ఎన్నికల సిత్రాలు: ‘తృణమూల్ శారీ’ ‘మోడీ జాకెట్’,

కోల్‌కతా: దేశవ్యాప్తంగా జరిగే లోక్ సభ ఎన్నికల్లో పలు చిత్రాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఎవరికి వారు వారి పార్టీల అభ్యర్థుల విజయం కోసం ఎత్తులకు పై ఎత్తులు వేస్తు ఎన్నికల చతురతను చాటుకుంటున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆయా పార్టీల అధినేతలు వినూత్నరీతుల్లో ప్రచారాలను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో వ్యాపారులు కూడా ఎన్నికల సందర్భంగా మార్కెట్ లో మెళకువలను పాటిస్తు..వినియోగదారులను ఆకట్టుకునేందుకు టెక్నిక్స్ ప్రదర్శిస్తున్నారు. గతంలో మోడీ శారీస్ గా హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా పశ్చిమ బెంగాల్‌లో లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ‘మోడీ జాకెట్’, ‘తృణమూల్ శారీ’లు హంగామా చేస్తున్నాయి. బెంగాల్ లో మొత్తం 42 లోక్‌సభ సీట్లలో తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ, వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీలు నువ్వా? నేనా అన్నట్లుగా పోటీపడుతున్నాయి.
ఈ క్రమంలో మార్కెట్‌లోకి రెండు రకాల మోడీ జాకెట్లు వచ్చాయని, ఒకదానిపై ప్రధాని నరేంద్ర మోదీ బొమ్మ..మరోదానిపై పార్టీ గుర్తు కమలం ఉందనీ..ఈ రెండు జాకెట్లు బీజేపీ పార్టీ రంగు కాషాయ వర్ణంలో ఉన్నాయని ఇటువంటి జాకెట్లు మార్కెట్‌లోకి తొలిసారిగా రావటమే కాక..పలువురిని ఆకట్టుకుంటున్నాయని కోల్‌కతాలోని బడాబజార్‌లోగల ఎస్పీ టెక్స్‌టైల్స్ యజమాని పారస్ గంభీర్ తెలిపారు. మరోవైపు తృణమూల్ కాంగ్రెస్ గుర్తు అయిన గడ్డిపూలతో కూడిన తెలుపు, నీలిరంగు గల చీరలు మార్కెట్‌లోకి వచ్చాయని తెలిపారు.
అందుకే తెలుపు రంగు చీరలపై నీలిరంగుతో కూడిన గడ్డిపూలను ప్రింట్ చేయించారు. కాగా తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీకి నీలిరంగంటే ఎంతో ఇష్టం. తెలుపు..నీలిరంగులతో ఉండే చీరలనే ఆమె ఎక్కువగా ధరిస్తుంటారు. కాగా..మమతా అధికారంలోకి వచ్చాక కోల్‌కతాలోని ప్రముఖ పార్కులలో నీలిరంగు పెయింట్‌ను వేయించిన విషయం తెలిసిందే. ఇలా ఎన్నికల్లో పలు చిత్రాలు ఆసక్తిని కలిగిస్తున్నాయి. మరోపక్క బెంగాల్లో కమ్యూనిస్టుల పార్టీ రంగు ఎరుపు రంగు చీరలు కూడా మార్కెట్ లో వచ్చాయంటున్నారు వస్త్ర వ్యాపారులు.