కశ్మీరీ యువతులతో పెళ్లి .. అరెస్టు చేసిన పోలీసులు

జమ్మూ కశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు విభజన తర్వాత దేశంలో ఎవరైనా కశ్మీర్ లో భూములు కొనుగోలు చేయవచ్చు. వ్యాపారాలు చేసుకోవచ్చు. కశ్మీరి యువతులను పెళ్లిళ్లు చేసుకోవచ్చు. కొంత మందైతే కశ్మీరీ యువతుల పై చౌకబారు విమర్శలు కూడా చేశారు. ఈ పరిస్ధితుల్లో ప్రేమలో పడిన కశ్మీరీ యువతులు తమకు నచ్చిన యువకుడితోనో, తమ ప్రియుడితోనో వివాహ బంధంతో ఒక్కటవుతున్నారు. ఇంతకు ముందు కశ్మీరీ యువతులు వేరే రాష్ట్రాల యువకులను పెళ్ళి చేసుకుంటే.. వారికి ఉండే కొన్ని ప్రత్యేక హక్కులను కోల్పోయేవారు. కానీ మోడీ ప్రభుత్వ తీసుకున్న నిర్ణయంతో ఇలాంటి అడ్డంకులన్నీ తొలగిపోయాయి. కాగా ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కశ్మీర్ లోని రాంబన్ జిల్లాకు చెందిన అక్కాచెల్లెళ్లను పెళ్లి చేసుకున్న ఇద్దరు బీహారీ అన్నదమ్ములను పోలీసులు అరెస్టు చేశారు.
వివరాల్లోకి వెళితే … సుపాల్ లోని రామ్‌విష్ణుపూర్ గ్రామానికి చెందిన పర్వేజ్, తవ్రేజ్‌లు ఇద్దరు అన్నదమ్ములు. వీరు జమ్మూలోని రాంబన్‌లో వడ్రంగి పని చేస్తున్నారు. స్ధానికంగా ఉన్న ఇద్దరు కశ్మీరీ యువతులను వీరు ప్రేమించారు. యువతులిద్దరు కూడా అక్కాచెల్లెళ్లు కావడం విశేషం. ఈ క్రమంలో ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఈ రెండు జంటలు పెళ్లి చేసుకుని ఒక్కటయ్యాయి.
అనంతరం పర్వేజ్, తవ్రేజ్‌లు తమ భార్యలను తీసుకుని బీహార్ లోని తమ స్వగ్రామానికి వచ్చారు. కానీ యువతుల తండ్రి మాత్రం పర్వేజ్ సోదరులు తన కుమార్తెలను కిడ్నాప్ చేశారని వారి మీద పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో జమ్మూకశ్మీర్ పోలీసులు, బీహార్ వెళ్లి అక్కడి అధికారుల సాయంతో పర్వేజ్ సోదరులను అరెస్ట్ చేశారు. యువతులిద్దురు తాము ఇష్ట పూర్వకంగానే వివాహం చేసుకున్నామని చెప్పినా పోలీసులు మాత్రం అన్నదమ్ములను అరెస్టు చేసి జమ్మూ తీసుకువెళ్ళారు. ఈ ఘటనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.