CAAతో ముస్లింలకు ఇబ్బంది లేదు.. NPR తప్పనిసరి: రజనీకాంత్

CAAతో ముస్లింలకు ఇబ్బంది లేదు.. NPR తప్పనిసరి: రజనీకాంత్

Updated On : February 5, 2020 / 8:06 AM IST

పౌరసత్వ చట్టం(సీఏఏ) వల్ల ముస్లింలకు ఎటువంటి సమస్య ఉండదంటున్నారు సూపర్ స్టార్ రజనీకాంత్. ‘ఒకవేళ అదే సమస్య తలెత్తితే వారి గురించి గొంతెత్తడానికి నేనే ముందుంటా’ అని రజనీ స్పష్టం చేశారు. బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడిన రజినీ.. దేశవ్యాప్తంగా సీఏఏపై జరుగుతున్న ఆందోళనల గురించి మాట్లాడారు. దాంతో పాటు నేషనల్ పాపులేషన్ రిజిస్ట్రార్(ఎన్పీఆర్)పై స్పందించాడు.

‘సీఏఏ అనేది ముస్లింలకు ఎటువంటి ఇబ్బంది కలిగించదు. దానివల్ల ఏదైనా సమస్య జరిగిందంటే అందుకోసం గొంతెత్తే వాళ్లలో నేనే ముందుంటా. దేశం విడగొట్టిన తర్వాత భారత్‌ నుంచి వెళ్లిపోయిన వారు తిరిగి ఇక్కడే ఉండాలని ఎలా అనుకుంటారు’ అని ప్రశ్నించాడు. 

‘భారత ప్రజలకు సీఏఏపై ఎలాంటి సమస్యలు లేవు. కేవలం కొన్ని పార్టీలు మాత్రమే స్వార్థ ప్రయోజనాల కోసం.. సీఏఏకు వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొడుతున్నాయి’ అని చెప్పుకొచ్చాడు. గతంలో ఓసారి ‘ఆందోళనలు, గొడవలు చేయడం వల్ల సమస్యలు పరిష్కారం కావని, దేశమంతా ఏకమై ఉండాలని, జాతి భద్రత సంక్షేమం చూసుకోవాలని’ ట్వీట్ ద్వారా చెప్పాడు. 

మరో స్టార్ నటుడు కమల్‌హాసన్ మాత్రం సీఏఏకు, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా పలుమార్లు సంచలన వ్యాఖ్యలుచేశాడు. పార్లమెంట్‌లో మెజార్టీ దక్కితే ప్రజల నుంచి మద్ధతు దొరికినట్లు కాదని తెలిపాడు.