ఇప్పట్లో వదిలేలా లేరు : తీహార్ జైల్లోనే చిదంబరం మళ్లీ అరెస్ట్

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ నేత చిదంబరాన్ని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ED) బుధవారం (అక్టోబర్ 16)ఉదయం అధికారికంగా అరెస్ట్ చేసింది. ఢిల్లీ ప్రత్యేక కోర్టు అనుమతి మేరకు చిదంబరాన్ని అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు తీహార్ జైల్లో విచారించారు. ఈ కేసులో విచారణ అనంతరం చిదంబరాన్ని జ్యుడిషీయల్ కస్టడీ కోరుతూ దర్యాప్తు సంస్థ కోర్టును ఆశ్రయించనుంది. 74ఏళ్ల సీనియర్ న్యాయవాది, కాంగ్రెస్ నేత అయిన చిదంబరం 55 రోజుల నుంచి సీబీఐ కస్టడీలో ఉన్నారు.
ఆగస్టు 21న సీబీఐ ఆయన్ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. (పీఎంఎల్ఏ) మనీలాండరింగ్ యాక్ట్ చట్టం కింద చిదంబరంపై ఈడీ క్రిమినిల్ కేసు నమోదు చేసింది. ఇదిలా ఉండగా, చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం ఈ రోజు ఆయన్ను తీహార్ జైల్లో కలిశారు. తన తండ్రిని కలిసేందుకు ఇక్కడికి వచ్చానని అన్నారు.
తన తండ్రిపై జరిగే విచారణ బోగస్ విచారణ అంటూ విమర్శించారు. మరోవైపు సీబీఐ కూడా ఐఎన్ఎక్స్ మీడియా అవినీతి కేసులో చిదంబరంతో పాటు ఆయన కుమారుడు కార్తీ చిదంబరం పేరుతో చార్జ్ షీట్ నమోదు చేయనుంది.
2007లో మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ గవర్నమెంట్ హయాంలో కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్న చిదంబరం.. తన కుమారుడు కార్తీ చిదంబరం ఆదేశాల మేరకు INX మీడియాలో విదేశీ నిధులను భారీ మొత్తంలో సంస్థలోకి విడుదల చేసేందుకు సంతకం చేసినట్టు ఆరోపణలు వచ్చాయి.
ఈ విషయంలో కార్తీక చిదంబరం కిక్ బ్యాక్ లు అందుకున్నారని సీబీఐ కూడా ఆరోపించింది. ఈ నిధులను విదేశాలలో నిల్వ చేసినట్లు ఏజెన్సీ అనుమానిస్తోంది. కార్తీ చిదంబరంను ప్రశ్నించిన సీబీఐ.. కోర్టు అనుమతి లేకుండా అతన్ని దేశం విడిచి వెళ్ళడానికి వీలు లేదని తెలిపింది.