Rajasthan CM : రాజస్థాన్‌లో బీజేపీ గెలిస్తే సీఎం ఎవరు? సీఎం అభ్యర్థి ఎంపిక మోదీ, అమిత్ షాలకు పెద్ద పరీక్షే కాబోతుందా?
రాజస్థాన్ రాష్ట్రంలో బీజేపీ విజయం సాధిస్తే ముఖ్యమంత్రి పదవికోసం కనీసం ఐదు మంది నేతలు పోటీపడుతున్నారు. ఈ క్రమంలో వారిలో ఒకరిని ఎంపిక చేసి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించటం మోదీ, అమిత్ షా, జేపీ నడ్డాలకు పెద్దపరీక్షేనని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

Rajasthan CM
Rajasthan BJP : రాజస్థాన్ లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ రాష్ట్రంలో 199 స్థానాలకు నవంబర్ 25న పోలింగ్ జరిగింది. 74.62శాతం పోలింగ్ నమోదైంది. ప్రస్తుతం ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. గురువారం సాయంత్రం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ఈసారి బీజేపీ అధికారంలోకి వస్తుందని తేల్చాయి. ఇండియా టుడే, ఏబీపీ, ఇండియా టీవీ, టైమ్స్ నౌ, సీఎన్ఎస్ న్యూస్18, రిపబ్లిక్ టీ సర్వే సంస్థలు బీజేపీ అధిక స్థానాల్లో విజయం సాధిస్తుందని అంచనా వేశాయి. ఒకవేళ ఈ రాష్ట్రంలో బీజేపీ విజయం సాధిస్తే సీఎం ఎవరు అవుతారనే చర్చ ఆసక్తికరంగా మారింది.
Also Read : Telangana Assembly Election 2023 : బీఆర్ఎస్ నేతలపై ఎన్నికల ఉల్లంఘన కేసులు ..
రాజస్థాన్ రాష్ట్రంలో బీజేపీ విజయం సాధిస్తే ముఖ్యమంత్రి పదవికోసం కనీసం ఐదు మంది నేతలు పోటీపడుతున్నారు. ఈ క్రమంలో వారిలో ఒకరిని ఎంపిక చేసి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించటం మోదీ, అమిత్ షా, జేపీ నడ్డాలకు పెద్దపరీక్షేనని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఎందుకంటే మరో నాలుగైదు నెలల్లో లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. ఒకవేళ సీఎం ఎంపికలో బీజేపీ హైకమాండ్ ఎలాంటి తప్పుడు నిర్ణయం తీసుకున్నా ఆ ప్రభావం లోక్ సభ ఎన్నికల్లో పార్టీపై పడే అవకాశం ఉంది. మరోవైపు ఐదేళ్లు ప్రభుత్వాన్ని నడిపే విషయంలోనూ అనేక విబేధాలు తలెత్తోచ్చు. దీంతో రాజస్థాన్ లో ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లు బీజేపీ అధికారంలోకి వస్తే అక్కడ సీఎం అభ్యర్థిని ఎంపిక చేయడం బీజేపీ అగ్రనాయకత్వానికి పెద్ద సవాల్ గా మారుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, రాజస్థాన్ బీజేపీ సీనియర్ నేత వసుంధర రాజే రెండు సార్లు రాజస్థాన్ సీఎంగా పనిచేశారు. మరోసారి ఆమె సీఎం పీఠాన్ని ఆశిస్తున్నారు. అయితే, వసుంధర, బీజేపీ హైకమాండ్ కు మధ్య తీవ్ర వైరం నడుస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నాయకులుసైతం వసుంధర రాజే పట్ల అసంతృప్తితో ఉన్నారని, 2003లో ఆమె తొలిసారి ముఖ్యమంత్రి అయిన తరువాత సంఘ్ నేతలతో ఆమెకు విబేధాలు మొదలయ్యాయని బీజేపీ నేతలు పేర్కొంటున్నారు. ఈ ఎన్నికల బరిలో వసుందర రాజేకు అనుకూల ఎమ్మెల్యేలు 50మందికిపైగా ఉన్నారు. మరో 10 మంది స్వతంత్ర అభ్యర్థులు సన్నిహితులుగా ఉన్నారు. వీరంతా ఎన్నికల్లో విజయం సాధించే పరిస్థితికూడా ఉన్నట్లు తెలుస్తోంది. కనీసం 50 మంది ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టుకుంటే వసుందర రాజేను సీఎం అభ్యర్థిగా పక్కన పెట్టే సాహసం హైకమాండ్ చేయదని రాజకీయ విశ్లేషకుల అంచనా. మరోవైపు రాజ్ సమంద్ ఎంపీ దియా కుమారిసైతం సీఎం అభ్యర్థి బరిలో ఉన్నారు. వసుంధరలాగే దియాకూడా రాజకుటుంబానికి చెందిన వ్యక్తి. బీజేపీ హైకమాండ్, ముఖ్యంగా ప్రధాని మోదీకి నమ్మదగిన వ్యక్తిగా ఆమెను పరిగణిస్తారు. ఆమె ప్రస్తుతం జైపూర్ లోని విద్యాధర్ నగర్ స్థానం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఆమె విజయం సాధించి, బీజేపీ అధికారంలోకి వస్తే.. దియా కుమారి పేరు ముఖ్యమంత్రి అభ్యర్థి పోటీదారుల్లో ప్రముఖంగా వినిపించే అవకాశం ఉంది. మరోవైపు ఆమెను ముఖ్యమంత్రిని చేస్తే భవిష్యత్తులో జాట్ లు, గుర్జర్లు పార్టీ నుంచి వీడిపోతారనే భయం పార్టీ అధిష్టానంలో ఉంది.
రాజస్థాన్ బీజేపీలో అర్జున్ రాఘ్ మేఘ్వాల్ సీఎం పదవికి ప్రముఖంగా వినిపిస్తున్న వారిలో ఉన్నారు. మేఘ్వాల్ ప్రస్తుతం మోదీ క్యాబినెట్ లో మంత్రిగా ఉన్నారు. ప్రధానికి అత్యంత సన్నిహితుడిగా బీజేపీ వర్గాలు పేర్కొంటాయి. మేఘావాల్ కు దళితుల కోటా నుంచి మోదీ కేబినెట్ లో చోటుదక్కింది. మేఘ్వాల్ బీజేపీలో ఏ వర్గానికి చెందిన వ్యక్తికాదు. వసుంధర హయాంలో బీజేపీలో చేరారు. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ మేఘ్వాల్ పేరును సీఎం అభ్యర్థిగా బీజేపీ హైకమాండ్ పరిగణలోకి తీసుకుంటే వసుంధర రాజే బహిరంగంగా వ్యతిరేకించే అవకాశాలు ఉన్నాయి. లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా పేరుకూడా సీఎం అభ్యర్థుల జాబితాలో జోరుగా వినిపిస్తోంది. బిర్లా రాజస్థాన్ బీజేపీకి సీనియర్ నేత. టికెట్ పంపిణి తరువాత రాష్ట్రంలో తలెత్తిన ఇబ్బందులను పరిష్కరించడంలో కీలక భూమిక పోషించాడు. బిర్లాకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆశీస్సులు కూడా ఉన్నాయి. ప్రస్తుతం లోక్ సభ స్పీకర్ గా బిర్లా కేంద్ర రాజకీయాలు చేస్తున్నారు. మరోవైపు సతీష్ పునియా, రాజేంద్ర రాథోడ్, బాబా బాల్కనాథ్, గజేంద్ర సింగ్ షెకావత్ కూడా సీఎం పోటీకి పోటీపడుతున్నారు. అయితే, అనేక కారణాలవల్ల వీరంతా రేసులో చాలా వెనుకబడి ఉన్నారు.
రాజస్థాన్ లో బీజేపీ అధికారంలోకి వస్తే ఉత్తరప్రదేశ్ ఫార్ములాను అమలు చేయొచ్చని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. 2017లో యూపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ ఒక ముఖ్యమంత్రిని, ఇద్దరు డిప్యూటీ సీఎంలను చేసింది. రాజస్థాన్ లో కూడా బీజేపీ ఇదే పద్దతిలో అధికార సమీకరణాన్ని పరిష్కరిస్తుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.