సార్వత్రిక సమరం : దేశవ్యాప్తంగా ప్రారంభమైన పోలింగ్

దేశంలో సార్వత్రిక ఎన్నికల తొలి దశ పోలింగ్ ప్రారంభమైంది. 18 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలోని 91 లోక్ సభ స్థానాలకు గురువారం(ఏప్రిల్ 11) పోలింగ్ జరుగుతోంది. లోక్‌సభతోపాటే ఆంధ్రప్రదేశ్‌లోని 175, ఒడిశాలోని 28, సిక్కింలోని 32, అరుణాచల్ ప్రదేశ్ లోని 60 అసెంబ్లీ సీట్లకు కూడా పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల దాకా పోలింగ్ జరుగుతుంది. నక్సల్ ప్రభావిత ప్రాంతంలోనూ, ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని చోట్లా సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగుస్తుంది. ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉన్నా, అనివార్య కారణాల వల్ల (ఈవీఎంల మొరాయింపు లాంటి ఘటనల వల్ల) పోలింగ్ ఆలస్యంగా లేదా మందకొడిగా సాగుతున్నా ఓటింగ్ సమయాన్ని పెంచుతామని, నిర్ణయాధికారాన్ని సంబంధిత రాష్ట్ర సీఈఓ దగ్గర ఉంటుందని ఎలక్షన్ కమిషన్ స్పష్టం చేసింది. ఈ ఎన్నికల్లో నితిన్ గడ్కరీ, కిరెన్ రిజిజు, వీకే సింగ్ సహా పలువురు కేంద్ర మంత్రులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. లోక్‌సభలోని 543 స్థానాలకు 7 దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి.
ఏపీలో 25, తెలంగాణలో 17, యూపీలో 8, మహారాష్ట్రలో 7, అసోంలో 5, ఉత్తరాఖండ్ లో 5, బీహార్ లో 4, ఒడిశాలో 4, వెస్ట్ బెంగాల్ లో 2, అరుణాచల్ ప్రదేశ్ లో 2, జమ్మూకాశ్మీర్ లో 2, ఛత్తీస్ గఢ్ లో 1, మణిపూర్ లో 1, మేఘాలయలో 2, మిజోరంలో 1, నాగాలాండ్ లో 1, సిక్కింలో 1, త్రిపురలో 1, అండమాన్ నికోబార్ లో 1, లక్షద్వీప్ లో ఒక లోక్ సభ స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి.
ఏపీలో 3.93 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఎన్నికలు జరగడం ఇదే తొలిసారి. ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాలకు 2వేల 118 మంది, 25 లోక్‌సభ సీట్లకు 319 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం స్థానం నుంచి, ఆయన కుమారుడు నారా లోకేశ్ మంగళగిరి నుంచి బరిలో ఉన్నారు. ప్రతిపక్ష నేత, వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ పులివెందుల నుంచి పోటీ పడుతున్నారు.
తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలకూ తొలిదశలోనే పోలింగ్ జరుగుతోంది. తెలంగాణలో 443 మంది పోటీలో ఉన్నారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. నిజామాబాద్‌లో మాత్రం ఉదయం 8 గంటలకు పోలింగ్ మొదలై సాయంత్రం ఆరు గంటలకు ముగుస్తుంది. ఉదయం 5.30 గంటల నుంచి గంట పాటు నమూనా(మాక్) పోలింగ్ నిర్వహించారు. ఈవీఎంలు(బ్యాలెట్ యూనిట్‌లు), కంట్రోల్ యూనిట్లు, వీవీప్యాట్ చీటీలను ఎన్నికల ఏజెంట్ల సమక్షంలో పరీక్షించారు. పోలింగ్‌ను వీడియోలో చిత్రీకరించేందుకు ఏర్పాట్లు చేశారు. పోలింగ్ కేంద్రాల ఆవరణలో 144 సెక్షన్‌ను అమలు చేశారు. ప్రిసైడింగ్ అధికారి, సహాయ అధికారి, ఇతర ఉద్యోగులు, పోలీసులు తదితరులు ప్రత్యేక బస్సులు, వాహనాల్లో ఆయా పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల్లో ప్రత్యేక బలగాలు కూంబింగ్ చేపట్టాయి. నిజామాబాద్‌లో అత్యధికంగా 170మంది రైతులు సహా 185 మంది బరిలో ఉన్నారు. తెలంగాణ నుంచి పోటీ చేస్తున్న ప్రముఖుల్లో సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత (నిజామాబాద్), టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి (నల్గొండ), రేణుకాచౌదరి (ఖమ్మం), మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ (హైదరాబాద్) ఉన్నారు.
యూపీలోని 8 స్థానాల్లో కొత్తగా ఏర్పడిన ఎస్పీ, బీఎస్పీ, ఆర్‌ఎల్డీతో కూడిన మహాఘట్ బంధన్‌తో బీజేపీ తలపడుతోంది. ముజఫర్‌నగర్‌లో ఆర్‌ఎల్డీ అధినేత అజిత్‌సింగ్.. భాగ్‌పట్‌లో ఆయన కుమారుడు జయంత్‌సింగ్ పోటీ చేస్తున్నారు. ఘజియాబాద్ నుంచి కేంద్ర మంత్రి వీకేసింగ్, గౌతంబుద్ధనగర్ నుంచి మహేశ్ శర్మ బరిలో ఉన్నారు. మహారాష్ట్రలో పోలింగ్ జరుగనున్న 7 స్థానాల్లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి.. నాగ్‌పూర్ నుంచి, చంద్రాపూర్ నుంచి మరో కేంద్రమంత్రి హన్స్‌రాజ్ ఆహిర్ బరిలో ఉన్నారు.
బీహార్‌లోని 4, అరుణాచల్‌ప్రదేశ్‌లోని 2, ఛత్తీస్‌గఢ్‌లోని ఒకటి, అసోంలోని 4 స్థానాలకు తొలి దశలో ఎన్నికలు జరుగుతున్నాయి. తొలి దశలో ఒడిశాలోని 60 లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరు నలుగురిని లోక్‌సభకు, 28 మందిని అసెంబ్లీకి ఎన్నుకోనున్నారు. పశ్చిమబెంగాల్, జమ్ముకశ్మీర్, మేఘాలయ రాష్ట్రాల్లో కూడా రెండేసి స్థానాలకు, మిజోరం, త్రిపుర, మణిపూర్, నాగాలాండ్, సిక్కిం, అండమాన్ నికోబార్, లక్షద్వీప్ దీవుల్లోని ఒక్కో సీటుకు తొలిదశలో పోలింగ్ జరుగుతోంది.
రాష్ట్రాలు – 18
కేంద్రపాలిత ప్రాంతాలు – 2
లోక్‌సభ స్థానాలు – 91
అభ్యర్థులు – 1,279
ఓటర్లు – 14.21 కోట్లు
పురుషులు – 7.22 కోట్లు
మహిళలు – 6.98 కోట్లు
థర్డ్ జండర్లు – 7,764
పోలింగ్ కేంద్రాలు – 1,70,664
ఎక్కువ అభ్యర్థులున్న నియోజకవర్గం: నిజామాబాద్ (185)
తక్కువ అభ్యర్థులున్న నియోజకవర్గం: నాగాలాండ్ (4)