డబ్బుల బ్యాగ్ అలాగే ఉంది : వ్యాపారవేత్తను కాల్చి చంపారు

అతని పేరు రాజుల్ గుప్తా. వయస్సు 44 ఏళ్లు. ఢిల్లీలో నివాసం. ఎలక్ట్రికల్ బిజినెస్ చేస్తుంటారు. బాగానే సంపాదించారు. ఇదే సమయంలో శత్రువులు కూడా పెరిగిపోయారు. ఈ క్రమంలోనే సోమవారం అర్థరాత్రి (సెప్టెంబర్ 16, 2019) తన ఇంటి ముందే దారుణంగా హత్య చేయబడ్డారు. ఢిల్లీలో కలకలం రేపిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
వ్యాపారం ముగించుకుని ఇంటికి వచ్చిన గుప్తా.. పార్కింగ్ స్థలంలో ఉన్నారు. ఈ సమయంలోనే ముగ్గురు వ్యక్తులు వచ్చారు. నేరుగా గుప్తా దగ్గరకు వెళ్లారు. తుపాకీతో గుండెలపై కాల్చాడు. దగ్గర నుంచి గుండెలపై తుపాకీ పెట్టి మరీ కాల్చినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. స్పాట్ లోనే కుప్పకూలిపోయారు. సౌండ్ కూడా రాలేదంటున్నారు కుటుంబ సభ్యులు. గుప్తా హత్యకు గురైన కొద్ది సమయం తర్వాత.. ఇంట్లో కుటుంబ సభ్యులు అతని రాక కోసం ఎదురుచూస్తున్నారు.
ఇంటి బయటకు వచ్చారు. పార్కింగ్ ప్లేస్ లో గుప్తా నిర్జీవంగా పడి ఉన్నారు. గుండెపోటు వచ్చినట్లు ఉందని భావించారు. వెంటనే ఇంట్లోకి తీసుకెళ్లారు. అంతే షాక్. దుస్తుల నిండా రక్తం. వెంటనే చొక్కా తొలగించి చూస్తే బుల్లెట్ గాయాలు ఉన్నాయి. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు కుటుంబ సభ్యులు.
గుప్తా మెడలో మందపాటి పెద్ద బంగారు చైన్ ఉండాలని.. అది కనిపించటం లేదని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే.. మెడలోని బంగారు చైన్ లాక్కెల్లిన వారు.. అతని దగ్గర ఉన్న డబ్బుల బ్యాగ్ ను వదిలేశారు. ఆ బ్యాగ్ లో లక్షల్లో డబ్బు ఉంది. దీంతో పోలీసులకు కొత్త డౌట్స్ వస్తున్నాయి. డబ్బుల కోసమే చంపితే క్యాష్ బ్యాగ్ ఎందుకు వదిలేశారు అనే కోణంలోనూ విచారణ చేస్తున్నారు.
కేవలం మెడలోని బంగారు చైన్ మాత్రమే ఎందుకు తీసుకెళ్లారు అనే దానిపైనా విచారణ చేస్తున్నారు. వ్యక్తిగత కక్షలతో ఈ హత్య జరిగి ఉంటుందని.. దోపిడీ దొంగల పనే అన్నట్లుగా కేసును తప్పుదారి పట్టించటానికి బంగారం గొలుసు దోపిడీ చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంటి ఆవరణలోని పార్కింగ్ ప్లేస్ లో వ్యాపారి హత్య ఢిల్లీలో కలకలం రేపుతోంది.