Covaxin Phase 3 Data : జూలైలో కొవాగ్జిన్ మూడో ట్రయల్ పూర్తి డేటా.. భారత్ బయోటెక్

కరోనాను ఎదుర్కోవడంలో కొవాగ్జిన్ కంటే కోవిషీల్డ్‌లోనే అధిక యాంటీబాడీలు ఉత్పత్తి అవుతున్నాయంటూ ఇటీవలి అధ్యయనం వెల్లడించింది. దీనిపై కోవాగ్జిన్ తయారీ సంస్థ భారత్ బయోటెక్ స్పందించింది.

Covaxin Phase 3 Data : జూలైలో కొవాగ్జిన్ మూడో ట్రయల్ పూర్తి డేటా.. భారత్ బయోటెక్

Covaxin Phase 3 Data

Updated On : June 9, 2021 / 8:15 PM IST

Covaxin Phase 3 Data : కరోనాను ఎదుర్కోవడంలో కొవాగ్జిన్ కంటే కోవిషీల్డ్‌లోనే అధిక యాంటీబాడీలు ఉత్పత్తి అవుతున్నాయంటూ ఇటీవలి అధ్యయనం వెల్లడించింది. దీనిపై కోవాగ్జిన్ తయారీ సంస్థ భారత్ బయోటెక్ స్పందించింది. ప్రాథమిక పరిశోధనలో చాలా లోపాలు ఉన్నాయని ఒక ప్రకటనలో పేర్కొంది. స్వదేశీ టీకా కోవాగ్జిన్ పనితీరుపై అధ్యయనాన్ని ఇప్పటివరకూ పూర్తిస్థాయిలో రివ్యూ చేయలేదు. శాస్త్రీయంగా కూడా ఆమోదించలేదు. కోవాగ్జిన్ టీకా మొదటి, రెండో డోసుల తర్వాత స్పైక్ ప్రోటీన్ రోగనిరోధకతపై ఇటీవలే ఓ నివేదిక వెల్లడించింది. అందులో కోవాగ్జిన్ కంటే కోవిషీల్డ్ లోనే అధిక యాంటీబాడీలు ఉన్నాయని తేల్చేసింది. అయితే ఈ అధ్యయనాన్ని భారత్ బయోటెక్ కొట్టిపారేసింది. అందులో చాలా లోపాలు ఉన్నాయని పేర్కొంది.

ఈ అధ్యయనాన్ని CTRI వెబ్ సైట్లో కూడా నమోదు చేయలేదని, CDSCO, SEC కూడా ఆమోదించలేదని భారత బయోటెక్ ఒక ప్రకటనలో వెల్లడించింది. కోవాగ్జిన్ మూడో ట్రయల్ డేటాను వచ్చే జూలై నెలలో విడుదల చేయనున్నట్టు సంస్థ పేర్కొంది. అలాగే భారత వ్యాక్సిన్ అయిన కోవాగ్జిన్ పూర్తి లైసెన్స్ కోసం మూడో ట్రయల్ డేటా వచ్చాక దరఖాస్తు చేస్తామని స్పష్టంచేసింది. CDSCOకు సమర్పించే మూడో దశ ట్రయల్ డేటాను అర్థం చేసుకోవడం కీలకమని తెలిపింది. ఫేస్-3 ట్రయల్స్ డేటాను సీడీఎస్ సీవోకు భారత్ బయోటెక్ పంపనుంది.

దీనిపై అనేక సమీక్షలు జరగాల్సి ఉంది. మూడు నెలల సమయం పడుతుంది. మూడో దశ ట్రయల్ డేటాపై అధ్యయనం పూర్తిగా విశ్లేషణ తర్వాత అందుబాటులోకి వస్తుందని, ఆ తర్వాతే పూర్తి లైసెన్స్ కోసం దరఖాస్తు చేయనున్నట్టు భారత్ బయోటెక్ వెల్లడించింది. మూడో దశ డేటా విడుదల ఆలస్యంపై సంస్థ ఆరోపణలు ఎదుర్కోంటోంది. గత జనవరిలోనే కోవాగ్జిన్ అత్యవసర వినియోగానికి ఆమోదం పొందింది. కొవాగ్జిన్ నాల్గో దశ ట్రయల్స్ భారత్ బయోటెక్ రెడీ అవుతోంది.. కొవాగ్జిన్ సామర్థ్యంపై విమర్శలు వస్తుండటంతో మరో దశ ట్రయల్స్ చేయాలని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.