Akhilesh Yadav: యోగిని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించేందుకు మహాకుంభమేళాను వాడుకున్నారు- అఖిలేష్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు

కుంభమేళాను యోగి సర్కార్ మతపరమైన కార్యక్రమంగా కాకుండా రాజకీయ కార్యక్రమంగా మార్చాలనుకుందని అఖిలేష్‌ యాదవ్‌ మండిపడ్డారు.

Akhilesh Yadav: యోగిని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించేందుకు మహాకుంభమేళాను వాడుకున్నారు- అఖిలేష్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు

Updated On : April 20, 2025 / 11:17 PM IST

Akhilesh Yadav: యోగి ఆదిత్యనాథ్‌ను ప్రధాన మంత్రి అభ్యర్థిగా ప్రోత్సహించడానికి, సామాజిక విభజనను ప్రోత్సహించడానికి బీజేపీ మహా కుంభమేళాను ఉపయోగించుకోవాలని కుట్ర పన్నిందని అఖిలేష్ యాదవ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఏడాది యూపీలో నిర్వహించి మహా కుంభమేళాపై సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. యోగి ఆదిత్యనాథ్‌ను ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలనే బీజేపీ కుట్రలో ఇదొక భాగమని ఆయన ఆరోపించారు.

ప్రయాగ్‌రాజ్‌లో మీడియాతో మాట్లాడారు అఖిలేష్ యాదవ్. మహా కుంభమేళా సందర్భంగా సీఎం యోగి ఆదిత్యనాథ్ పేరును ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలనేది బీజేపీ ప్రణాళికగా వినిపించిందన్నారు. కుంభమేళాను యోగి సర్కార్ మతపరమైన కార్యక్రమంగా కాకుండా రాజకీయ కార్యక్రమంగా మార్చాలనుకుందని అఖిలేష్‌ యాదవ్‌ మండిపడ్డారు. తదుపరి ప్రధానిగా తనను ప్రకటించుకునేందుకు యోగి ఆదిత్యనాథ్‌ ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలని చూశారని ధ్వజమెత్తారు. యోగి పేరును తదుపరి ప్రధానిగా ప్రకటించాలనేది వారి ప్రణాళిక అన్నారు.

Also Read : సుప్రీంకోర్టు, సీజేఐపై బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు.. క్రిమినల్ కోర్టు ధిక్కార చర్యలకు అనుమతి కోరుతూ అటార్నీ జనరల్‌కు లేఖ

”మహాకుంభమేళాను సీఎం యోగి ఆదిత్యనాథ్ రాజకీయ కుంభ్‌గా మార్చారు. బీజేపీ తదుపరి ప్రధాని అభ్యర్థిగా యోగిని ప్రకటించడానికి కుంభమేళాను రాజకీయంగా వాడుకునే ప్లాన్ చేశారు. ఆ సమయంలో యోగిని పీఎం అభ్యర్థిగా ప్రకటిస్తారని ప్రచారం జరిగింది. దేశంలో ఎక్కడ అల్లర్లు జరిగినా దాని వెనుక బీజేపీ పాత్ర ఉంటుంది”అని అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు.

”మతాల మధ్య చీలికలు సృష్టిస్తున్నది ఎవరంటే అది బీజేపీయే. మతం, కులం పేరుతో సమాజంలో విభజనను సృష్టించడం అనేది బీజేపీకి చాలా ప్రణాళికాబద్ధమైన కార్యక్రమం. దాని కోసం నిధులు ఖర్చు చేస్తారు. ఆ పార్టీలోని నాయకులు ఎవరు ఏది చెప్పినా అది బీజేపీ ఆలోచనగానే చూడాల్సి ఉంటుంది” అని అఖిలేష్ యాదవ్ అన్నారు.

”ప్రజల సమస్యలను బీజేపీ పట్టించుకోవడం లేదు. ఈ ప్రభుత్వానికి పకోడా, భగోడా రెండు విజయాలు. ఎవరైనా ఉద్యోగం కోరుకుంటే పకోడాలు తయారు చేయాలని సూచిస్తారు. దేశం నుండి నగదు దోచుకుని విదేశాలకు పారిపోయిన వ్యక్తుల గురించి వారికి బాగా తెలుసు. మత ఘర్షణలు సృష్టించేందుకు వక్ఫ్‌ చట్టాన్ని ఆమోదించారు. ఎక్కడ అల్లర్లు జరిగినా వాటి వెనుక బీజేపీ ఉంటుంది. అది యోగి సైన్యం. యూపీని నాశనం చేసేందుకు యత్నిస్తోంది” అని నిప్పులు చెరిగారు అఖిలేష్ యాదవ్.

మరిన్ని ఇంట్రస్టింగ్ స్టోరీలు, అప్‌డేట్స్ కోసం 10టీవీ వాట్సాప్ చానల్‌ని ఫాలో అవ్వండి.. Click Here