ఫిల్మ్ ఇండస్ట్రీకి వేల కోట్ల నష్టం తెచ్చిన కరోనా.. బాలీవుడ్ బెంబేలు

ఫిల్మ్ ఇండస్ట్రీకి వేల కోట్ల నష్టం తెచ్చిన కరోనా.. బాలీవుడ్ బెంబేలు

Updated On : July 26, 2020 / 8:33 PM IST

ఎక్కడో చైనాలోని వూహాన్‌లో పుట్టిన కరోనా వైరస్.. ప్రపంచ మానవాళి ఊహాలకు అందని విధంగా అందరినీ చావు దెబ్బ తీస్తోంది. వైరస్ ఎఫెక్ట్‌తో టాలీవుడ్, బాలీవుడ్ అనే కాదు.. అన్ని ఇండస్ట్రీలకు సంబంధించిన పెద్ద సినిమాలు రీ షెడ్యూల్ చేయాల్సి వస్తోంది. థియేటర్స్, మాల్స్, మల్టీప్లెక్స్ అన్ని బంద్ అయ్యాయి. అక్షయ్ కుమార్, రోహిత్ శెట్టి, కరణ్ జోహార్, అజయ్ దేవ్‌గణ్, రణ్‌వీర్ సింగ్, సింబా, సింగం సిరీస్ లాంటి పలు భారీ సినిమాల రిలీజ్‌లు వాయిదా పడ్డాయి. అంతేకాదు దేశ వ్యాప్తంగా అన్ని సినిమాలకు సంబంధించిన షూటింగ్స్ రద్దు అయ్యాయి.

కరోనా ఎఫెక్ట్ బాలీవుడ్‌పై పిడుగులా పడింది. ఇప్పటికే రిలీజ్‌కు రెడీగా ఉన్న సినిమాలు ఆగిపోయాయి. షూటింగ్స్ ఆగిపోయి… వాటిపై ఆధారపడే కార్మికుల జీవితాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. ఈ క్రమలో బాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఇప్పటి దాకా వెయ్యికోట్లకు పైగా నష్టపోయినట్టు తెలుస్తోంది. భారీ అంచనాల నడుమ అహ్మద్ ఖాన్ దర్శకత్వంలో, టైగర్ ష్రాఫ్, శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘బాఘీ 3’ చిత్రం విడుదలైంది.

అప్పటికే సినిమా పైన భారీ అంచనాలు నెలకొని ఉండడంతో మొదటివారం సినిమాకి 90.67 కోట్ల రూపాయలు వసూళ్లను కొల్లగొట్టింది. ఇక ఇర్ఫాన్ ఖాన్ నటించిన ‘ఆంగ్రేజీ మీడియం’ తొలి మూడు రోజుల్లోనే 59.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అయితే కరోనా ప్రభావంతో ధియేటర్ల మూసివేయడంతో ‘బాఘీ 3’ నిర్మాతలకి 25 నుంచి 30 కోట్ల రూపాయల మేర నష్టం వచ్చిందని బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. విడుదలకి సిద్దంగా ఉన్న ‘బ్రహ్మాస్త్ర’, ‘సూర్యవంశీ’ లాంటి సినిమాలు వాయిదా పడ్డాయి.

రంజాన్ కానుకగానే సల్మాన్ తన చిత్రం రాధే ది మోస్ట్ వాంటెండ్ భాయ్‌ని విడుదల చేస్తామని షూటింగ్ మొదలైన రోజే ప్రకటించారు. అక్కీ సినిమా కూడా అదే టైమ్‌లో వస్తుందని లెక్కలేసుకున్నారు. కానీ అంచనాలు తలకిందులయ్యాయి. వీటితో పాటు చాలా సినిమాల షెడ్యూల్స్ అతలాకుతలం అయిపోయాయి. రంజాన్ సందర్భంగా అక్షయ్ తన మరో సినిమా లక్ష్మీబాంబ్‌ని విడుదల చేయాలనుకున్నారు. కానీ వైరస్‌ ఎంట్రీతో అన్ని అర్ధాంతరంగా ఆగిపోయాయి.

పలువురు హీరోలు తమ సినిమాల్ని వాయిదా వేసుకున్నారు. ముఖ్యంగా షూటింగ్స్ కోసం విదేశాలకు వెళ్లాల్సిన అన్ని మూవీ టీంలపై కరోనా ఎఫెక్ట్ తీవ్రంగా కనిపిస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరోలు సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్ తమ విదేశీ పర్యటనలు రద్దు చేసుకున్నారు. నిజానికి హృతిక్ అమెరికా వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నాడు. అక్కడ తన అభిమానులతో మీట్ అయ్యే ఏర్పాట్లు చేసుకున్నాడు. ఇంతలో కరోనా విజృంభణతో టూర్‌ను రద్దు చేసుకున్నాడు. కండలవీరుడు సల్మాన్‌ఖాన్‌ కూడా విదేశాల్లో ఉన్న సినిమా షూటింగ్స్‌ని రద్దు చేసుకున్నాడు.

పరిస్థితులు మెరుగుపడిన తర్వాత హీరోలు విదేశాలని డిసైడ్ అయ్యారు. కోబ్రా సినిమాపై కూడా కరోనా ఎఫెక్ట్ పడింది. చిత్రీకరణ కోసం రష్యా వెళ్లిన చిత్ర బృందానికి కరోనా తాకింది. దీంతో సినిమా షూటింగ్‌ నిలిపివేశారు. నిజానికి సినీ పరిశ్రమకు సమ్మర్ కాసులు కురిపించే సీజన్. పిల్లలకు హాలీడేస్‌తో చాలా మంది సినిమాలు చూడడానికి థియేటర్స్ వైపు వెళ్తుంటారు. అందుకే చాలా మంది నిర్మాతలు, హీరోలు తమ సినిమాలను సమ్మర్‌లో విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ వారి ఆశలన్నింటిపై వైరస్ మహమ్మారి నీళ్లుచల్లింది.

వైరస్ తీవ్రత కొనసాగుతున్నా కొద్దీ… బాలీవుడ్‌ పరిశ్రమ మరింత కష్టాల్లో కూరుకుపోతోంది. ఇప్పటికే కరోనా కారణంగా మన దేశంలోని అన్ని చిత్రపరిశ్రమలు దాదాపు 3 వేల కోట్ల మేరకు నష్టం వాటిల్లిందని సినీరంగానికి చెందిన నిపుణులు అంచనా వేస్తున్నారు. గత 50ఏళ్లలో చిత్ర పరిశ్రమ ఇలాంటి గడ్డు పరిస్థితులను ఎపుడు చూడలేదు. కేవలం ఇది మన దేశానికి చెందిన చిత్ర పరిశ్రమకే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా అన్ని చిత్ర పరిశ్రమలకు ఈ ఎఫెక్ట్ భారీగా ఉంది.

వైరస్ కారణంగా ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీస్ పోస్ట్ పోన్ అయ్యాయి. మొత్తానికి ఇండస్ట్రీకి కరోనాతో దాదాపు 1000కోట్లకు పైగా నష్టాలు వాటిలినట్టు తెలుస్తోంది. కరోనా ఎఫెక్ట్ తగ్గిన తరువాత ప్రజలు తమ ఖర్చు విషయంలో ఆచితూచి వ్యవహరిస్తారనే వాదన వినిపిస్తోంది. అదే నిజమైతే… నిత్యవసరం కాని సినిమాపై మూవీ లవర్స్ ఎంత మేరకు డబ్బు ఖర్చు చేస్తారనేది కూడా సందేహంగా మారింది. కరోనా పోయినా… ఆ భయం కారణంగా ప్రేక్షకులు కొన్నేళ్ల పాటు ధియేటర్లకు దూరంగా ఉండే అవకాశం లేకపోలేదు.

సినీ నిర్మాతలు కూడా ఇదే రకమైన అంచనాతో ఉన్నారు. సినిమా కలెక్షన్లపై కరోనా ప్రభావం ఏ రకంగా ఉంటుందనే విషయం రెండు మూడు పెద్ద సినిమాలు విడుదలైతే తప్ప తెలియని పరిస్థితి. ఇప్పటికే నష్టాల ఊబిలో కూరుకుపోయిన థియేటర్స్ నడుపుకోలేని పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంది. మొత్తానికి కరోనా దెబ్బతో చిత్ర పరిశ్రమపై డైరెక్ట్‌గా ఇన్ డైరెక్ట్‌గా ఆధార పడ్డ చాలా కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది.