లోక్‌సభ ఎన్నికలు : రెండో దశలో 68 శాతం పోలింగ్

లోక్‌సభ ఎన్నికల్లో రెండో దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పన్నెండు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని… 95 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. మొదటి దశకంటే రెండో దశలో పోలింగ్ బాగా పెరిగినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. వెస్ట్ బెంగాల్‌లోని రెండు మూడు ప్రాంతాల్లో కేంద్రబలగాలు, స్థానికులకు మధ్య ఘర్షణ చోటు చేసుకోగా.. చత్తీస్‌గఢ్‌లో ఓ చోట మావోయిస్టులు బాంబు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలు మినహా మిగిలిన అన్నిచోట్లా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఓవరాల్‌గా 68 శాతం పోలింగ్ నమోదైంది. అన్ని రాష్ట్రాల కంటే పశ్చిమబెంగాల్‌లో 75.27శాతం ఓటింగ్ జరగడం విశేషం.
రెండో దశ పోలింగ్‌లో ఓటింగ్ ప్రక్రియ పశ్చిమబెంగాల్, చత్తీస్‌గఢ్‌లోని హింసాత్మక ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసిందని ఈసీ ప్రకటించింది. రాష్ట్రాల వారీగా చూస్తే అస్సోంలో 73.32%, బీహార్ 58.14%, చత్తీస్‌గఢ్‌లో 68.70% పోలింగ్ నమోదు అయింది.
జమ్మూకాశ్మీర్‌లో 43.37%, కర్ణాటకలో 61.80%, మహారాష్ట్రలో 55.37%, మణిపూర్‌లో 74.69%, ఒడిశాలో 57.41%, పుదుచ్చేరిలో 72.40 శాతం, తమిళనాడులో 61.52%, ఉత్తర ప్రదేశ్‌లో 58.12%, పశ్చిమ బెంగాల్ అధికంగా 75.27% పోలింగ్ నమోదు అయింది. ఏప్రిల్ 23న మూడోదశ ఎన్నికలలో 116 నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది.