T20 World Cup: భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారు -షాహిద్ అఫ్రిది

భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ అంటే ఉండే హీట్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

T20 World Cup: భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారు -షాహిద్ అఫ్రిది

Shahid Afridhi

Updated On : October 10, 2021 / 7:03 PM IST

T20 World Cup: భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ అంటే ఉండే హీట్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎప్పుడూ క్రికెట్ చూడని వాళ్లు సైతం టీవీలకు అతుక్కుపోయే సమయం అది. త్వరలో టీ20 వరల్డ్ కప్‌లో ఈ రెండు జట్ల మధ్య జరగబోయే మ్యాచ్ గురించి ఇప్పటి నుంచే మాట్లాడుకుంటున్నారు. కేవలం ఐసీసీ ఈవెంట్లలో మాత్రమే ఈ రెండు జట్ల తలపడే పరిస్థితి ఉండగా.. అక్టోబర్ 24వ తేదీ ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరగబోతుంది.

క్రికెట్‌లో భారత్, పాకిస్తాన్ జట్లు ముఖాముఖిగా ఉంటే, ఉత్సాహం తారాస్థాయిలో ఉంటుంది. ద్వైపాక్షిక సిరీస్‌లు ఇకపై కూడా భారతదేశం, పాకిస్తాన్ మధ్య జరగవు. ఐసీసీ ఈవెంట్లలో మాత్రమే ఆడతాయి. 2021 టీ20 వరల్డ్ కప్‌లో భారత్ పాకిస్తాన్‌ మ్యాచ్‌కు సంబంధించి పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది పెద్ద స్టేట్‌మెంట్ ఇచ్చాడు.

షాహిద్ అఫ్రిది తన అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ.., “భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ ఎప్పుడూ ఒత్తిడిగానే ఉంటుంది. ఏ జట్టు ఒత్తిడిని సమర్థంగా ఎదుర్కోగలదో? అదే గెలుస్తుంది. ఎవరు తక్కువ తప్పులు చేస్తే ఆ జట్టుకు గెలిచే అవకాశం ఉంటుంది.” అని అన్నారు.

ఒకే గ్రూపులో భారత్, పాకిస్తాన్:
ICC గ్రూప్-2లో భారత్, పాకిస్తాన్ రెండూ ఒకే జట్టులో ఉన్నాయి. ఈ రెండు జట్లు కాకుండా ఈ గ్రూపులో న్యూజిలాండ్, అఫ్ఘానిస్తాన్ ఉన్నాయి. మరో రెండు క్వాలిఫయర్ జట్లు కూడా ఈ జట్టులోకి రానున్నాయి. 2021 టీ20 ప్రపంచకప్ అక్టోబర్ 17 నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఒమన్‌లలో జరగనున్నాయి. అక్టోబర్ 24వ తేదీన, భారత్, పాకిస్తాన్ జట్లు తలపడతాయి.

ప్రపంచ కప్‌లో భారత్ ఎప్పుడూ పాకిస్తాన్‌పై ఓడిపోలేదు:
ఇప్పటి వరకు భారత జట్టు పాకిస్థాన్‌పై వన్డే, టీ 20 ప్రపంచకప్‌ మ్యాచ్‌లలో ఓడిపోలేదు. ప్రపంచ కప్‌లో, ఇరు జట్లు ఇప్పటివరకు మొత్తం 12 సార్లు ముఖాముఖిగా తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లన్నింటిలోనూ పాకిస్తాన్‌పై భారత్ విజయం సాధించింది. వన్డే ప్రపంచకప్‌లో భారత్ 7-0 ఆధిక్యంలో ఉండగా.. టీ20 ప్రపంచకప్‌లో 5-0 ఆధిక్యంలో ఉంది.