విజయ్ అభిమాని ఆత్మహత్య.. ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతున్న పోస్టులు..

లాక్‌డౌన్ సమయంలో సినీ పరిశ్రమలో తీవ్ర విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. పలు భాషలకు చెందిన నటీనటులు, సాంకేతిక నిపుణులు మరణించారు. స్టార్ హీరోల అభిమానులు చిన్న వయసులోనే ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంఘటనలు కూడా జరిగాయి. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ అభిమాని భార్గవి తారక్ కుటుంబ పరిస్థితుల వల్ల ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మర్చిపోకముందే ఇలాంటి సంఘటనే మరోటి చోటుచేసుకుంది.
తమిళనాట స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈతరం కుర్రాళ్లలో విజయ్ సినిమాలకు ఉన్న క్రేజే వేరు. తాజాగా విజయ్ వీరాభిమాని బాలా అనే కుర్రాడు ఆత్మహత్య చేసుకున్నాడు.
ఆత్మహత్యకు గల కారణమేంటో తెలియదు గానీ బాలా మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్న పోస్ట్‌లతో ట్విట్టర్ హోరెత్తుతోంది. ట్విట్టర్‌లో #RIPBala ట్వీట్స్ ట్రెండ్ అవుతున్నాయి. సూసైడ్ సమస్యలకు పరిష్కారం కాదని, జీవితం చాలా చిన్నదని.. ఇలా అర్థాంతరంగా ముగించొద్దని విజయ్ అభిమానులతో పాటు ఇతర హీరోల అభిమానులు ట్వీట్స్ చేస్తున్నారు.