మళ్లీ ‘చీపురు’కే పట్టాభిషేకం
ఢిల్లీ ప్రజల గుండెల్లో క్రేజీ.. కేజ్రీవాలేనని తేల్చేశాయి ఫలితాలు. కేంద్ర పెద్దలు సహా వెయ్యిమందికి పైగా సైన్యం మోహరించినా.. సింహం సింగిల్‌గా పోరాటం చేసిందని కేజ్రీవాల్‌ను ఆకాశానికెత్తేస్తున్నారు ప్రజలు.

ఢిల్లీ ప్రజల గుండెల్లో క్రేజీ.. కేజ్రీవాలేనని తేల్చేశాయి ఫలితాలు. కేంద్ర పెద్దలు సహా వెయ్యిమందికి పైగా సైన్యం మోహరించినా.. సింహం సింగిల్‌గా పోరాటం చేసిందని కేజ్రీవాల్‌ను ఆకాశానికెత్తేస్తున్నారు ప్రజలు.
ఢిల్లీ ప్రజల గుండెల్లో క్రేజీ.. కేజ్రీవాలేనని తేల్చేశాయి ఫలితాలు. కేంద్ర పెద్దలు సహా వెయ్యిమందికి పైగా సైన్యం మోహరించినా.. సింహం సింగిల్‌గా పోరాటం చేసిందని కేజ్రీవాల్‌ను ఆకాశానికెత్తేస్తున్నారు ప్రజలు. అయితే కేజ్రీ గెలుపు గాలివాటమో మరోటో కాదు. రెండుసార్లు అధికారంలో ఉన్న పార్టీకి మూడోసారి కూడా ప్రజలు పట్టం గట్టారంటే కేజ్రీవాల్ ఎంత కష్టపడి ఉంటారో అర్థం చేసుకోవచ్చు.
స్పష్టమైన లక్ష్యంతో ప్రజల దగ్గరకు వెళ్లిన కేజ్రీవాల్
ఆమ్ ఆద్మీ పార్టీ ఆవిర్భావం నుంచి కేజ్రీవాల్ స్పష్టమైన లక్ష్యంతో ప్రజల దగ్గరకు వెళ్లారు. ఢిల్లీ సమస్యలపై పూర్తి అవగాహన పెంచుకున్నారు. వాటన్నింటినీ తీర్చేందుకు కావాల్సిన అంశాలు, వనరులపై మేధావులతో చర్చించారు. మేనిఫెస్టో రూపకల్పన సైతం 2015లో డివిజన్ల వారీగా, రాష్ట్రం మొత్తానికి అవసరమైన విధానాలను పొందుపరిచి ప్రజల ముందుకు వెళ్లారు. దీంతో 70 స్థానాలకు 67 స్థానాలను క్లీన్ స్వీప్ చేశారు కేజ్రీవాల్. ఈసారి కూడా అలాంటి వ్యూహాన్నే అనుసరించారు.
సమకాలీన రాజకీయ చరిత్రలో సరికొత్త ఘట్టం
ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో విజయం సాధించడం సమకాలీన రాజకీయ చరిత్రలో సరికొత్త ఘట్టమనే చెప్పాలి. పార్టీని స్థాపించిన కొద్ది నెలల కాలంలోనే కేజ్రీవాల్ విక్టరీ కొట్టారు. ఈ విజయం వెనుక కులం, మతం, ధనం లేదు. కేవలం లక్షలాది సామాన్య ప్రజలు మాత్రమే ఉన్నారని తేలింది. ఇక 2020 ఎన్నికల్లో తాను అధికారంలో ఉండి చేసిన పనులు చెప్పుకుంటూ చేయాల్సిన వాటిపై దృష్టి పెట్టారు. మేనిఫెస్టోను అద్భుతంగా రూపొందించి పోలింగ్‌కు నాలుగు రోజుల ముందు ప్రజల ముందు పెట్టారు. అటు అనేక ఉచితాలు, రాయితీలు బీజేపీ, కాంగ్రెస్‌లు కూడా ప్రకటించాయి. కానీ అవేవీ ప్రజల్ని పెద్దగా ఆకర్షించలేదు..
కేజ్రీ మాటల్ని నమ్మిన జనం
అవినీతి లేకుండా పాలన చేయడమే కాదు.. తన మంత్రివర్గంలో అలాంటి పనులు ఎవరూ చేయకుండా కేజ్రీవాల్ జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ వ్యక్తిత్వమే ప్రజల మనసు చూరగొనేలా చేసింది. అందరు ముఖ్యమంత్రుల్లా హంగూ ఆర్భాటం కోరుకోకుండా సామాన్య వ్యక్తిగా జనంలో కలిసిపోవడం మరో ప్లస్ పాయింట్‌గా చెప్పొచ్చు. మేనిఫెస్టోలో చేర్చిన అంశాలను చాలామటుకు నెరవేర్చారు. పెద్దకొడుకుగా ఢిల్లీకి చేయాల్సింది చాలా ఉందన్న కేజ్రీ మాటల్ని జనం నమ్మారు.. అందుకే చీపురుకు పట్టం గట్టారు.
ఢిల్లీ ఎన్నికల్లో త్రిముఖ పోరు
మీరు ఓటేస్తే.. నేను సేవ చేస్తా.. ఇదే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు కేజ్రీవాల్. మళ్లీ ముఖ్యమంత్రిని చేస్తే.. అంతకుమించి అభివృద్ధి చేస్తానని హామీనిచ్చారు. ఇప్పటిదాకా చేసిందేంటి.. ఇకపై చేయబోయేదేంటి అంటూ.. 70ఎంఎంలో జనం కళ్లకు కట్టారు. ఆ మాటల్నే ఓటర్లు నమ్మినట్లే కనిపిస్తోంది. ఢిల్లీ ఎన్నికల్లో ఆప్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య త్రిముఖ పోరు నడిచింది. జాతీయ పార్టీలను కాదని నెగ్గుకు రావడం అంత ఆషామాషీ వ్యవహారం కాదు. కానీ తనదైన స్టయిల్‌లో సింగిల్‌గా సింహాంలా జనంలోకి వెళ్లారు ఆప్ అధినేత కేజ్రీవాల్. మాటలతో కోటలు కొట్టడం కాదు.. అభివృద్ధినే నినాదంగా చేసుకున్నారు. ముఖ్యమంత్రిగా ఏం చేశానో.. మళ్లీ పదవిలోకి వస్తే ఏం చేస్తానో ప్రజలకు క్లియర్ కట్‌గా వివరించారు. పనిచేసే నేతకు పట్టం కడితే మీ తలరాత మార్చేస్తానని ప్రతిజ్ఞ చేశారు.
ఢిల్లీ వాసులపై హామీల వర్షం
ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన ఆప్.. ఢిల్లీ వాసులపై హామీల వర్షం కురిపించింది. సీఎం కేజ్రీవాల్‌తో సహా ముఖ్య నాయకులంతా కలిసి 28 పాయింట్ల గ్యారెంటీ కార్డ్ రిలీజ్ చేశారు. ఈ హామీలను ఎట్టిపరిస్థితుల్లోనైనా అమలు చేసి తీరుతామని హామీ ఇచ్చారు. నాణ్యమైన విద్య, ప్రభుత్వ పాఠశాలల్లో దేశభక్తి పాఠ్యాంశాలు, స్వచ్ఛమైన తాగునీరు, నిరంతర విద్యుత్ సరఫరాను ఎన్నికల మేనిఫెస్టోలో ఆప్ చేర్చింది. రేషన్ సరుకుల డోర్ డెలివరీ చేస్తామని, 10 లక్షల మంది వృద్ధులను ఉచితంగా తీర్థయాత్రలకు పంపుతామని ప్రకటించింది.
పారిశుద్ధ్య కార్మికులకు ఆప్ పెద్దపీట
పారిశుద్ధ్య కార్మికులకు ఆప్ పెద్దపీట వేసింది. విధి నిర్వహణలో కార్మికులు చనిపోతే కోటి చొప్పున పరిహారం ఇస్తామని ఆప్ హామీ ఇచ్చింది. నాణ్యమైన విద్యలో భాగంగా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు నిర్వహిస్తామని పేర్కొంది. 24 గంటలు మార్కెట్లు అందుబాటులో ఉండేలా పైలట్ ప్రాజెక్టును చేపడతామని ప్రకటించింది. ఆమ్ ఆద్మీ మళ్లీ అధికారంలోకి వస్తే జన్‌లోక్‌పాల్ బిల్లు కోసం ప్రయత్నాలు కొనసాగిస్తామని చెప్పుకొచ్చింది. యువకులు, మహిళలు, సామాన్య ప్రజానీకం సాధికరతకు పెద్ద పీట వేస్తామని అభయమిచ్చింది.
కేజ్రీవాల్ గుడ్ గవర్నెన్స్
ఫలితాలు చూస్తుంటే.. కేజ్రీవాల్ గుడ్ గవర్నెన్స్ ఏంటో స్పష్టమవుతోంది. ఐదేళ్ల పాలనలో చేపట్టిన పథకాలనే ప్రచారంలో ప్రజల ముందు పెట్టారు. పేదలకు ఆధునిక సౌకర్యాలతో వైద్య సేవలందించే మొహల్లా క్లినిక్స్‌ను ఏర్పాటు చేశారు. అలాగే కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దారు. మహిళల భద్రత కోసం సీసీటీవీలు, వీధి దీపాలు ఏర్పాటు చేశారు. మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించారు. ఉచిత వైఫై అందుబాటులోకి తెచ్చారు. అవీనీతి రహిత పాలన అందించానని ధీమాగా చెప్పుకొచ్చారు. ఇలా తన పాలన గురించి చెప్పుకుని మరీ ఓట్లు అడిగారు కేజ్రీవాల్. ఐదేళ్ల పాలన గురించి లగే రహో కేజ్రీవాల్ అంటూ అదిరిపోయే పాటను విడుదల చేసి జనాన్ని ఎట్రాక్ట్ చేశారు.
పోటీ ఇవ్వని బీజేపీ…ఖాతా తెరవని కాంగ్రెస్
ఫలితాలు చీపురు పార్టీకి మళ్లీ పట్టాభిషేకం చేశాయి. బీజేపీ ఎన్ని ఎత్తులు వేసినా పని చేయలేదని అర్థమవుతోంది. పార్టీ కాస్త పుంజుకున్నా అధికారం మాత్రం అందలేదు. కాంగ్రెస్ ఈసారి కూడా ఖాతా తెరవలేదు. ఎలాగూ ఆప్-బీజేపీ మధ్య పోటీ అని గ్రహించిన కాంగ్రెస్.. కమలం ఓడితే చాలని, లోపాయికారీగా కేజ్రీవాల్‌కు సపోర్ట్ ఇచ్చిందన్న చర్చ కూడా జరుగుతోంది. ఆప్ కార్యాలయం వద్ద సందడి వాతావరణం నెలకొంది. పార్టీ అభిమానులు, కార్యకర్తలు స్వీట్లు పంచుతూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు బీజేపీ కార్యాలయం బోసిపోయింది. కొన్ని ప్రత్యేక కారణాల వల్ల కేజ్రీవాల్‌వైపే ఢిల్లీ ప్రజలు మొగ్గు చూపారని రాజకీయ విశ్లేషకులు పుల్లారావు అంటున్నారు. అప్‌కి విక్టరీ వచ్చినప్పటికీ… అది పూర్తిస్థాయి విక్టరీ కాదంటున్నారు. అలాగే బీజేపీకి ఈ ఫలితాలు ఎంతగానో కలిసొస్తాయంటున్నారు.