Bangladesh Crisis : మరికొన్ని రోజులు భారత్ లోనే బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా.. షాకిచ్చిన యూకే!

బంగ్లాదేశ్ లో తాజా పరిణామాల నేపథ్యంలో బంగ్లా - భారత్ సరిహద్దుల్లో తాత్కాలికంగా రాకపోకలు నిలిపివేశారు. సరిహద్దులకు బీఎస్ఎఫ్ అదనపు బలగాలను ప్రభుత్వం మోహరించింది.

Bangladesh Crisis : మరికొన్ని రోజులు భారత్ లోనే బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా.. షాకిచ్చిన యూకే!

sheikh hasina

sheikh hasina : రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనలతో కొన్నిరోజులుగా అట్టుడుకుతున్న బంగ్లాదేశ్ సైనిక పాలకుల చేతుల్లోకి వెళ్లిన విషయం తెలిసిందే. దీంతో బంగ్లాదేశ్‌ ప్రధాని పదవికి షేక్‌ హాసీనా రాజీనామా చేసింది. ఆ తరువాత ఆమె దేశం విడిచిపెట్టింది. ప్రస్తుతం షేక్ హసీనా భారత్ లో ఉన్నారు. ఆమె భారత్ నుంచి తన సోదరి నివసించే లండన్ (యునైటెడ్ కింగడమ్) కు వెళ్లొచ్చని వార్తలు వచ్చాయి. అయితే, బ్రిటీష్ మీడియా నివేదికల ప్రకారం.. యూకే రాజకీయ ఆశ్రయం కోసం హసీనా అభ్యర్థనను తిరస్కరించినట్లు తెలిసింది. దీంతో ఆమె భారత్ లోనే ఉన్నారు. ఆమె భారత్ లోనే మరికొన్ని రోజులు ఉండనున్నారు. యూకే ను హసీనా ఆశ్రయం కోరింది. ఆ అనుమతులు వచ్చే వరకు భారతదేశంలో తలదాచుకునేందుకు భారత ప్రభుత్వం తాత్కాలిక అనుమతి ఇచ్చింది. అయితే, ఆమె ఎన్నిరోజులు భారత్ లో ఉంటుందనే అంశంపై  స్పష్టత లేదు. యూకే నుంచి అనుమతి వచ్చేవరకు హసీనా భారత్ లోనే ఉంటారని తెలుస్తోంది.

Also Read : హసీనా బంగ్లాదేశ్ ను వీడటంపై రచయిత్రి తస్లిమా నస్రీన్ ఆసక్తికర పోస్ట్

బంగ్లాదేశ్ లో తాజా పరిణామాల నేపథ్యంలో బంగ్లా – భారత్ సరిహద్దుల్లో తాత్కాలికంగా రాకపోకలు నిలిపివేశారు. సరిహద్దులకు బీఎస్ఎఫ్ అదనపు బలగాలను ప్రభుత్వం మోహరించింది. ఆర్మీ యూనిట్లను కూడా ప్రభుత్వం అప్రమత్తం చేసింది. మరోవైపు బంగ్లాదేశ్ పరిణామాలపై చర్చించేందుకు కేంద్రం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో బంగ్లాదేశ్ లో పరిస్థితులపై భారత్ వైఖరిని విదేశాంగ మంత్రి అఖిలపక్షం దృష్టికి తీసుకెళ్లనున్నారు. మరోవైపు బంగ్లాదేశ్ లో జరుగుతున్న పరిణామాలపై ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. షేక్ హసీనా రాజీనామా సహా బంగ్లాదేశ్ లో నెలకొన్న పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని ఐక్యరాజ్య సమతి తెలిపింది. మరిన్ని హింసాత్మక ఘటనలు జరగకుండా చూడాలని పిలుపునిచ్చింది.

Also Read : షేక్ హసీనా భారత్‌లోకి అడుగుపెట్టే ముందు వాయుసేన ఫైటర్ జెట్లు ఏం చేశాయో తెలుసా!

బంగ్లాదేశ్ లో ప్రజాస్వామ్య పునరుద్దరణకు వీలైనంత వేగంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని యునైటెడ్ కింగ్ డమ్ అభిప్రాయపడింది. అమెరికా కూడా స్పందించింది. బంగ్లాదేశ్ లో పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నామని అగ్రరాజ్యం అమెరికా తెలిపింది. తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు ప్రజాస్వామ్య పద్దతిలో జరగాలని సూచించింది. సైన్యం చొరవ తీసుకొని హింసను తగ్గించేందుకు చేసిన ప్రయత్నాలను అభినందిస్తున్నట్లు అమెరికా జాతీయ భద్రతా మండలి అధికార ప్రతినిధి తెలిపారు. మిగిలిన దేశాలు కూడా బంగ్లాదేశ్ లో తాజా పరిస్థితులపై నిశితంగా గమనిస్తున్నాయి.