Posters : మోడీ వ్యతిరేక పోస్టర్ల కేసు.. ఎఫ్ఐఆర్ లు రద్దు చేయాలని సుప్రీంలో పిటిషన్

దేశంలో కరోనా వైరస్ కట్టడిలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమయ్యిందని ఆరోపిస్తూ ఇటీవల ఢిల్లీ వీధుల్లో మోడీకి వ్యతిరేకంగా పోస్టర్లు వేయడం కలకలం రేపిన విషయం తెలిసిందే.

Posters : మోడీ వ్యతిరేక పోస్టర్ల కేసు.. ఎఫ్ఐఆర్ లు రద్దు చేయాలని  సుప్రీంలో పిటిషన్

Posters

Updated On : May 17, 2021 / 7:52 PM IST

Posters Against PM దేశంలో కరోనా వైరస్ కట్టడిలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమయ్యిందని ఆరోపిస్తూ ఇటీవల ఢిల్లీ వీధుల్లో మోడీకి వ్యతిరేకంగా పోస్టర్లు వేయడం కలకలం రేపిన విషయం తెలిసిందే. జాతీయ వ్యాక్సినేషన్‌ పాలసీని ప్రశ్నిస్తూ ఢిల్లీలో గత కొన్ని రోజులుగా..”మోడీ జీ, ఆప్నే హమారే బచ్చోన్ కీ వ్యాక్సిన్ విదేశ్ క్యో భేజ్ దియా?(మోడీజీ, మన పిల్లలకు వేయాల్సిన వ్యాక్సిన్లు…విదేశాలు ఎందుకు పంపారు)”అని పేర్కొనబడిన పోస్టర్ లు దర్శనమిచ్చాయి.

దీంతో మోడీని ప్రశ్నిస్తూ దేశ రాజధాని వీధుల్లో పోస్టర్లు వేసిన 24 మందిని అరెస్టు చేయడంతో పాటు పలువురిపై ఎఫ్ఐఆర్ నమోదుచేశారు ఢిల్లీ పోలీసులు. ఢిల్లీలోని రోహిణి, ఈశాన్య ఢిల్లీ, ఔటర్ ఢిల్లీ, ద్వారక, పశ్చిమ ఢిల్లీ, ఉత్తర ఢిల్లీ పరిధిలో కేసులు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. అయితే, ఢిల్లీ పోలీసుల ఎఫ్‌ఐఆర్‌లకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఈ ఎఫ్‌ఐఆర్‌లను రద్దు చేయాలంటూ ప్రదీప్‌ కుమార్‌ అనే వ్యక్తి పిటిషన్‌ దాఖలు చేశారు. భావ ప్రకటనా స్వేచ్ఛ, మాట్లాడే హక్కు ఉన్నాయని పిటిషన్ లో పేర్కొన్నారు. పోస్టర్లను అంటించిన వ్యక్తులపై ఎఫ్‌ఐఆర్స్‌, ఎటువంటి చర్యలు తీసుకోరాదని ఢిల్లీ పోలీసులను ఆదేశించాలని పిటిషన్‌ లో ప్రదీప్‌ కుమార్‌ పేర్కొన్నారు.

ఇక, పోస్టర్ ల విషయంలో పలువురిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేయడంపై స్పందించిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. నన్ను కూడా అరెస్ట్ చేయండి అంటూ ఆదివారం ఓ ట్వీట్ చేశారు. నలుపు రంగు బ్యాక్‌గ్రౌండ్‌పై తెల్లని అక్షరాలతో.. ‘మోడీజీ మన పిల్లలకు వేయాల్సిన వ్యాక్సిన్లను విదేశాలకు ఎందుకు పంపించారు?’ అంటూ రాహుల్ ప్రశ్నించారు. మరోవైపు, మాజీ కేంద్ర మంత్రి జైరామ్ రమేశ్ శనివారం రాత్రి ధైర్యముంటే తనను అరెస్టు చేయాలని పోలీసులకు సవాల్ విసిరారు. ప్రధానికి వ్యతిరేకంగా పోస్టర్లు పెట్టడం నేరమా.. మోడీ పీనల్ కోడ్ తో ఇండియా రన్ అవుతుందా. మహమ్మారి చెలరేగుతున్న సమయంలో ఢిల్లీ పోలీసులు పని లేకుండా ఉన్నారా.. రేపు ఉదయం అవే పోస్టర్లను నా గోడ మీద అంటిస్తా.. వచ్చి నన్ను పట్టుకోండి అంటూ ఢిల్లీ పోలీసులను, అమిత్ షాను ట్యాగ్ చేస్తూ మాజీ కేంద్ర మంత్రి జైరామ్ రమేశ్ కూడా ఓ ట్వీట్ చేశారు.