Pawan Kalyan: వన్ నేషన్ వన్ ఎలక్షన్ దేశానికి ఎంతో అవసరం, 2019 ఎన్నికల్లో ఈవీఎంలతోనే వైసీపీ గెలిచింది- పవన్ కల్యాణ్
అలా కాకుండా వన్ నేషన్ వన్ ఎలక్షన్ అమలు చేస్తే దేశ అభివృద్ధిని ఇంకా పరుగులు పెట్టించ వచ్చని పవన్ కల్యాణ్ అన్నారు.

Pawan Kalyan: వన్ నేషన్ వన్ ఎలక్షన్ దేశానికి అవసరమైన మార్పు అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. భారత దేశంలో ఎన్నికల ఖర్చులు అమెరికా ఎన్నికల ఖర్చులను మించిపోతున్నాయని అన్నారు. ఐదేళ్లలో ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతూనే ఉంటాయని, దీంతో దేశ అభివృద్దిపై కాకుండా ఎన్నికల మీదనే ఫోకస్ పెట్టాల్సి వస్తుందని పవన్ చెప్పారు.
అలా కాకుండా వన్ నేషన్ వన్ ఎలక్షన్ అమలు చేస్తే దేశ అభివృద్ధిని ఇంకా పరుగులు పెట్టించ వచ్చని పవన్ కల్యాణ్ అన్నారు. చెన్నైలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై నిర్వహించిన సెమినార్ లో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. వన్ నేషన్-వన్ ఎలక్షన్ తమిళనాడు రాష్ట్ర కన్వీనర్ తమిళసై సౌందర రాజన్ నేతృత్వంలో ఈ సెమినార్ జరిగింది.
”రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో కేంద్రం కమిటీ వేసింది. ఆ కమిటీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ నిర్వహణ కోసం సూచనలు చేసింది. చాలా మంది వన్ నేషన్ వన్ ఎలక్షన్ కు సపోర్ట్ చేస్తున్నారు. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు మాత్రం వ్యతిరేకిస్తున్నాయి. తమిళనాడు సీఎం స్టాలిన్ కు ఒక రిక్వెస్ట్ చేస్తున్నా. వన్ నేషన్ – వన్ ఎలక్షన్ అంశంపై పునరాలోచన చేయాలి.
కరుణానిధి మద్దతిచ్చిన వన్ నేషన్ వన్ ఎలక్షన్ వ్యవస్థను స్టాలిన్ వ్యతిరేకించడం వింతగా ఉంది. ఇండియా ఎన్నికల ఖర్చులు అమెరికా ఎన్నికల ఖర్చును మించిపోతున్నాయి. ఐదేళ్లలో సుమారు 800 రోజులు ఎన్నికల కోసమే వృథా అవుతున్నాయి. నిత్యం ఎన్నికలు ఉంటుండటంతో అభివృద్ధిపై దృష్టి సారించడం లేదు.
వన్ నేషన్ వన్ ఎలక్షన్.. ఎన్నికల ఖర్చులను గణనీయంగా తగ్గించగలదు. ఒక దేశం, ఒక ఎన్నిక గురించి చాలా తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంశంపై ప్రతిపక్షాలు డబుల్ గేమ్ ఆడుతున్నాయి. మోదీ నాయకత్వంలో దేశంలో అభివృద్ధి పరుగులు పెడుతోంది. తలసరి ఆదాయంలో దేశం నాలుగో స్థానానికి చేరుకుంది” అని పవన్ కల్యాణ్ అన్నారు.
”ఈవీఎంలపై ఆరోపణలు అర్థరహితం. 2019 ఎన్నికల్లో ఈవీఎంలతోనే వైసీపీ గెలిచింది. గెలిస్తే ఈవీఎంలు సూపర్ అంటారు. ఓడితే ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని గగ్గోలు పెడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమి గెలవబోతోంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ దేశానికి అసలైన మార్పు. భారత్ కున్న సామర్థ్యం దృష్ట్యా వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఆచరణ సాధ్యమే. సమస్యలు లేవని చెప్పను, కానీ ఆ సమస్యలను అధిగమించగలం” అని పవన్ కల్యాణ్ అన్నారు.