8th Pay Commission : కేంద్ర కేబినెట్లో కీలక నిర్ణయాలు.. 8వ వేతన సంఘం ఏర్పాటు!

8th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంక్రాంతి కానుక. 8వ కేంద్ర వేతన సంఘం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

8th Pay Commission : కేంద్ర కేబినెట్లో కీలక నిర్ణయాలు.. 8వ వేతన సంఘం ఏర్పాటు!

8th Pay Commission

Updated On : January 16, 2025 / 5:50 PM IST

8th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కేంద్ర కేబినెట్లో కీలక నిర్ణయాలు తీసుకుంది. వేతన సవరణలను సమీక్షించి సిఫార్సు చేసేందుకు 8వ కేంద్ర వేతన సంఘం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గురువారం (జనవరి 16) ఆమోదించింది. 2026 నాటికి దీనికి సంబంధించి నివేదికను సమర్పించనుంది. కేంద్ర కేబినెట్ సమావేశంలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ 8వ కేంద్ర వేతన సంఘానికి ప్రధాని నరేంద్ర మోదీ ఆమోదం తెలిపినట్టు చెప్పారు.

Read Also : Saif Ali Khan Attacked : బాలీవుడ్ న‌టుడు సైఫ్ పై అలీ ఖాన్ దాడి.. 10 కీలక ప్రశ్నలకు సమాధానాలు ఇవే..

మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో తాజా నిర్ణయం తీసుకున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. 8వ వేతన సంఘం చైర్మన్‌తోపాటు ఇద్దరు సభ్యులను త్వరలో నియమిస్తామని మంత్రి వైష్ణవ్ తెలిపారు. ఫిబ్రవరి 1, 2025న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించనున్న కేంద్ర బడ్జెట్ 2025-26కి కొన్ని రోజుల ముందు 8వ వేతన సంఘాన్ని ప్రకటించింది.

ప్రభుత్వ ఉద్యోగులకు ఎంత జీతాలు పెరుగుతాయంటే? :
2025 కేంద్ర బడ్జెట్‌కు ముందు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 8వ వేతన సంఘం బనాంజా లభించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ కనీస వేతనాల్లో 186 శాతం పెరగవచ్చని గతంలో నివేదికలు సూచించాయి. అయితే, ఇది ఊహాగానాలు మాత్రమే. 2026 నాటికి సమర్పించే 8వ వేతన సంఘం నివేదిక తర్వాతే కచ్చితమైన వేతనం ఎంతమేర పెరగనుందో తెలియనుంది. ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు వేతన సంఘం సిఫార్సుల మేరకు పెరగనున్నాయి.

2026 జనవరి ఒకటో తేదీ నుంచి కొత్త వేతనాలు అమల్లోకి రానున్నాయి. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.86కి ప్రభుత్వం ఆమోదం తెలిపితే.. ప్రభుత్వ ఉద్యోగుల కనీస వేతనం ప్రస్తుతం రూ.18వేలతో పోలిస్తే 186 శాతం పెరిగి రూ.51,480కి చేరుతుందని నివేదికలు చెబుతున్నాయి. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌లో పెంపు ఉద్యోగుల పెన్షన్, జీతాలు రెండింటినీ పెంచుతుంది. 8వ వేతన సంఘం ప్రకారం.. ప్రస్తుతం రూ.9వేల పింఛన్‌తో పోలిస్తే.. 186 శాతం పెరిగి రూ.25,740కి చేరుతుందని అంచనా.

షార్‌లో థర్డ్ లాంచ్‌ ప్యాడ్‌ :
శ్రీహరికోటలోని షార్‌లో థర్డ్ లాంచ్‌ ప్యాడ్ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 3,985 కోట్లతో మూడో రాకెట్ లాంచ్ ప్యాడ్ కోసం నిధుల కేటాయించింది. ఎన్‌జీఎల్‌వీ (NGLV) ప్రయోగాలకు తగినట్టుగా థర్డ్ లాంచ్‌ ప్యాడ్‌ నిర్మాణం చేపట్టనున్నారు. దీని ద్వారా భారీ శాటిలైట్లను కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు వీలుంటుంది.

వేతన సంఘం (పే కమిషన్) అంటే ఏమిటి? :
ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, అలవెన్సులు, ఇతర ప్రయోజనాలను నిర్ణయించడంలో పే కమీషన్ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ వేతన సంఘం సిఫార్సులతో దేశవ్యాప్తంగా మిలియన్ల మంది కార్మికులు, పెన్షనర్ల వేతనాల్లో మార్పులు చేస్తారు.

ప్రస్తుతం దేశంలో 49 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, దాదాపు 65 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు. ద్రవ్యోల్బణంతో సహా వివిధ ఆర్థిక సూచికలను పరిగణనలోకి తీసుకుని, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతన స్కేళ్లు, భత్యాలు, ప్రయోజనాలను మూల్యాంకనం చేయడం, మార్పులను సూచించేందుకు కేంద్ర వేతన సంఘాలను ఏర్పాటు చేస్తుంటారు.

సాధారణంగా ప్రతి దశాబ్దానికి ఒకసారి ఈ వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తారు. 1947 నుంచి కేంద్ర ప్రభుత్వం 7 పే కమిషన్లను ఏర్పాటు చేసింది. ప్రభుత్వ ఉద్యోగుల జీతాల నిర్మాణాలు, ప్రయోజనాలు, అలవెన్సులను నిర్ణయించడంలో పే కమిషన్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. చాలా ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థలు కమిషన్ సిఫార్సుల అనుగుణంగా నిర్ణయాలను తీసుకుంటాయి.

Read Also : Saif Ali Khan : అయిదు కార్లు ఉన్నా.. దాడి తర్వాత సైఫ్ అలీఖాన్ ని ఆటోలో హాస్పిటల్ కి తీసుకెళ్లిన తనయుడు..