పనికిరాని ప్లాస్టిక్ తో…లక్ష కి.మీ రోడ్లు వేసిన కేంద్రం

  • Published By: venkaiahnaidu ,Published On : July 10, 2020 / 04:41 PM IST
పనికిరాని ప్లాస్టిక్ తో…లక్ష కి.మీ రోడ్లు వేసిన కేంద్రం

Updated On : July 10, 2020 / 5:13 PM IST

రహదారుల నిర్మాణంలో ప్లాస్టిక్ వ్యర్థాలను కేంద్ర ప్రభుత్వం ఉపయోగిస్తోంది. ఇప్పటివరకు ప్లాస్టిక్ వ్యర్థాలను ఉపయోగించి కేంద్ర ప్రభుత్వం 1 లక్ష కిలోమీటర్ల రహదారిని నిర్మించింది. రీసైక్లింగ్ కుదరని ప్లాస్టిక్​ను ఇందుకోసం వాడింది. ఫలితంగా కొన్ని వందల కోట్ల రూపాయలు ఆదా అయ్యాయి. మరో లక్ష కిలోమీటర్ల మేర దేశవ్యాప్తంగా ప్లాస్టిక్​ రోడ్లు వేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.

ఒక కిలోమీటరు రహదారిని వేయడానికి తొమ్మిది టన్నుల తారు, ఒక టన్ను ప్లాస్టిక్ వ్యర్ధాలను ప్రభుత్వం వాడింది. మామూలు రోడ్లలో కిలోమీటరుకు పది టన్నుల తారును వాడతారు. ఒక టన్ను తారుకు సరాసరి 30 వేల రూపాయల వరకూ ఖర్చు అవుతుంది. కిలోమీటరుకు ఒక టన్ను ప్లాస్టిక్ వ్యర్ధాలను ఉపయోగించడం వల్ల, లక్ష కిలోమీటర్లకు వందల కోట్ల రూపాయలు ఆదా అయ్యాయి. ప్లాస్టిక్ రోడ్లలో సహజంగా 6-8 శాతం వరకు ప్లాస్టిక్, 92- 94 శాతం వరకు తారు ఉంటాయి.

రహదారి నిర్మాణంలో ప్లాస్టిక్ వ్యర్థాల వాడకాన్ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ 2016 లో ప్రకటించారు. అప్పటి నుండి 11 రాష్ట్రాల్లో లక్ష కిలోమీటర్ల రహదారి నిర్మాణంలో ప్లాస్టిక్ వ్యర్థాలను ఉపయోగించారు.

2018లో మున్సిపల్ కార్పొరేషన్ అఫ్ గురుగ్రామ్(MCG) తొలిసారిగా తారు రోడ్లలో ప్లాస్టిక్ వ్యర్ధాలను వాడటం మొదలుపెట్టంది. ప్రస్తుతం అక్కడ తారురోడ్లలో ప్లాస్టిక్​ను వాడటం తప్పనిసరి. అస్సాం ఈ సంవత్సరం నుండి వ్యర్థ పదార్థాలను ఉపయోగించడం ప్రారంభించింది.

జమ్మూకాశ్మీర్ జాతీయ రహదారిలో 270 కిలోమీటర్ల దూరానికి ప్లాస్టిక్​ వ్యర్ధాలు కలిపి రోడ్డు వేశారు. ఢిల్లీ–మీరట్​ జాతీయ రహదారిలో కూడా 1.6 టన్నుల ప్లాస్టిక్​ వేస్ట్​ను వాడారు. ధౌలా కువాన్​ నుంచి ఢిల్లీ ఎయిర్​పోర్టుకు వేసిన రోడ్డులోనూ ప్లాస్టిక్​ను వాడారు.

కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ లెక్కల ప్రకారం… మనదేశంలో రోజూ 25,940 టన్నుల ప్లాస్టిక్​ వ్యర్ధాలు తయారవుతున్నాయి. ఇది 4300 ఏనుగుల బరువుతో సమానం. ఇందులో 60 శాతంపైగా రీసైక్లింగ్​ అవుతోంది. మిగిలిన దాని మూలంగా వాతావరణం కాలుష్యం అవుతోంది.