‘గంగూలీ’ బయోపిక్‌

  • Published By: vamsi ,Published On : February 25, 2020 / 04:54 AM IST
‘గంగూలీ’ బయోపిక్‌

Updated On : February 25, 2020 / 4:54 AM IST

బాలీవుడ్‌లో ఇప్పుడు బయోపిక్‌ల హవా సాగుతుంది. అందులోనూ దంగల్ సినిమా హిట్ అయిన తర్వాత స్టార్ క్రికెటర్ల మీద సినిమాలు తీసేందుకు దర్శక నిర్మాతలు ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటికే 1983 క్రికెట్‌ ప్రపంచ కప్‌ ఆధారంగా ‘83’ తెరకెక్కిస్తుండగా… ధోనీ వంటి సినిమాలు ఇప్పటికే సూపర్ హిట్లుగా నిలిచాయి. ఈ క్రమంలోనే లేటెస్ట్‌గా మరో స్టార్ క్రికెటర్ గంగూలీ జీవిత కథ ఆధారంగా సినిమా తీసేందుకు బాలీవుడ్‌లో ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు.

ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షునిగా ఉన్న దాదా సౌరవ్ గంగూలీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సౌరవ్ గంగూలీ జీవితంలోని కీలక ఘట్టాలను ఆవిష్కరిస్తూ బాలీవుడ్‌ దర్శకనిర్మాత కరణ్‌జోహార్‌ ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తుంది. ఈ బయోపిక్‌ కోసం గంగూలీకి, కరణ్‌జోహార్‌కు మధ్య పలు మార్లు చర్చలు జరిగినట్లు చెబుతున్నారు. గంగూలీ పాత్ర కోసం హృతిక్‌రోషన్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. క్రికెటర్‌గా గంగూలీ సాధించిన ఘన విజయాలతో పాటు ఎదుర్కొన్న వివాదాల్ని ఈ సినిమాలో చూపించాలని నిర్ణయించారట. 

సౌరవ్ గంగూలీ అంటే దేశవ్యాప్తంగా ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. క్రికెటర్లకు కూడా భక్తులు ఉంటారా? అని అనుకునేంతలా అతనికి అభిమానులు పాలాభిషేకాలు చేసేవారు అప్పట్లో. గంగూలీ మైదానంలో చూపించిన దూకుడు స్వభావం, కెప్టెన్‌గా సాధించిన విజయాలు సినిమాటిక్ కథకు సరిగ్గా సరిపోతాయి. అందుకే అతని కథ పక్కా కమర్షియల్‌ సినిమాకు సరిపడేలా ఉంటుందని బాలీవుడ్‌లో భావిస్తున్నారు.