Assembly Elections 2023: రాజస్థాన్‭లో మళ్లీ కీలకంగా మారనున్న బీఎస్పీ.. ఈసారి మద్దతు ఎవరికి? ఎలా ఇస్తారో అప్పుడే చెప్పేశారు

అఖిలేష్ యాదవ్ సైతం ఇదే వాదన వినిపిస్తున్నారు. కాంగ్రెస్ పేరు ప్రస్తావించకుండా ప్రస్తుత అధికార పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తోందని ఆయన ఆరోపించారు.

Assembly Elections 2023: రాజస్థాన్‭లో మళ్లీ కీలకంగా మారనున్న బీఎస్పీ.. ఈసారి మద్దతు ఎవరికి? ఎలా ఇస్తారో అప్పుడే చెప్పేశారు

రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3న అంటే ఆదివారం జరుగుతుంది. దీనికి ముందు బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర శాఖ పెద్ద ప్రకటన చేసింది. కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలకు మెజారిటీ రాదని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. దీంతో ఇరు పార్టీలు స్వతంత్రులు, రెబల్స్ తలుపులు తడుతుండగా మరోవైపు బీఎస్పీ భారీ ప్రకటనే చేసింది. బీఎస్పీ రాజస్థాన్ యూనిట్ ప్రెసిడెంట్ భగవాన్ సింగ్ బాబా మాట్లాడుతూ రాష్ట్రంలో పార్టీ పూర్తి బలంతో ఎన్నికల్లో పోరాడిందని, ఈసారి 6 మందికి పైగా అభ్యర్థులు విజయం సాధిస్తారని చెప్పారు.

వాస్తవానికి 2008, 2018 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీకి బీఎస్పీ మద్దతు ఇచ్చింది. అయితే ప్రభుత్వం ఏర్పడ్డ అనంతరం బీఎస్పీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ తనపైపుకు తిప్పుకుని పార్టీలో కలుపుకుంది. ఈ రెండు సందర్భాల్లోను బీఎస్పీకి కాంగ్రెస్ ద్రోహం చేసిందని భగవాన్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ఎమ్మెల్యేలు భయపెట్టి కొనుగోలు చేశారని ఆయన ఆరోపించారు. ఈసారి ఎవరికీ బేషరతుగా మద్దతివ్వబోమని తమ జాతీయ అధ్యక్షురాలు మాయావతి స్పష్టం చేశారని గుర్తు చేశారు. గెలుపొందిన అభ్యర్థులకు మంత్రివర్గంలో చోటు కల్పిస్తేనే ఏ పార్టీకి మద్దతు ఇచ్చేది ఆలోచిస్తామని అన్నారు.

అఖిలేష్ యాదవ్ సైతం ఇదే వాదన వినిపిస్తున్నారు. కాంగ్రెస్ పేరు ప్రస్తావించకుండా ప్రస్తుత అధికార పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తోందని ఆయన ఆరోపించారు. దీంతో బీజేపీకి బీఎస్పీ మద్దతు ఇవ్వబోతోందా అనే ప్రశ్నలు వస్తున్నాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ నుంచి ఆరుగురు గెలిచారు. అనంతరం కాంగ్రెస్‌కు మాయావతి భేషరతు మద్దతు ఇచ్చారు. ఆ తర్వాత ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్‌లో చేరారు. అయితే ఈసారి తమ ప్రయోజనాలు చూసుకోకుండా ఏ పార్టీకి మద్దతు ఇచ్చేది లేదని బీఎస్పీ తేల్చి చెప్పింది. కాంగ్రెస్, బీజేపీలు తమ సొంత ప్రయోజనాలు చూసుకుంటాన్నాయని, తాము కూడా తమ స్వప్రయోజనాలకే మొదటి ప్రాధాన్యత ఇస్తామని ఆ పార్టీ రాజస్థాన్ చీఫ్ భగవాన్ సింగ్ తెలిపారు.

ఫలితాల ప్రకటనకు ముందు బీఎస్పీ ఈ ఎత్తుగడ కాంగ్రెస్, బీజేపీలకు ఊరటనిస్తుండగా.. మరోవైపు షరతులతో కూడిన మద్దతు ఇచ్చే అంశం కూడా ఇరు పార్టీల టెన్షన్‌ను పెంచింది. మరి బీఎస్పీని కింగ్‌మేకర్‌గా ప్రజల్లోకి తీసుకువస్తారా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే 2023 ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో బీఎస్పీ అతి తక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు అన్ని సర్వేలు తేల్చి చెప్పాయి.