టెన్షన్.. టెన్షన్..: అయోధ్య కేసులో అంతిమ తీర్పు

అయోధ్య కేసు.. రెండున్నర దశాబ్ధాలకు పైగా పెండింగ్‌లో ఉన్న కేసు. 134 సంవత్సరాలుగా వివాదంలో ఉన్న రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూమి. దేశంలోని కోట్లాది మంది హిందువులు, ముస్లింల మనోభావాలతో ముడిపడిన కేసు ఇది. ఇందులో తీర్పు ఇవ్వడం సుప్రీం కోర్టుకే తలకుమించిన భారమవగా.. ఇప్పటికే కేసుకు సంబంధించి విచారణ ముగియగా.. నేడు(09 నవంబర్ 2019) అంశంపై సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వబోతుంది.
యావత్ దేశం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న తీర్పు.. యావత్ ప్రపంచం ఏం జరుగుతుందా? భారత్ వైపు చూస్తున్న సమయం. ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ రంజన్ గోగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఉదయం 10గంటల 30నిమిషాలకు తీర్పును వెల్లడించబోతుంది. ఈ మేరకు సుప్రీం కోర్టు తన అధికారిక వెబ్‌సైట్‌లో నోటీసును కూడా అప్‌లోడ్ చేసింది.
దీంతో అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచనలు కూడా పంపింది. దేశవ్యాప్తంగా ముఖ్యంగా సున్నితమైన భావాలు ఉన్న ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని రాష్ట్రాలను ఆదేశించింది కేంద్రం. సమస్యాత్మక ప్రదేశాల్లో 144 సెక్షన్ విధించారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచనలు పంపింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యకు కూడా ఇప్పటి పారామిలిటరీ దళాలను తరలించింది కేంద్ర హోంశాఖ.
అయోధ్యలోని 2.77 ఎకరాల భూమిపై హిందూ, ముస్లిం పక్షాల నడుమ దశాబ్దాల నుంచి వివాదం నడుస్తుంది. 1992 డిసెంబర్ 6న హిందువులు కొందరు ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో బాబ్రీ మసీదును కూలగొట్టారు. ఇది శ్రీరాముడు జన్మించిన స్థలంగా.. రామజన్మభూమిగా హిందువులు భావించారు. ఇక్కడ హిందూ దేవాలయాన్ని కూలగొట్టి ముస్లిం రాజులు బాబ్రీ మసీదు కట్టారంటూ హిందువులు బాబ్రీ మసీదు కూలగొట్టారు. దీంతో దేశంలో మత కల్లోలాలు చెలరేగగా.. అప్పుడు దేశవ్యాప్తంగా అల్లర్లలో 2వేల మంది చనిపోయారు.
ఈ క్రమంలో ఆ భూమిని సున్నీ వక్ఫ్‌బోర్డు, నిర్మోహీ అఖాడా, రామ్‌లల్లాకు సమానంగా పంచాలని 2010లో అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీనిని సవాల్‌చేస్తూ సుప్రీం కోర్టులో 14 అపీళ్లు దాఖలయ్యాయి. దీంతో సమస్య పరిష్కారం కోసం మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎఫ్‌ఎం ఖలీఫుల్లా, ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్, సీనియర్ న్యాయవాది శ్రీరాంపంచు నేతృత్వంలో మధ్యవర్తిత్వ సంఘాన్ని కోర్టు ఏర్పాటు చేసింది. అయితే ఈ కమిటీ ప్రయత్నాలు ఫలించలేదు. ఈ క్రమంలోనే నేడు ఈ కేసులో అంతిమ తీర్పు ఇవ్వనుంది సుప్రీం కోర్టు.