మధ్యప్రదేశ్‌లో మారిన రాజకీయం…బీజేపీకి షాకిచ్చిన 12మంది కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు

మధ్యప్రదేశ్ లో 21మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇప్పటికే పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. రాజీనామా చేసినవారిలో ఆరుగురు మంత్రులు కూడా ఉన్నారు. రాజీనామాలు చేసిన వారిలో 19మంది ప్రస్తుతం బెంగళూరు శివార్లలోని ఓ రిసార్ట్ లో ఉన్న విషయం తెలిసిందే. అయితే వీరందరూ నిన్న కాంగ్రెస్ ను వీడి ఇవాళ కాషాయ కండువా కప్పుకున్న జ్యోతిరాధిత్య సింధియా వర్గమే. అయితే సింధియా లానే వీరందరూ కూడా మరికొన్ని రోజుల్లో కాషాయ గూటికి చేరతారని అందరూ భావించారు. అయితే ఇక్కడే రెబల్ ఎమ్మెల్యేలు సంచలన ట్విస్ట్ ఇచ్చారు.
బెంగళూరులో ఉన్న 19మందిలో 12మంది బీజేపీలో చేరేందుకు ఇష్టపడటం లేదని సమాచారం. బీజేపీలో చేరే ఉద్దేశ్యంతో తాము బెంగళూరుకి రాలేదని,మహారాజ్ కోసమే తాము బెంగళూరుకి వెళ్లినట్లు రిసార్ట్ లో ఉన్న ఓ ఎమ్మెల్యే ఇవాళ ఉదయం మీడియాతో చెప్పినట్లు సమాచారం. మరోవైపు ఈ రెబల్ ఎమ్మెల్యేల కదలికల పట్ల బీజేపీ నిశితంగా పరిశీలిస్తోందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
మరోవైపు కాంగ్రెస్ కు రాజీనామా చేసిన రెబల్ ఎమ్మెల్యేలు తన వద్దకు రావాల్సిందేనని మధ్యప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ ఎన్‌పీ ప్రజాపతి అన్నారు. జ్యోతిరాదిత్య సింధియాకు మద్దతుగా ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి 21 మంది.. తమ రాజీనామాలకు గల కారణాలు ఇంకా వెల్లడించలేదని ఆయన అన్నారు. జ్యోతిరాదిత్య విధేయులు వారి రాజీనామాలను ఈమెయిల్ ద్వారా పంపించినప్పటికీ మంగళవారం హోలీ కారణంగా వాటిని పరిశీలించలేదని స్పీకర్ తెలిపారు.
చట్టం ప్రకారం.. రాజీనామా చేసిన వ్యక్తులు స్పీకర్‌ను ముందస్తుగా కలవాలి. ఆ తర్వాత వారి రాజీనామాలకు గల కారణాలను, వాస్తవాలను పరిశీలించాల్సి ఉంటుందని స్పీకర్ అన్నారు. మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్ ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు పూర్తైంది. కాంగ్రెస్ నుంచి పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంలో కమల్‌నాథ్ ప్రభుత్వం కూలిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే సింధియా వర్గానికి చెందిన 13 మంది ఎమ్మెల్యేలు తమతోనే ఉన్నారని కమల్‌నాథ్ చెప్పుకొస్తున్నారు.
See Also | 13దేశాల్లో పారిశ్రామిక వేత్తలతో నాకు పరిచయాలున్నాయి, ఏపీకి ప్రత్యేక హోదా కోసం కృషి చేస్తా