లోక్ సభ ఎన్నికలపై అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు

  • Published By: chvmurthy ,Published On : January 11, 2019 / 04:10 PM IST
లోక్ సభ ఎన్నికలపై అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు

ఢిల్లీ:  వచ్చే లోక్ సభ ఎన్నికల్లో నాయకుడు లేని రాజకీయ పక్షాలతో మోడీ తల పడుతున్నారని బీజేపీ  జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. రాంలీలా  మైదానంలో  2 రోజుల  పాటు జరిగే  బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఆయన శుక్రవారం  మాట్లాడుతూ  ఒకప్పుడు కాంగ్రెస్ తో దేశంలోని రాజకీయ పార్టీలన్నీ కలిసి పోరాడేవని, ఇప్పుడు బీజేపీతో మిగిలిని పక్షాలన్నీ కలిసి పోరాడుతున్నాయని ఆయన చెప్పారు. దేశంలో 30 ఏళ్ళ సంకీర్ణ ప్రభుత్వాల తర్వాత పూర్తి మెజార్టీతో ఏర్పడిన మొదటి ప్రభుత్వం మోడీ ప్రభుత్వమని అమిత్ షా పేర్కోన్నారు.
మోడీ మళ్లీ అధికారంలోకి రాకుండా చేయటానికి ఏకమవుతున్న పార్టీలన్నీ గత 55 ఏళ్లలో ఏంచేశాయని అమిత్ షా ప్రశ్నించారు. మోడీ అధికారంలోకి వచ్చేంత వరకు దేశంలోని 60 కోట్ల మంది జనాభాకు కనీసం బ్యాంకు ఖాతాలు కూడా లేవని ఆయన తెలిపారు. మోడీ ఆధికారంలోకి వచ్చాక బ్యాంకు ఖాతాలు, గ్యాస్ సిలిండర్లు, మరుగుదొడ్లు వంటి వాటిని అందరికీ అందేలా కృషి చేశారని చెప్పారు. 
వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తే 2022 కల్లా దేశంలోని ప్రతిఒక్కరికి సొంత ఇల్లు ఉండేలా చేస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆయుష్మాన్భారత్ పధకం వల్ల 50  కోట్ల మందికి లబ్ది చేకూరుతోందని ఆయన తెలిపారు.