Covaxin Puzzle : కొవాగ్జిన్ లెక్కల్లో తిరకాసు, మిగిలిన 4 కోట్ల డోసులు ఏమైనట్టు ?
హైదరాబాద్‌కి చెందిన భారత్ బయోటెక్ తయారుచేసిన కొవాగ్జిన్ వ్యాక్సిన్లలో 4 కోట్ల కొవాగ్జిన్ షాట్స్ మిస్ అయినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందుబాటులో ఉన్న అధికారిక సమాచారం ప్రకారం ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 2 కోట్ల 10 లక్షల కొవాగ్జిన్ డోసులు ఇచ్చారు.

Covaxin Shots
Bharat Biotech : హైదరాబాద్‌కి చెందిన భారత్ బయోటెక్ తయారుచేసిన కొవాగ్జిన్ వ్యాక్సిన్లలో 4 కోట్ల కొవాగ్జిన్ షాట్స్ మిస్ అయినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందుబాటులో ఉన్న అధికారిక సమాచారం ప్రకారం ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 2 కోట్ల 10 లక్షల కొవాగ్జిన్ డోసులు ఇచ్చారు. భారత్ బయోటెక్, కేంద్రం పలు సందర్భాల్లో చేసిన ప్రకటనల ప్రకారం చూస్తే.. ఇప్పటి వరకు 6 కోట్ల డోసుల కొవాగ్జిన్ దేశంలో అందుబాటులో ఉండాలి. మరి 6 కోట్ల కొవాగ్జిన్ డోసుల్లోంచి 2 కోట్ల 10 లక్షల ఇచ్చినట్టయితే.. మిగిలిన దాదాపు 4 కోట్ల కొవాగ్జిన్ డోసులు ఏమైనట్టనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
జనవరి నుంచి ఇప్పటివరకు దేశంలో భారత్ బయోటెక్ 8 కోట్ల కొవాగ్జిన్ డోసులు తయారు చేసినట్టు కంపెనీ ఇచ్చిన ప్రకటనలే స్పష్టం చేస్తున్నాయి. అందులో వ్యాక్సిన్ డిప్లొమసీలో భాగంగా 2 కోట్ల డోసులు విదేశాలకు ఎగుమతి అయినట్టుగా భావించినా.. మిగతా 6 కోట్ల డోసుల్లో 2 కోట్ల డోసులు పోగా మరో 4 కోట్ల డోసులు ఏమయ్యాయనేదే ప్రస్తుతం ఓ పజిల్‌గా మారింది. ఏప్రిల్ 20న భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణ ఎల్లా చెప్పిన వివరాల ప్రకారం.. మార్చిలో కోటిన్నర డోసులు.. ఏప్రిల్‌లో మరో 2 కోట్ల డోసులు ఉత్పత్తి చేసింది. మే నెలలో మూడు కోట్ల డోసులు ఉత్పత్తి చేస్తామని కూడా చెప్పారు. కానీ మేలో 2 కోట్ల డోసులు ఉత్పత్తి అయ్యాయంటున్నారు. ఈ లెక్కల ప్రకారం మార్చి, ఏప్రిల్ నెలల్లో మూడున్నర కోట్ల డోసులు, మే నెలలో 2 కోట్ల డోసులు ఉత్పత్తి అయినట్టుగా లెక్కలు చెబుతున్నాయి. కేంద్రం కూడా సుప్రీంకోర్టు, కేరళ హైకోర్టులకు ఈ నెల 24న సమర్పించిన రెండు అఫిడవిట్లలో నెలకు రెండు కోట్ల కొవాగ్జిన్ డోసులు ఉత్పత్తి అవుతున్నాయని పేర్కొంది. అంటే ఈ లెక్కల ప్రకారం మొత్తం ఐదున్నర కోట్ల డోసులు ఇప్పటి వరకు అందుబాటులోకి రావాలి.
మరోపక్క, వ్యాక్సినేషన్ ప్రక్రియ ఇండియాలో మొదలవ్వడానికి ముందు.. అంటే జనవరి 5న కృష్ణ ఎల్లా చెప్పిన వివరాల ప్రకారం.. అప్పటికే రెండు కోట్ల డోసులు ఉత్పత్తి చేసి, సిద్ధంగా ఉంచింది. అంటే వాటితో కలిపి దేశంలో ఏడున్నర కోట్ల కొవాగ్జిన్ డోసులు అందుబాటులో ఉండాలి. మార్చి, ఏప్రిల్‌లో పోల్చితే.. జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఉత్పత్తి తక్కువగా ఉంది. అవి కూడా కలుపుకొంటే.. మొత్తం మీద భారత్ బయోటెక్ నుంచి ఉత్పత్తి అయిన వ్యాక్సిన్ డోసులు 8 కోట్లుగా ఉంటుందని అంచనా.
భారత్ నుంచి ఇప్పటి వరకు ఆరు కోట్ల అరవై లక్షల డోసులు వివిధ దేశాలకు ఎగుమతి అయ్యాయని చెబుతున్నారు. అందులో కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులే ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ కొవాగ్జిన్ డోసులు రెండు కోట్లు ఉన్నాయనుకుంటే.. ఇండియా అవసరాల కోసం మిగిలిన ఆరు కోట్ల డోసులు అందుబాటులో ఉండాలి. వాటిలో రెండుకోట్ల పది లక్షల డోసులు వినియోగించగా.. మిగిలిన డోసులు ఏమయ్యాయన్నదే తెలియడం లేదు.
కొవాగ్జిన్ వ్యాక్సిన్ షాట్స్ వినియోగం ఢిల్లీలోనే అధికంగా కనిపించింది. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఢిల్లీలోనే అత్యధికంగా 31 శాతం మందికి కోవాగ్జిన్ డోసులు ఇచ్చారు. ప్రస్తుతం ఢిల్లీలోనూ కొవాగ్జిన్ డోసులు అందుబాటులో లేకపోవడంతో పలు చోట్ల సెకెండ్ డోస్ వేయాల్సిన వారికి వ్యాక్సినేషన్ డ్రైవ్ నిలిచిపోయింది. ఇప్పటివరకు దేశంలోని మరో 14 చిన్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఒక్క కొవాగ్జిన్ డోసు కూడా అందలేదు. మరో ఐదు రాష్ట్రాల్లో ఇప్పటివరకు చేపట్టిన కొవిడ్-19 వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో కొవాగ్జిన్ వాటా కేవలం 5 శాతంగానే ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాలకు సైతం కొవాగ్జిన్ డోసులు అందనప్పుడు ఆ మిగతా డోసులన్నీ ఏమయ్యాయనేదే ఇప్పుడు అంతుచిక్కని ప్రశ్నగా మారింది. కొవాగ్జిన్ డోసులను ఎవరైనా బ్లాక్ చేసి ఉంటారా అనే సందేహాలు కూడా కలుగుతున్నాయి.
Read More : Brothel House : వ్యభిచార గృహం నిర్వాహకులపై పీడీ యాక్ట్