దేశవ్యాప్తంగా అక్టోబర్ 1 నుంచి తెరుచుకోనున్న సినిమా హాళ్లు

దేశవ్యాప్తంగా సినిమా హాళ్లు ఓపెన్ కానున్నాయి. అక్టోబర్ 1 నుంచి సినిమా హాళ్లు తెరుచుకోనున్నాయని తెలుస్తోంది. ఈ మేరకు కేంద్ర హోం సెక్రటరీ, సమాచార శాఖ సెక్రటరీతో ఆలిండియా సినీ ఇండస్ట్రీ పెద్దలు చర్చలు జరిపారు. ఈ చర్చలో ఆలిండియా ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షుడు హాసన్, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అధ్యక్షులు సి కళ్యాణ్, సౌత్ ఇండియా ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కాట్రగడ్డ ప్రసాద్, ఏషియన్ మల్టీప్లెక్స్ సునీల్ నారంగ్ తదితరులు పాల్గొన్నారు.
త్వరలో ప్రకటన వచ్చే అవకాశం:
రైళ్లు, మెట్రో సర్వీసులు, విమానాలకు పర్మిషన్స్ ఇచ్చిన నేపథ్యంలో థియేటర్స్ తెరవడానికి సినీ పరిశ్రమ ప్రతినిధులు పర్మిషన్ కోరారు. ఇందుకు కేంద్రం సానుకూలంగా స్పందించింది. కోవిడ్ నేపథ్యంలో వివిధ శాఖల సమన్వయంతో మరోసారి సమావేశం అయ్యే అవకాశం ఉంది. థియేటర్స్ ఓపెనింగ్ పై కేంద్రం మార్గదర్శకాలు రెడీ చేస్తోంది. మరి కొన్ని రోజుల్లో కేంద్రం నుంచి థియేటర్స్ ఓపెనింగ్ పై సానుకూల ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
5 నెలలుగా మూతబడ్డ థియేటర్లు:
కరోనా వైరస్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన రంగాల్లో సినిమా రంగం కూడా ఉంది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ కారణంగా సుమారు ఐదు నెలలకు పైగా సినిమా థియేటర్లు మూతబడ్డాయి. దీని వల్ల విడుదలకు సిద్ధంగా ఉన్న ఎన్నో తెలుగు సినిమాలు ల్యాబ్‌లలోనే ఉండిపోయాయి. చిన్న చిన్న సినిమాలు ఓటీటీ ద్వారా విడుదలైపోతున్నాయి. అయితే, భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన స్టార్ హీరోల సినిమాలను ఓటీటీ విడుదల చేసే ధైర్యం చేయలేకపోతున్నారు దర్శక నిర్మాతలు. థియేటర్లు తెరుచుకోవడానికి ప్రభుత్వం ఇచ్చే అనుమతుల కోసం వేచి చూస్తున్నారు.
https://10tv.in/india-coronavirus-cases-and-death-updates-8-september-2020/
ఇప్పటికే రెస్టారెంట్లు, మాల్స్, జిమ్ లకు పర్మిషన్:
వారి ఎదురు చూపులకు త్వరలోనే తెరపడనుందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. దేశవ్యాప్తంగా అన్‌లాక్ 4లో భాగంగా సినిమా థియేటర్లు తెరుచుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇస్తుందని అనుకున్నారు. మూడో దశ అన్‌లాక్‌లో భాగంగా ఇప్పటికే రెస్టారెంట్లు, మాల్స్, జిమ్, యోగా కేంద్రాలు తెరుచుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే.
థియేటర్లలో పాటించాల్సిన నిబంధనలివే:
సినిమా థియేటర్లు తెరుచుకోవడానికి కేంద్ర ప్రభుత్వం కఠినమైన నిబంధనలు పెట్టనుందని సమాచారం.
* ప్రేక్షకులు సోషల్ డిస్టెన్స్ పాటించేలా సీట్ల మధ్య ఖాళీలు ఉంచుతూ కూర్చోబెట్టాలి.
* అంటే, ఇద్దరు ప్రేక్షకుల మధ్య ఒకటి లేదా రెండు సీట్లు వదిలిపెట్టాలి.
* అలాగే, షో ప్రారంభం కావడానికి ముందు.. పూర్తయిన తర్వాత థియేటర్ మొత్తాన్ని శానిటైజ్ చేయాలి.
* కరోనా వైరస్ చల్లని వాతావరణంలో బతుకుతుంది కాబట్టి.. థియేటర్‌లో టెంపరేచర్ 24 డిగ్రీల కన్నా తక్కువ ఉండకుండా చూసుకోవాలి.
* ప్రేక్షకులు కచ్చితంగా మాస్క్ ధరించే థియేటర్ లోపలికి వెళ్లాలి.