అయోధ్యలో 144 సెక్షన్ : 21న రామమందిర నిర్మాణానికి శంకుస్ధాపన

  • Published By: chvmurthy ,Published On : February 17, 2019 / 06:04 AM IST
అయోధ్యలో 144 సెక్షన్ : 21న రామమందిర నిర్మాణానికి శంకుస్ధాపన

Updated On : February 17, 2019 / 6:04 AM IST

ఫైజాబాద్ :  వివాదాస్పద రామజన్మ భూమి.. అయోధ్యలో ప్రభుత్వం నిషేధాజ్ఞలు అమలు చేస్తోంది. ఫిబ్రవరి 21 న అయోధ్యలో రామమందిర నిర్మాణానికి శంకుస్ధాపన చేసేందుకు ద్వారాక పీఠాధిపతి శంకరాచార్యస్వామి స్వరూపానందేంద్ర సరస్వతిస్వామి తలపెట్టిన పాదయాత్ర సందర్భంగా ఫైజాబాద్ లో  ప్రభుత్వ అధికారులు అప్రమత్తమయ్యారు.  అయోధ్యలో  నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నారు. 

అయోధ్య రామాలయం నిర్మాణాన్ని ఫిబ్రవరి 21 నుంచి ప్రారంభించబోతున్నట్లు ధర్మ సంసద్ జనవరి31న  ప్రకటించింది. కుంభమేళా సందర్భంగా  యూపీలోని ప్రయాగ్ రాజ్ లో సమావేశమైన సాధు, సంతులు ఈ నిర్ణయం తీసుకున్నారు. న్యాయస్థానం వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ… ప్రయాగ్ రాజ్‌లో లక్షలాదిగా వచ్చిన సాధు, సంతుల సమావేశంలో  ఈ నిర్ణయం తీసుకున్నారు. 

అయోధ్యలో బాబ్రీ మసీదు-రామమందిరం కేసులో వివాదంలో లేని భూమిని రామజన్మభూమి న్యాస్కు కాని, రామమందిర నిర్మాణానికి సంబంధించిన వ్యవహారాలు చూస్తున్న ట్రస్టుకుకానీ అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

16వ శతాబ్దపు బాబ్రీ మసీదు ఉన్న మొత్తం భూమిని యధాతథంగా ఉంచాలని సుప్రీంకోర్టు గతంలో ఆదేశించింది. దీనిలో వివాదాస్పదం కాని భూమిపై యధాతథ స్థితి తొలగించాలని కేంద్రం కోరింది. మొత్తం 67 ఎకరాలను 25 ఏళ్ల కింద ప్రభుత్వం సేకరించింది. దీనిలో 2.5 ఎకరాల స్థలంపై వివాదం నెలకొంది.అయితే 0.313 ఎకరాల భూమిపై మాత్రమే వివాదం నెలకొని ఉందని కేంద్రం పేర్కొంది. అయితే కేంద్రం సమర్పించిన దానిపై సుప్రీం ధర్మాసనం తన నిర్ణయం ప్రకటించకముందే ప్రయాగ్ రాజ్‌లో ధర్మ సంసద్ రామాలయ నిర్మాణంపై తమ నిర్ణయం ప్రకటించింది.

దీంతో అయోధ్యలో 144 సెక్షన్ కింద నిషేధాజ్ఞలు అమల్లోకి తెచ్చామని అడిషనల్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ (శాంతి భద్రతలు) పీడీ గుప్తా చెప్పారు. తాజా ఉత్తర్వుల నేపథ్యంలో తాత్కాలిక రామజన్మభూమి ఆలయం వద్దకు చేరుకునేందుకు ఒకే ఒక్క రోడ్డు మార్గంలో మాత్రమే అనుమతిస్తున్నారు. తక్కిన రోడ్డు మార్గాలను అధికారులు మూసివేసారు. 15 మందికి మించిన ఏబృందాన్ని కూడా ఆలయ స్థలంలోకి అడుగుపెట్టనీయమని అధికారులు తెలిపారు.