మేఘాలయ హనీమూన్ కేసులో మరో సంచలనం.. సోనమ్ దగ్గర రెండో మంగళసూత్రం.. ఆ తాళికట్టిందెవరు..?
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఇండోర్ వ్యాపారవేత్త రాజా రఘువంశీ హత్యకేసులో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది.

Meghalaya Honeymoon Case
Meghalaya Honeymoon Case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఇండోర్ వ్యాపారవేత్త రాజా రఘువంశీ హత్యకేసులో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. రఘువంశీ సతీమణి, నిందితురాలు సోనమ్ రఘువంశీకి సంబంధించి పోలీసులు ముఖ్యమైన ఆధారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఈ కేసులో కొత్త అంశం తెరపైకి వచ్చింది.
ఇండోర్ వ్యాపారవేత్త రాజా రఘువంశీకి సోనమ్ తో వివాహం జరిగింది. వివాహం జరిగిన తరువాత వారు మేఘాలయ హనీమూన్ కు వెళ్లారు. హనీమూన్ సమయంలో మే23న రాజా రఘువంశీ అదృశ్యం కావడం, సోనమ్ కనిపించకుండా పోవటంతో పోలీసులు రంగంలోకిదిగారు. దీంతో రఘువంశీ మృతదేహంను జూన్2న మేఘాలయలోని ఓ లోయలో గుర్తించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు.. రాజా రఘువంశీని అతని భార్య సోనమ్ తన ప్రియుడు రాజ్ సింగ్ కుష్వాహాతో కలిసి సుపారీ ఇచ్చి హత్య చేసినట్లు గుర్తించారు. దీంతో సోనమ్‌తోపాటు ఆమె ప్రియుడు, సపారీ గ్యాంగ్‌ను పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. తాజాగా.. సోనమ్ రఘువంశీకి సంబంధించిన బ్యాగులో రెండు మంగళసూత్రాలను మేఘాలయ పోలీసులు గుర్తించడం చర్చనీయంశంగా మారింది.
సోనమ్ బ్యాగులో రెండు మంగళసూత్రాలను పోలీసులు గుర్తించారు. పెళ్లి సమయంలో భర్త రాజా కుటుంబం ఒక మంగళసూత్రాన్ని ఇవ్వగా.. మరొక మంగళసూత్రం గురించి అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సోనమ్ బ్యాగులో ఉన్న రెండో మంగళసూత్రం ఎవరు ఇచ్చారు.. ఆమె ప్రియుడు రాజా ఇచ్చాడా..? సోనమ్ కు ఇంతకుముందే పెళ్లి అయిందా..? లేదా షిల్లాంగ్ నుంచి తిరిగి వచ్చిన తరువాత ప్రియుడు రాజ్ ను వివాహం చేసుకుందా..? లేదా రెండో పెళ్లి చేసుకోవాలని ముందుగానే ప్లాన్ తో మంగళసూత్రం కొనుక్కుందా..? ఇలా అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీంతో బ్యాగులో రెండో మంగళసూత్రం ఎందుకు ఉంది.. అది ఎవరు ఇచ్చారనే అంశంపై పోలీసులు సోనమ్ ను ప్రశ్నించనున్నట్లు తెలిసింది.
సోనమ్ బ్యాగులో రెండు మంగళ సూత్రాలు ఉండటంపై రాజా రఘువంశీ అన్నయ్య విపిన్ స్పందించారు. సోనమ్ రఘువంశీని హత్య చేయించిన తరువాత అజ్ఞాతంలో ఉన్నప్పుడు తన ప్రియుడు రాజ్ కుస్వాహాను రహస్యంగా పెళ్లి చేసుకొని ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశాడు. సోనమ్ సోదరుడు గోవింద్‌ను కూడా రఘువంశీ సోదరుడు విపిన్ విమర్శించాడు. తన సోదరి సోనమ్‌ను కలవాలని ఉందని గోవింద్ మీడియా ముఖంగా పేర్కొన్నాడు. దీనిపై విపిన్ స్పందిస్తూ.. అతను సోనమ్‌ను కలవొచ్చు.. ఆమెను కాపాడేందుకు లాయర్ ద్వారా కూడా ప్రయత్నాలు చేస్తుండొచ్చు.. కానీ, అతను ఇదంతా చేయాలనుకుంటే.. అతని సోదరి అరెస్టు తరువాత మా ఇంటికి ఎందుకు వచ్చాడు..? మా కుటుంబం భావోద్వేగాలతో అతను ఆడుకున్నట్లే అవుతుంది..? సోనమ్, ఆమె కుటుంబం మమ్మల్ని నిరంతరం మోసం చేస్తున్నారు అంటూ విపిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజా రఘువంశీ హత్యకు సంబంధించి కేసులో మేఘాలయ పోలీసులు అరెస్టు చేసిన ఎనిమిది మంది ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.