లాక్‌డౌన్‌ను కొనసాగాంచాల్సిందేనా? కేసీఆర్ వాదనపై మోడీ సమాలోచనలు: కేంద్ర ప్రభుత్వ వర్గాలు

  • Published By: chvmurthy ,Published On : April 7, 2020 / 12:51 PM IST
లాక్‌డౌన్‌ను కొనసాగాంచాల్సిందేనా? కేసీఆర్ వాదనపై మోడీ సమాలోచనలు: కేంద్ర ప్రభుత్వ వర్గాలు

Updated On : April 7, 2020 / 12:51 PM IST

ఏప్రిల్ 14 తర్వాత కూడా లాక్ డౌన్‌ కొనసాగించాలి. అమెరికా పరిస్థితి మనకొద్దు. కరోనాను మనం తట్టుకోలేం. లాక్‌డౌన్ మినహా మరో గత్యంతరం లేదన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ విజ్ఞప్తిని కేంద్రం పరిగణలోకి తీసుకుందన్నది తాజా సమాచారం. తెలంగాణతోపాటు చాలా రాష్ట్రాలూ 21 రోజుల లాక్‌డౌన్‌ను కొనసాగించాలని కోరుతున్నాయి. నిపుణులూ మాటకూడా ఇదే. కరోనా కట్టడి కాలేదు. ఈ సమయంలో కట్టు తెగితే మొదటికే మోసం వస్తుందన్నది అనేక అంతర్జాతీయ సంస్థల మాట.

మార్చి 24న లాక్‌డౌన్ ను ప్రకటించిన ప్రధాని మోడీ, ఏప్రిల్5, ఆదివారం నాడు, ఈ మహమ్మారిని అడ్డుకోవడానికి ప్రజలు దీర్ఘకాలిక పోరాటానికి సమాయత్తం కావాలన్నారు. కేబినేట్ సమావేశంలోనూ, ఆయన మంత్రులను సిద్ధంచేశారు. దశల వారీగా లాక్‌డౌన్ ఎత్తివేయడానికి ప్రణాళికలను తెప్పించుకున్నారు.

కేబినేట్ నిర్ణయాలను ప్రకటించడానికి మీడియా ముందుకొచ్చిన మంత్రి జవదేకర్, జాతిప్రయోజనాల కోసం సరైన సమయంలో సరైన నిర్ణయాన్ని తీసుకొంటామన్నారు. ప్రభుత్వ సంస్థలు, నిపుణులు పరిస్థితిని అధ్యయనం చేస్తున్నారని కూడా అన్నారు. అంటే, దశలవారీగా లాక్‌డౌన్ ఎత్తివేత తప్పదని అందరూ అనుకున్నారు.

సరిగ్గా ఈ సమయంలోనే తెలంగాణ సీఎం కేసీఆర్, లాక్‌డౌన్ కొనసాగించాల్సిందేనన్నతన అభిప్రాయాన్ని చర్చకు పెట్టారు. ప్రధాని మోడీకి కూడా ఇదే చెప్పానన్నారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌ది మరో ఆలోచన. పాజిటివ్ కేసులున్న ప్రాంతాల్లో కర్ఫ్యూ కొనసాగిస్తూనే, మిగిలిన ప్రాంతాల్లో దశల వారీగా లాక్‌డౌన్‌ను ఎత్తివేయాలన్నారు.

అంతెందుకు బీజేపీ అధికారంలో ఉన్న అస్సాం ప్రభుత్వం, కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా సమర్ధిస్తానని తేల్చేసింది. ఇలాంటి అభిప్రాయమే ఉత్తరప్రదేశ్, కర్నాటక ప్రభుత్వాలది. కర్నాటకలో రెడ్‌జోన్స్ ఉన్నాయి. వాటిలో రెండు వారాల పాటు లాక్‌డౌన్ కొనసాగించాల్సిందేనని మంత్రి సుధాకర్ కె అన్నారు. ఉత్తర‌ప్రదేశ్ ఉద్దేశమూ అదే.

వీడియో కాన్ఫరెన్స్‌తో కేబినేట్‌ మీట్‌ను నిర్వహించిన మోడీ కరోనాను అడ్డుకోవడానికి యుద్ధ ప్రాతిపదికన సిద్ధం కావాలన్నారు. హాట్‌స్పాట్స్ లేని చోట్ల నెమ్మదిగా ప్రభుత్వ విభాగాలు కార్యకలాపాలు మొదలుపెట్టాలన్నది కేంద్రం ఆలోచన. అదేసమయంలోనే, లాక్‌డౌన్ ఎత్తివేసిన తర్వాత దశల వారీగా ప్రజలను రోడ్లమీదకు ఎలా అనుమతించాలన్నదానిపై ప్రణాళికలు సిద్ధం చేయాలని కూడా ప్రధాని ఆదేశించారు.