బీహార్‌లో ఎన్నికల వేళ ‘ఫ్రీ’ జపం.. ప్రజలపై నితీశ్ సర్కార్ వరాల జల్లు.. ఉచిత విద్యుత్‌పై కీలక ప్రకటన.. మహిళా రిజర్వేషన్లు, ఉద్యోగాల భర్తీ కూడా..

బీహార్ రాష్ట్రంలో మరికొద్ది నెలల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ రోజుకో పథకంపై ప్రకటన చేస్తున్నారు.

బీహార్‌లో ఎన్నికల వేళ ‘ఫ్రీ’ జపం.. ప్రజలపై నితీశ్ సర్కార్ వరాల జల్లు.. ఉచిత విద్యుత్‌పై కీలక ప్రకటన.. మహిళా రిజర్వేషన్లు, ఉద్యోగాల భర్తీ కూడా..

Bihar CM Nitish Kumar

Updated On : July 17, 2025 / 2:36 PM IST

Bihar Election 2025: బీహార్ లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం రంగం సిద్ధం చేస్తోంది. మరో రెండు మూడు నెలల్లో ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది. ఈ క్రమంలో మరోసారి అధికారాన్ని నిలబెట్టుకునేందుకు సీఎం నితీశ్ కుమార్ సర్కార్ ప్రజలపై వరాల జల్లు కురిపిస్తోంది. దీంతో ప్రస్తుతం బీహార్ రాష్ట్రంలో ఫ్రీ ఫ్రీ ఫ్రీ అనే నినాదం మార్మోగిపోతుంది.

బీహార్ రాష్ట్రంలో మరికొద్ది నెలల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని మళ్లీ అధికారంలోకి వస్తే అమలు చేయబోయే పథకాలపై ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ రోజుకో ప్రకటన చేస్తున్నారు. తద్వారా ప్రజలపై వరాల జల్లు కురిపిస్తున్నారు. ఇప్పటికే మహిళలకు రిజర్వేషన్లు, ఉద్యోగాలపై ప్రకటన చేసిన నితీశ్ కుమార్.. తాజా మరో పథకాన్ని ప్రకటించారు. 125 యూనిట్ల లోపు కరెంట్ బిల్లులను చెల్లించాల్సిన అవసరం లేదని ప్రకటించారు. ప్రస్తుతం నెల జులై బిల్లుల నుంచే ఈ పథకాన్ని అమలు చేస్తామని నితీశ్ కుమార్ చెప్పారు. ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా ప్రకటన చేశారు.

ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తన ఎక్స్ ఖాతాలో ఇలా పేర్కొన్నారు. ‘మేము మొదటి నుంచి అందరికీ చౌక ధరలకు విద్యుత్ అందిస్తున్నాము. ఇప్పుడు ఆగస్టు 1వ తేదీ నుంచి.. అంటే జూలై నెల బిల్లు నుండి రాష్ట్రంలోని అన్ని గృహ వినియోగదారులు 125 యూనిట్ల వరకు విద్యుత్ కోసం ఎటువంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని మేము నిర్ణయించాము. దీని వల్ల రాష్ట్రంలోని 1కోటి 67లక్షల కుటుంబాలకు ప్రయోజనం కలుగుతుంది. రాబోయే మూడేళ్లలో కుటీర్ జ్యోతి పథకం కింద ఈ గృహ వినియోగదారుల నుంచి అనుమతి తీసుకొని వారి ఇళ్ల పైకప్పులపై లేదా సమీపంలోని స్థలంలో సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయడం ద్వారా ప్రయోజనం చేకూర్చాలని కూడా మేము నిర్ణయించాం. మూడేళ్లలో రాష్ట్రంలో 10వేల మెగావాట్ల వరకు సౌరశక్తి అందుబాటులో ఉంటుంది’ అంటూ నితీశ్ కుమార్ పేర్కొన్నారు.


ఎన్నికల వేళ పలు పథకాలను నితీశ్ కుమార్ ఇప్పటికే ప్రకటించారు. వాటిలో.. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 35శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పారు. వచ్చే ఐదేళ్లలో కోటి ఉద్యోగాలను కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని నితీశ్ ఇప్పటికే ప్రకటించారు.
మరోవైపు.. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల ఖాళీల వివరాలను వెంటనే అందజేయాలని, వాటిని భర్తీ చేసేందుకు ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్ఈ) 4 నిర్వహణ ప్రక్రియను ప్రారంభించాలని విద్యాశాఖను ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆదేశించారు.