Dunki Review : ‘డంకీ’ మూవీ రివ్యూ.. నవ్వించి.. ఏడిపించేసిన షారుఖ్ ఖాన్..

షారుఖ్ ఖాన్ ‘డంకీ’ సినిమా నేడు డిసెంబర్ 21న ప్రపంచవ్యాప్తంగా కేవలం హిందీలోనే విడుదల అయింది.

Dunki Review : ‘డంకీ’ మూవీ రివ్యూ.. నవ్వించి.. ఏడిపించేసిన షారుఖ్ ఖాన్..

Shah Rukh Khan Dunki Movie Full Review and Rating

Updated On : December 21, 2023 / 12:56 PM IST

Dunki Movie Review : రాజ్ కుమార్ హిరాణి(Rajkumar Hirani) దర్శకత్వంలో షారుఖ్ ఖాన్(Shah Rukh Khan), తాప్సీ(Tapsee) జంటగా విక్కీ కౌశల్(Vicky Kaushal) ముఖ్య పాత్రలో తెరకెక్కిన ‘డంకీ’ సినిమా నేడు డిసెంబర్ 21న ప్రపంచవ్యాప్తంగా కేవలం హిందీలోనే విడుదల అయింది. షారుఖ్ ఈ సంవత్సరం పఠాన్, జవాన్ సినిమాలతో వచ్చి భారీ హిట్స్ కొట్టడంతో డంకీ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. గత రెండు సినిమాలు మాస్ యాక్షన్ అయితే డంకీ ఎమోషనల్ డ్రామా.

కథ విషయానికొస్తే..
మను(తాప్సి), బుగ్గు(విక్రమ్ కొచ్చర్), బల్లి(అనిల్ గ్రోవర్) పంజాబ్ లోని ఓ మాములు ఊర్లో ఆర్ధిక సమస్యలతో నివసిస్తూ ఉంటారు. ఎలాగైనా లండన్ వెళ్లి బాగా డబ్బులు సంపాదించాలనుకుంటారు. కానీ వీరికి చదువు లేకపోవడం, ఫేక్ వీసా కన్సల్టెన్సీలను నమ్మి మోసపోయిన టైంలో జవాన్ అయిన హార్డీ(షారుఖ్ ఖాన్) తనని కాపాడిన మను వాళ్ళ అన్నయ్యకి థ్యాంక్స్ చెప్దామని ఆ ఊరు వస్తాడు. అప్పటికే అతను చనిపోవడం, వీళ్ళ ఆర్ధిక బాధలు చూసి వీరిని ఎలాగైనా లండన్ పంపాలి అనుకుంటాడు. వీరంతా ఇంగ్లీష్ కోచింగ్ తీసుకొని స్టూడెంట్స్ వీసా మీద వెల్దామనుకుంటారు. కానీ బల్లికి వచ్చి మిగిలిన వారందరికీ వీసా రిజెక్ట్ అవుతుంది.

ఇష్టం లేని పెళ్లి చేసినందుకు తన ప్రియురాలిని ఇంగ్లాండ్ నుంచి కాపాడి తీసుకొద్దామనుకున్న సుఖీ(విక్కీ కౌశల్) వీసా రిజెక్ట్ అవ్వడం, తన ప్రియురాలు చచ్చిపోయిందని ఇంగ్లాండ్ వెళ్లిన బల్లి చెప్పడంతో అతను ఆత్మహత్య చేసుకుంటాడు. దీంతో బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు మనం మీకు హిందీ వచ్చా అని అడగలేదు, ఇన్ని రూల్స్ పెట్టలేదు, కానీ మనం వాళ్ళ దేశానికి వెళ్తున్నప్పుడు ఇన్ని రూల్సా? ఎలాగైనా ఇంగ్లాండ్ వెళ్ళాలి అని షారుఖ్, మిగిలిన వాళ్లంతా ఫిక్స్ అవుతారు. దీంతో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ గా డంకీ రూట్ లో దేశాలు దాటుకుంటూ వెళదామని ఫిక్స్ అవుతారు. ఇక షారుఖ్, మిగిలిన వాళ్లంతా అక్రమంగా దేశాలు దాటుకుంటూ ఎన్ని కష్టాలతో ఇంగ్లాండ్ ఎలా వెళ్లారు? అక్కడ వాళ్ళు ఎదుర్కున్న పరిస్థితులు ఏంటి? మను – హార్డీ ఎందుకు దూరమయ్యారు? మళ్ళీ ఎలా కలిశారు అనే ఎమోషనల్ కథని తెరపై చూడాల్సిందే.

సినిమా విశ్లేషణ..
మొదటి హాఫ్ అంతా ఓ పల్లెటూళ్ళో లండన్ వెళ్ళాలి అనే ఆశలతో ఉన్న వాళ్ళతో కామెడీ నడిపించారు. ప్రీ క్లైమాక్స్ లో విక్కీ కౌశల్ పాత్ర ఆత్మహత్యతో సినిమాని ఎమోషనల్ గా మార్చి ఇంటర్వెల్ ఇస్తారు. ఇక సెకండ్ హాఫ్ అంతా అక్రమంగా దేశాలు దాటేటప్పుడు వాళ్ళు పడ్డ బాధలు అన్ని చూపిస్తారు. వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తారు? వాళ్లకు ఎదురయ్యే కష్టాలు ఏంటి అని ఎమోషనల్ గా చూపిస్తారు. ఇంగ్లాండ్ లో ఇల్లీగల్ గా బతికే వారికి ఎలాంటి కష్టాలు ఉంటాయి అని కళ్ళకి కట్టినట్టు చూపిస్తారు. సెకండ్ హాఫ్ అంతా ఎమోషనల్ గానే సాగుతుంది. అయితే ఈ కథ అంతా ఫ్లాష్ బ్యాక్ గా చూపిస్తారు. ఓ 50 ఏళ్ళ వయసులో షారుఖ్, తాప్సి, మిగిలిన వాళ్ళతో కథని మొదలుపెట్టి 25 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్లి మళ్ళీ క్లైమాక్స్ లో ప్రస్తుత పరిస్థితులని చూపిస్తారు. క్లైమాక్స్ కూడా చాలా ఎమోషనల్ గా ఉంటుంది. సినిమా చూసిన వారు సెకండ్ హాఫ్ లో కచ్చితంగా కన్నీళ్లు పెడతారు. ప్రపంచవ్యాప్తంగా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పడే బాధలు, వారు ఎందుకు అలా వెళ్తున్నారు అనే కథని తీసుకొని రాజ్ కుమార్ హిరాణి తన మార్క్ ఎమోషనల్ డ్రామాతో నడిపించారు.

నటీనటుల విషయానికొస్తే..
షారుఖ్ ఖాన్.. హార్డీ పాత్రలో ఫస్ట్ హాఫ్ అంతా నవ్వించి, సెకండ్ హాఫ్ లో ఎమోషనల్ సీన్స్ లో ప్రేక్షకులు ఏడ్చేలా చేస్తాడు. ఇక 50 ఏళ్ళ వయసు పాత్రలో కూడా షారుఖ్ మెప్పిస్తాడు. తాప్సి కూడా యంగ్, ముసలి పాత్రలో ఎమోషన్ తో మెప్పిస్తుంది. విక్కీ కౌశల్ గెస్ట్ రోల్ చేసినా ఉన్న పావుగంట ప్రేక్షకులని ఎమోషనల్ చేస్తాడు. విక్రమ్ కొచ్చర్, అనిల్ గ్రోవర్, బొమన్ ఇరానీ.. పాత్రలు కూడా తమ కామెడీ టైమింగ్ తో మెప్పిస్తాయి.

టెక్నికల్ అంశాలు..
స్టార్ హీరో సినిమా కాబట్టి నిర్మాణ విలువలు చాలా రిచ్ గా ఉంటాయి. అందులోనూ ఈ సినిమాకి షారుఖ్, దర్శకుడు రాజ్ కుమార్ హిరాణిలే నిర్మాతలు. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ ఉండవు. ఎక్కువగా ఎమోషనల్ డ్రామా మీదే నడవడంతో అమన్ పంత్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి చాలా ప్లస్ అవుతుంది. సినిమాటోగ్రఫీ కూడా లొకేషన్ కి, కాలానికి తగ్గట్టు చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది.

Also Read :  సలార్, డంకీ.. మొదటి రోజు ఏ సినిమాకు ఎన్ని కోట్లు వస్తాయంటే..?

మొత్తంగా షారుఖ్ ఖాన్ గత సినిమాల్లో యాక్షన్ తో మెప్పిస్తే ఈ సారి రాజ్ కుమార్ హిరాణి మార్క్ ఎమోషనల్ టచ్ తో ప్రేక్షకులని నవ్వించి, ఏడిపించి మెప్పించాడు. ఈ సినిమాకు 3 రేటింగ్ ఇవ్వొచ్చు. అయితే డంకీ సినిమా సౌత్ భాషల్లో రిలీజ్ లేకుండా కేవలం హిందీలోనే రిలీజ్ అవ్వడం రేపు సలార్ రిలీజ్ ఉండటంతో కమర్షియల్ గా ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

గమనిక : ఈ రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడు వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే..