బాలయ్యపై సినిమా తీసే ఆలోచన లేదు..

కాంట్రవర్సీ కింగ్ ‘పవర్‌స్టార్’ సినిమాతో ఎంత రచ్చ చేస్తున్నాడో చూస్తూనే ఉన్నాం. బుధవారం ట్రైలర్ రిలీజ్ చేసి మరింత హైప్ క్రియేట్ చేశాడు. జూలై 25న ఈ సినిమా ఆర్జీవీ వరల్డ్ థియేటర్లో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా పలు మీడియా ఛానెళ్లకు ఇంటర్వూలు ఇస్తున్నాడు వర్మ. అయితే కొద్దిరోజులుగా ‘ఆ రాత్రి ఏం జరిగిందంటే..’ అనే టైటిల్‌తో నందమూరి బాలకృష్ణ స్టోరీని ఆయన తెరకెక్కించబోతున్నారంటూ నెట్టింట్లో ఒక న్యూస్ వైరల్ అయింది. బాలకృష్ణ ఇంట్లో ఓ నిర్మాతపై రాత్రి సమయంలో జరిగిన కాల్పులకు సంబంధించిన కథతో సినిమాను తెరకెక్కించబోతున్నారని రూమర్స్ వచ్చాయి. దీనిపై ఓ ఛానెల్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో భాగంగా ఆర్జీవీ స్పందించాడు.
‘‘నేనసలు ఎప్పుడూ దాని గురించి మాట్లాడలేదు. అదొక రూమర్ మాత్రమే. బాలకృష్ణపై సినిమా తీసే ఆలోచన రావొచ్చేమో అది తెలియదు. కానీ ఇప్పటికైతే లేదు. అదెవరో సైట్‌లో పెడితే నాకు తెలిసింది. ‘ఆ రాత్రి ఏం జరిగిందంటే..’ అనే ఐడియానే వాళ్లు చెబితే నాకు వచ్చింది. నేను అన్నీ డైరెక్టుగానే అనౌన్స్ చేస్తాను. ‘పవర్ స్టార్’.. ‘కమ్మ రాజ్యంలో..’ ఇవన్నీ డైరెక్టుగానే అనౌన్స్ చేశాను. కానీ బాలకృష్ణపై సినిమా విషయాన్ని నేనెక్కడా చెప్పలేదు. ఫస్ట్ టైం నేను ఓ సైట్‌లో చదివాను. అది చదివిన తర్వాతే నాకు ఐడియా వచ్చింది. కానీ నేను తీయకపోవచ్చు. తీస్తే మాత్రం దానిపై ఆధారపడిందేదో తీస్తా’’ అని వర్మ తెలిపారు.