయి. అయితే..ఇలాంటి ప్రాణాంతక వ్యాధికి చెక్ పెట్టలేమా ? పరిష్కరించవచ్చని శాస్ర్తవేత్తలు చెబుతున్నారు. ఇందుకు ఒక టీకా కనుగొన్నారు.
ఆఫ్రికా దేశంలోని మాలావికి చెందిన సైంటిస్టులు దాదాపు 30 ఏళ్ల పాటు పరిశోధనలు చేశారు. WHO సహకారంతో స్వచ్చంద సంస్థ పాథ్, గెలాక్సోస్మిత్‌క్లైన్ అనే ఫార్మాసిటికల్ కంపెనీ సంయుక్తంగా టీకాను అభివృద్ధి చేశాయి. RTS, S అని పిలవబడే ఈ టీకాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం కూడా తెలిపింది. క్లినికల్ ట్రయల్ నిర్వహించారు. ప్రతి పది కేసులను పరిశీలించారు.
అందులో నాలుగు కేసుల్లో మలేరియా నివారించిందని పరిశోధకులు వెల్లడించారు. రెండేళ్ల లోపు చిన్నారుల కోసం మాలావిలో ఈ టీకాను WHO అందుబాటులోకి తీసుకొచ్చింది. త్వరలోనే ఘనా, కెన్యా దేశాల్లోనూ ఈ టీకాను ప్రవేశ పెడుతున్నట్లు WHO ఒక ప్రకటనలో వెల్లడించింది.